close

గురువారం, ఫిబ్రవరి 27, 2020

ప్రధానాంశాలు

నిబంధనలు పాటించకుండా.. రయ్‌.. రయ్‌!

రెండు రోజుల్లో 129 బస్సులపై కేసులు
 రూ.15 లక్షల వరకు జరిమానా విధింపు

ఈనాడు, హైదరాబాద్‌: సంక్రాంతి వేళ ప్రైవేటు బస్సులు నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి. ఇప్పటికే ప్రయాణికులు ఊళ్లకు వెళ్లి తిరుగుప్రయాణంలో ఉన్నారు. ఈ రద్దీని సొమ్ము చేసుకునేందుకు బస్సులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. ప్రయాణికుల భద్రతను లెక్క చేయకుండా అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. గ్రేటర్‌ వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో రవాణా శాఖాధికారులు చేపట్టిన దాడుల్లో మొత్తం 129 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు గుర్తించామని నగర జేటీసీ పాండురంగనాయక్‌ తెలిపారు. 8 బస్సులను సీజ్‌ చేసినట్లు మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో పన్నులు ఇతర జరిమానాల కింద సుమారు రూ.15.11 లక్షలు వసూలు చేశారు. కాంట్రాక్టు క్యారియర్ల కింద లైసెన్సులు పొందిన పలు ప్రైవేటు బస్సులు స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్నాయి. దీంతో భారీస్థాయిలో రవాణాశాఖ ఆదాయం కోల్పోతోంది. మిగతా రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సంక్రాంతి నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న చాలా బస్సుల గుట్టు రట్టయింది. ముఖ్యంగా ముంబయి, బెంగళూరు, విజయవాడ రూట్లలో ఎక్కువ బస్సులు నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు.

వారు నిర్ణయించేదే టిక్కెట్‌ ధర
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి సికింద్రాబాద్‌కు రైలులో థర్డ్‌ ఏసీ టిక్కెట్‌ ధర రూ.1,200 వరకు ఉండగా.. ప్రైవేటు బస్సుల్లో రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. అదే వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కు రూ.2,500 రేటు నిర్ణయించారు. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో వారు ఎంత చెబితే అంత అన్నట్లు మారింది. కొన్ని బస్సుల్లో సీటింగ్‌ సామర్థ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా పెంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేగంగా వెళ్తూ కొన్నిసార్లు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు డ్రైవర్లు మద్యం తాగి నడుపుతున్నట్లు కూడా గతంలో అధికారులు గుర్తించారు. రైలు టిక్కెట్‌తో పోల్చుకుంటే మూడు రెట్లు ధరలు ఎక్కువ చెల్లించి బస్సులు ఎక్కుతున్నా సరే తమ ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందని ప్రయాణికులు వాపోతున్నారు. సంక్రాంతి సెలవులకు వెళ్లిన అనేక మంది శని, ఆదివారాల్లో నగరానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలాస, శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైళ్లలో సీట్లన్నీ ఇప్పటికే అయిపోయాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు డొక్కు బస్సులను కూడా దూరప్రాంతాలకు నడిపిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ రెండు రోజులపాటు రవాణాశాఖ అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.