close

ఆదివారం, మార్చి 29, 2020

ప్రధానాంశాలు

పోరు ఏదైనా ‘కారు’దే జోరు

 ప్రతి ఎన్నికల్లో ఎగురుతున్న గులాబీ జెండా
 మూడు జిల్లాల్లో తిరుగులేని శక్తిగా తెరాస
ఈనాడు, హైదరాబాద్‌

పోరు ఏదైనా తెరాసదే జోరు.. ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురేస్తూ ప్రత్యర్థి పార్టీలను అచేతనంగా మారుస్తుంది. క్రమక్రమంగా బలం పెంచుకుంటూ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. తాజా పురపాలిక ఎన్నికల ఫలితాల్లోనూ కారు దూసుకెళ్లింది. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 14 మున్సిపాలిటీలు, 4 మున్సిపల్‌ కార్పొరేషన్లలో స్పష్టమైన మెజార్టీని సాధించింది. మూడు, నాలుగు మినహా మిగిలిన చోట్ల ఆధిక్యంలో నిలిచింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం..
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయంటే ఇదేనేమో మరి. 2014 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా రెపరెపలాడినా గ్రేటర్‌లో మూడు స్థానాలకే పరిమితమయ్యింది. ఆ పార్టీకి ఇక్కడ కేడర్‌ లేదనే విషయాన్ని ఎత్తి చూపింది. దీంతో అప్రమత్తమైన ఆ పార్టీ ముఖ్యులు నగరంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఆ తర్వాత జరిగిన బల్దియా ఎన్నికల్లో 150 డివిజన్లకు 99 డివిజన్లలో గెలిచి తెరాస ప్రభంజనం సృష్టించింది. శివారు ప్రాంతాలపైనా ప్రత్యేకంగా నజర్‌ పెట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగి హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 17 స్థానాల్లో విజయఢంఖా మోగించి చరిత్ర సృష్టించింది. సిట్టింగ్‌ స్థానాలైన సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, పటాన్‌చెరునూ కాపాడుకుంది. తెదేపా నుంచి వచ్చి గులాబీ కండువా కప్పుకొన్న 9మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. భాజపా కంచుకోట అంబర్‌పేటలోనూ జెండా ఎగరేసి సంచలనం సృష్టించింది. ముషీరాబాద్‌, ఉప్పల్‌, ఖైరతాబాద్‌లో అనూహ్య విజయం సాధించింది. ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది.

లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా..
అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించి ఊపు మీదున్న తెరాస లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే సన్నద్ధమయ్యింది. మూడు జిల్లాల పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సన్నాహాక సమావేశాలను నిర్వహించి కేడర్‌ను సమాయత్తం చేసింది. చేవెళ్లలో మినహా మిగిలిన మూడు చోట్ల గెలుపు దక్కలేదు. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌, సికింద్రాబాద్‌లో భాజపా, హైదరాబాద్‌లో ఎంఐఎం గెలిచింది. దీంతో కేడర్‌ డీలాపడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లా పరిధిలో తెరాస మద్దుతుదారులు విజయకేతనం ఎగురేశారు. ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లింది. మేడ్చల్‌ జిల్లాలో ఐదు జడ్పీటీసీలకు నాలుగు, రంగారెడ్డి జిల్లాలో 21కి గాను 16 చోట్ల విజయఢంఖా మోగించి జిల్లా పరిషత్తులను కైవసం చేసుకుని సత్తా చాటింది. మరో ఏడాది వ్యవధిలో బల్దియా ఎన్నికలు రాబోతున్న తరుణంలో శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు కీలకంగా మారాయి. ఇక్కడ సత్తా చాటితే ఆ ప్రభావం బల్దియా ఎన్నికలపై చూపే అవకాశముôటుంది. మేడ్చల్‌ జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడుకు మూడు కార్పొరేషన్లు, తొమ్మిదికి తొమ్మిది మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది. రంగారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు, ఓ కార్పొరేషన్‌లో విజయం సాధించింది. మరికొన్ని చోట్ల ఎక్స్‌-అఫీషియో సభ్యుల ఓట్లతో అధికారాన్ని దక్కించుకోనుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.