close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

పనుల పేరుతో.. పంచుకుతింటున్నారు

 ఎలక్ట్రిక్‌ పనుల్లో 60-70 శాతం వరకు అవినీతి
 నిఘా లేక జలమండలి ఆదాయానికి భారీ గండి
అక్రమాలకు నెలవుగా గుత్తేదారు వ్యవస్థ
ఈనాడు, హైదరాబాద్‌

జలమండలిలోని గుత్తేదారుల వ్యవస్థ అక్రమాలకు నెలవుగా మారింది. కొందరు అధికారుల కనుసన్నల్లోనే చాలామంది కాంట్రాక్టర్లు పనిచేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని, కొన్ని డివిజన్లలో అసలు పనులే చేయకుండా...తప్పుడు ప్రతిపాదనలతో నిధులు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రికల్‌ పనుల విషయంలో 60-70 శాతం వరకు అక్రమాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. ఇక క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు లెక్కా పత్రం ఉండటం లేదు. ఇందులో అధిక స్థాయిలో అవినీతి చోటు చేసుకుంటోంది. చాలామందికి ఉన్నతాధికారులు అండదండలు ఉండటంతో వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. ఇలా ఏటా రూ.కోట్లలోనే బోర్డు ఆదాయానికి కొందరు టోకరా వేస్తున్నారు. చింతల్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, హఫీజ్‌పేట, మణికొండ, మియాపూర్‌ ఇలా అనేక డివిజన్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు విజిలెన్సుకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. అక్రమాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. కొత్త కనెక్షన్ల మంజూరు నుంచి క్షేత్రస్థాయిలో పైపుల మార్పిడి, మ్యాన్‌హోళ్ల మరమ్మతులు తదితర పనుల కోసం గ్రేటర్‌ వ్యాప్తంగా దాదాపు 350 వరకు సివిల్‌, గ్రీన్‌బ్రిగేడ్‌ గుత్తేదారులు పనిచేస్తున్నారు. 15-20 ఏళ్లుగా చాలామంది ఒకేచోట ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొందరు అధికారులకు సంబంధించిన బంధువులు, స్నేహితులు కూడా ఉన్నట్లు సమాచారం. తాము ఏమి చేసినా...చెల్లుతుందనే ఉద్దేశంతో అక్రమాలకు తెరతీస్తున్నారు. బిల్లుల విషయంలో కూడా కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. కొన్నిసార్లు దాడులకు పాల్పతున్నారు.

అక్రమాల పర్వం ఇలా...
ప్రతి డివిజన్‌కు నెలకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద రూ.5-10 లక్షల వరకు కేటాయిస్తుంటారు. అత్యవసర పనులకు ఈ నిధులు ఉపయోగించాలి. ఈ నిధుల్లో రూ.1-2 లక్షల వరకు ఎలక్ట్రికల్‌ పనులకు ఖర్చు చేస్తుంటారు. ఇందులో 70 శాతం నిధులు పక్కదారి పడుతున్నాయి. మోటార్లు రిపేర్లు చేసినట్లు...స్విచ్‌లు కొన్నట్లు చూపి మాయం చేస్తున్నారు. కనీసం బిల్లులు కూడా అందుబాటులో పెట్టడం లేదు. చింతల్‌ డివిజన్‌లో విజిలెన్సు ఆరా తీయగా...ఈ పనులకు కేటాయించిన దాదాపు 70 శాతం నిధులు పక్కదారి పట్టినట్లు తేలింది. మిగతా చాలా డివిజన్లలో ఇదే తంతు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
* చిన్న చిన్న పైపులైన్లు మార్పిడి...మ్యాన్‌హోళ్ల రిపేర్లకు ప్రతి డివిజన్‌లో నెలకు రూ.5-8 లక్షలకు ఖర్చు చేస్తున్నట్లు చూపుతున్నారు. వీటికి ఎలాంటి ఆడిటింగ్‌ ఉండదు. అత్యవసర విభాగం కింద వీటిని ఖర్చు చేస్తుంటారు. ఇందులో 50 శాతం పనులు చేయకుండా...మరో 50 శాతం అరకొర పనులతో నిధులు దిగమింగుతున్నారు. తప్పుడు ప్రతిపాదనలు చేసి నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. బిల్లులు మంజూరు చేసే అధికారులకు ఇందులో 30-40 శాతం వరకు కమీషన్‌ రూపంలో చెల్లిస్తున్నారు. దీంతో అధికారులు కూడా వారితో మిలాఖాత్‌ అవుతున్నారు.
* కొత్త కనెక్షన్‌ మంజూరు తర్వాత ఆ సమాచారం స్థానిక గ్రీన్‌బ్రిగేడ్‌ గుత్తేదారుకు వెళుతుంది. ఉచితంగా కనెక్షన్‌ ఇవ్వాలి. అయితే నల్లా ఇచ్చే సమయంలో సిబ్బంది వినియోగదారుల నుంచి వసూళ్లకు పాల్పడతున్నారు. ఇక జలమండలే పైపులు కూడా సరఫరా చేస్తుంది. కానీ గుత్తేదారులు నల్లా వినియోగదారులతో కొత్త పైపులు కొనిపిస్తున్నారు. బోర్డు ఇచ్చే పైపుల్లో నాణ్యత ఉండదని వారిని నమ్మిస్తున్నారు. ఇలా మిగిలిన పైపులను అక్రమ నల్లాల కోసం వినియోగిస్తున్నారు.
* ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని గ్రీన్‌ బ్రిగేడ్‌ గుత్తేదారులు పనులు చేయిస్తున్నారు. కనీసం ఎక్కడ పనులు జరుగుతున్నాయో...కూడా కొందరు గుత్తేదారులు చూడటం లేదు. కమీషన్లకు అలవాటు పడ్డ అధికారులు కూడా ఈ అక్రమాలపై శీతకన్ను చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు అధికారులు కూడా తమ అనుయాయుల పేరుతో ఈ వ్యవస్థను నిర్వహిస్తూ...వారికి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
* తాజాగా గుడిమాల్కాపూర్‌ డివిజన్‌-3లో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా పైపులైన్‌ వేశారు. ఈ పనులు కొందరు అధికారుల కనుసన్నల్లో గుత్తేదారులు చేయడం విశేషం. అంతేకాకుండా జలమండలి అనుమతులు లేకుండానే ప్రైవేటు సిబ్బంది ఆధ్వర్యంలో పాత కనెక్షన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంపై విమర్శలు విన్పిస్తున్నాయి.
* డివిజన్‌ 12లో గతంలో కొన్ని పైపులు వేశారు. వాస్తవానికి మూడు అడుగుల లోతులో వీటిని ఏర్పాటు చేయాలి. అడుగులోపే పనులు చేసి నిధులు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. చాలా డివిజన్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. అంతేకాక సెక్షన్ల పరిధిలో ఉండాల్సిన గుత్తేదారులు నిత్యం డివిజన్‌ కార్యాలయాల్లో తిష్ఠ వేసి బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కొన్నిసార్లు వారిపై దాడికి కూడా దిగుతున్నారు.
* గతంలో గోషామహల్‌ డివిజన్‌లో ఉద్యోగులపై గుత్తేదారు చేయిచేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చింతల్‌ జలమండలి ఉద్యోగులను తిట్టడంతో ఉన్నతాధికారి సదరు కాంట్రాక్టరును పిలిపించి మందలించినట్లు తెలిసింది.
* డివిజన్లలో జరుగుతున్న ఈ తరహా అక్రమాలకు సంబంధించి విజిలెన్సు విభాగం 56 కేసులు నమోదు చేసింది. ఇందులో 90 శాతం అక్రమ నల్లాల్లో గ్రీన్‌ బ్రిగేడ్‌ గుత్తేదారుల పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేవలం చిన్న చిన్న పనుల్లోనే ఏటా రూ.40-50 కోట్ల వరకు అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుత్తేదారుల పనులపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అక్రమాల పర్వం బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు

నిర్బంధ ‘శిక్ష’ణ.. ప్రాణాలకేదీ రక్షణ?

సోమవారం వచ్చిందంటే రెండు లేదా మూడు పరీక్షలు రాయాల్సిందే..! ఇక దానికి ముందు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టడీఅవర్‌ పేరిట రుద్దుడు.. అలా అని వారంలో మిగిలిన రోజులు స్వేచ్ఛగా ఉంటుందా.. అంటే అసలే ఉండదు. రెగ్యులర్‌ సబ్జెక్టులు చదవాలి.. ప్రవేశ పరీక్షలకు సిద్ధమవ్వాలి.. నగరంలో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు సాగిస్తున్న ర్యాంకుల వేటలో పడి విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. పంజరంలా భావిస్తున్న కళాశాలల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా.. అని భావిస్తున్నారు. ఏదో రకంగా బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో విహరిస్తూ అదుపు తప్పి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో  చేరితే చదువు తప్ప వేరే ధ్యాస లేదన్నట్లుగా కనీసం బయట అడుగుపెట్టే పరిస్థితి ఉండటం లేదు. కళాశాలలో చేరినప్పట్నుంచి ఇంటర్‌ విద్యార్థులపై చదవుల భారం వేస్తుండటంతో.. వారు పడుతున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.