close

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

ప్రధానాంశాలు

కారుకే పట్టణం

  మేడ్చల్‌లో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తెరాసకే
  రంగారెడ్డిలో మిశ్రమ ఫలితాలు
ఈనాడు, హైదరాబాద్‌

పుర పోరులో కారు జోరు చూపించింది.. పట్టణ ఓటర్లు గులాబీకి పట్టం కట్టారు. అక్కడక్కడ చిన్నపాటి బ్రేకులు పడినా..‘మెజార్టీ’లో దూసుకెళ్లింది. మొత్తంగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలకుగాను 5 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలను తెరాస తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌ మూడు మున్సిపాలిటీల్లో అధిక్యంలో నిలవగా.. జల్‌పల్లి మున్సిపాలిటీలో  ఎంఐఎం ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక తుక్కుగూడ, ఆమన్‌గల్‌ మున్సిపాలిటీల్లో కమలం వికసించగా.. బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లతోపాటు నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా తెరాస దూకుడు ప్రదర్శించినా రంగారెడ్డి జిల్లాలో మిశ్రమ ఫలితాలు సాధించింది. 15 పట్టణాలకుగాను అయిదు చోట్లే స్పష్టమైన సత్తా చాటింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కారు వేగానికి బ్రేక్‌ పడింది. మీర్‌పేట, బడంగ్‌పేటలో తెరాస ఆధిక్యత సాధించలేకపోయింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆదిభట్ల, తుర్కయాంజల్‌, పెద్దఅంబర్‌పేటలో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మణికొండ, నార్సింగిలోనూ కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అలానే బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌తో పాటు 5 మున్సిపాలిటీల్లో తెరాస విజయం సాధించింది.

మేడ్చల్‌ జిల్లాలో క్లీన్‌స్వీప్‌: ఇక్కడ కారు ధాటికి ఏ పార్టీ నిలవలేకపోయింది. మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలో జవహర్‌నగర్‌, పీర్జాదిగూడ, బోడుప్పల్‌ కార్పొరేషన్లు, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్‌, తూంకుంట, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. కుత్బుల్లాపూర్‌ పరిధిలో నిజాంపేట కార్పొరేషన్‌తోపాటు దుండిగల్‌, కొంపల్లి మున్సిపాలిటీలున్నాయి. ఇవన్నీ తెరాస ఖాతాలోనే చేరాయి. ఒక్క బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో కచ్చితంగా సగం సీట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్రులతో కలిసి మేయర్‌ పీఠం దక్కించుకోవడం దాదాపు లాంఛనమే. మెజార్టీ స్థానాల్లో ప్రతిపక్షాల కంటే స్వతంత్రులతోనే తెరాస పోటీ పడాల్సి వచ్చింది.

ఆ నాలుగు చోట్ల: రెండు కార్పొరేషన్లు, మరో రెండు మున్సిపాలిటీల్లో ఓటర్లు ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టలేదు. మేయర్‌/ఛైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మెజార్టీ రాలేదు. మణికొండలో 20వార్డులకుగాను ఎనిమిదింటితో కాంగ్రెస్‌ ప్రథమంగా నిలవగా, భాజపా ఆరు స్థానాలతో రెండోస్థానం, తెరాస అయిదింటితో మూడోస్థానానికి పరిమితమైంది. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. నార్సింగిలో 18వార్డులకు ఎనిమిదింటిని కాంగ్రెస్‌, ఏడింటిని తెరాస దక్కించుకున్నాయి. భాజపా ఒకటి, స్వతంత్రులు రెండు చోట్ల విజయం సాధించారు. ఇక్కడ స్వతంత్రులు ఎటువైపు మొగ్గుచూపితే వారికే ఛైర్మన్‌ పీఠం.  బడంగ్‌పేట, మీర్‌పేటలోనూ ఓటర్లు ఎవరికి స్పష్టమైన ఆధిక్యం ఇవ్వలేదు. మీర్‌పేటలో తెరాస, భాజపా హోరాహోరీగా పోరాడాయి. 19 స్థానాలతో తెరాస , 16స్థానాలతో భాజపా సరిపుచ్చుకున్నాయి.

తెరాస అభ్యర్థి రికార్డు
- పోలైన ఓట్లలో 90 శాతం సాధించిన కాసాని శిరీష
నిజాంపేట, న్యూస్‌టుడే: పుర ఎన్నికల్లో ఓ అభ్యర్థి అరుదైన రికార్డు సృష్టించారు. మేడ్చల్‌ జిల్లా నిజాంపేట నగర పాలక సంస్థలోని 21వ వార్డు(బాచుపల్లి) నుంచి కాసాని శిరీష (తెరాస), అమలేశ్వరి (భాజపా), కృష్ణవేణి (తెదేపా) బరిలో నిలిచారు. ఈ వార్డులో మొత్తం 3,614 ఓట్లుండగా 1,922 మంది ఓటు వినియోగించుకున్నారు. శనివారం జరిగిన లెక్కింపులో శిరీష ఏకంగా 1,698 ఓట్లను సాధించారు. ఆమె సాధించినవి 90 శాతం ఉండటం విశేషం. ప్రత్యర్థులకు అందనంతగా 1,577 ఓట్ల ఆధిక్యాన్ని సాధించి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోనే ఇది అరుదైన రికార్డు అని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.