close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

ప్రధానాంశాలు

మల్లారెడ్డికి ఆనందం.. సబితకు నిరుత్సాహం

‘మేడ్చల్‌’లో భారీ విజయం
‘మహేశ్వరం’లో తెరాసకు చేదు ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి మేడ్చల్‌ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు పూర్తి ఫలితాలు సాధించారా అంటే ఒకరికి అవునని ఒకరికి కాదన్న సమాధానం వస్తోంది. మేడ్చల్‌ జిల్లాల్లో మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి నూటికి నూరు శాతం ఫలితాలు సాధించగా రంగారెడ్డి జిల్లాలో మాత్రం మంత్రి సబితా రెడ్డి పూర్తిస్థాయిలో ఫలితాలను సాధించలేదు. ఇప్పుడిదే చర్చనీయాంశమవుతోంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో 21 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థలు ఉన్నాయి. మేడ్చల్‌ బాధ్యతను ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా బాధ్యతను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీసుకున్నారు.

ప్రతికూలతలోనూ విజయం
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేని పక్కన పెట్టి మేడ్చల్‌లో సీహెచ్‌ మల్లారెడ్డిని బరిలోకి దింపింది తెరాస. భారీ మెజార్టీతో గెలుపొంది మంత్రివర్గంలో బెర్తును దక్కించుకున్నారు. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలో మంత్రిగా చక్రం తిప్పారు. నిన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి టిక్కెట్‌ను తన అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డికి ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలోని మూడుచింతలపల్లి జడ్పీటీసీగా తన బావమరిది శ్రీనివాస్‌ రెడ్డిని పోటీ చేయించారు. అక్కడ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించడంతో డీలాపడ్డారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలో తొమ్మిది మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్‌లు ఉన్నాయి. కాంగ్రెస్‌ తరఫున ఎంపీ రేవంత్‌రెడ్డి వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. మేడ్చల్‌ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా మల్లారెడ్డికి అప్పగించారు. టిక్కెట్లను అమ్ముకున్నారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్టీ ముఖ్యులు కూడా ఇక్కడ ఏం జరుగుతోందంటూ ఆరా తీయడంతో మంత్రి మల్లారెడ్డికి పురపోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అల్లుడు  రాజశేఖర్‌రెడ్డికి కొన్ని మున్సిపాల్టీల బాధ్యతలను అప్పగించారు. తానుకూడా రాత్రిపగలూ తేడా లేకుండా పర్యటనలు వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ఫలితంగా అన్ని చోట్లా తెరాస జెండా ఎగిరింది.

తొలి సవాలుకు దీటైన జవాబివ్వని సబిత
కాంగ్రెస్‌ తరఫున మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి..ఆ తర్వాత తెరాసలో చేరారు. గతేడాది సెప్టెంబరులో మంత్రివర్గంలో బెర్తు దక్కించుకున్నారు. అప్పటి నుంచి మంత్రిగా రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పురపాలిక ఎన్నికల రూపంలో తొలి సవాలు ఎదురయింది. బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీలు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఈ నాలుగు చోట్ల టిక్కెట్‌ ఆశించి భంగపడిన కొందరు రెబల్స్‌గా బరిలోకి దిగడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరికల నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. నాలుగు చోట్లా గెలుపు తథ్యమని తెరాస శ్రేణులు ఘంటాపథంగా చెప్పాయి. తీరా చూస్తే.. ప్రతికూల ఫలితాలొచ్చాయి. జల్‌పల్లి మున్సిపాలిటీని ఎంఐఎం, తుక్కుగూడను భాజపా దక్కించుకున్నాయి. బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ కార్పొరేషన్లలోనూ ఇతర పార్టీల నుంచి గట్టిపోటీ ఎదురయ్యింది. భాజపా బలపడటం తెరాస శ్రేణులకు మింగుడు పడటం లేదు. మొత్తం మీద చూస్తే తన నియోజకవర్గంలోనే కాకుండా రంగారెడ్డి జిల్లా మున్సిపల్‌ ఫలితాల్లో తనదైన ముద్రవేయలేకపోయారు మంత్రి సబిత. ఈ జిల్లాలో 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉంటే తెరాస విజయం సాధించింది కేవలం అయిదింటిలోనే. మరో నాలుగింటిలో హంగ్‌ ఏర్పడగా మిగిలిన స్థానాలను భాజపా, కాంగ్రెస్‌, ఎంఐఎం దక్కించుకోవడం తెరాసకు మింగుడుపడని వ్యవహారమే.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.