close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

ప్రధానాంశాలు

శ్రమించారు.. గెలిపించారు!

రెండు జిల్లాల స్థానిక పోరులో గులాబీ హవా
పురపోరులో ఫలించిన శాసనసభ్యుల వ్యూహాలు
ఈనాడు, హైదరాబాద్‌

ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నికల బరిలో నెగ్గేందుకు నేతలు తీవ్రంగా శ్రమించారు. నామినేషన్ల ముందు నుంచే పక్కా వ్యూహంతో పైచేయి సాధించేందుకు సిద్ధమయ్యారు. వరుస ఎన్నికలతో పలుకరించిన అలసటను అధిగమించి విజయకేతనం ఎగురవేశారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 21 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. తొలిరౌండ్‌ నుంచి అధికార తెరాస హవా కొనసాగింది. 2018, 2019, 2020 వరుస ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు తమ సత్తా చాటుకున్నారు. పేద, ధనిక, అక్షరాస్యులు, నిర్లక్షరాస్యులు విభిన్నమైన పరిస్థితులున్న డివిజన్లలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానాపాట్లు పడ్డారు. చివరకు విజయాన్ని అందుకున్నారు. రెబెల్స్‌ బెడద, అనుచరుల ఒత్తిళ్లను అధిగమించి అనుకున్నది సాధించేందుకు గ్రేటర్‌ మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా శ్రమించారు. సవాళ్లను ఎదుర్కొని తమ వాళ్లను గెలిపించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నించారు. మల్లారెడ్డి అనుకున్నది సాధిస్తే సబితా ఇంద్రారెడ్డి మాత్రం వెనుకబడ్డారు. రెబెల్స్‌ బెడద, ప్రతికూల అంశాలు సరిదిద్దుకోవటంలో విఫలమయ్యారు. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ పరిధిలో మాత్రం అధికార పార్టీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఫలితాలను ప్రభావితం చేసిందంటూ అధికార పార్టీ కార్యకర్తలు చెప్పటం విశేషం.

శివార్లలో సవాళ్లు
గ్రేటర్‌ శివార్లలో కొత్త ఏర్పడిన పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు భారీ సంఖ్యలో పోటీపడ్డారు. తెరాస పార్టీ అవిర్భావం నుంచి పనిచేస్తున్న ఆశవహులు స్థానిక పోరులో నిలిచేందుకు సిద్ధమయ్యారు. 2018 ముందస్తు ఎన్నికలు, 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకోసం శ్రమించారు. కాంగ్రెస్‌, భాజపా పార్టీల నుంచి నామమాత్రపు పోటీ కూడా ఎదురవలేదు. దీంతో అధికశాతం డివిజన్లలో కారు వేగాన్ని అడ్డుకోలేకపోయారు. బలమైన నాయకత్వం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండటం ఓటర్లు కూడా గులాబీ పార్టీపై నమ్మకం ఉంచటంతో అభ్యర్థుల గెలుపు సునాయాసంగా మారింది.

అధినేత ఆదేశాలతో అప్రమత్తం
తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత శాసనసభ్యులపై ఉంచారు. ఓటమికి బాధ్యత కూడా వారే వహించాల్సి ఉంటుందన్నారు. దీంతో  శాసనసభ్యులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని రాజేంద్రనగర్‌, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌, షాద్‌నగర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, కె.పి.వివేకానంద, అంజయ్యయాదవ్‌, యాదయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్లారెడ్డి తమ పరిధిలోని పురపాలక, నగర పాలక సంస్థల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిచేందుకు శ్రమించారు. టికెట్‌ పొందిన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూనే మరోవైపు రెబెల్స్‌ను బుజ్జగిస్తూ దారికి తెచ్చేందుకు ప్రయత్నించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలోనే అయిదు కార్పొరేషన్లు, 9 పురపాలిక సంఘాలున్నాయి. ఇక్కడ పదుల సంఖ్యలో వ్యతిరేకులు రెబెల్స్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. ఇవి కీలకమైన ప్రాంతాలు కావడంతో మంత్రులకు అగ్ని పరీక్షగానే మారింది. రాజేంద్రనగర్‌, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, వివేకానంద ఇద్దరికీ స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగురవేయడం సవాల్‌గా మారింది. గత ఎన్నికల్లో పోటీని దృష్టిలో ఉంచుకుని ఈ దఫా ముందు నుంచే అప్రమత్తంగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.