close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

ప్రధానాంశాలు

ఉత్సాహం..అనుభవం..కలగలిపిన ఉత్సవం

 రెండో రోజు అంబరాన్నంటేలా సాహితీ సంబరాలు
  కార్యశాలలు, కనువిప్పు కలిగించే కథలు
 పెద్దఎత్తున హాజరైన ఔత్సాహికులు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

భవితకు మార్గనిర్దేశం చేసే పెద్దల అనుభవం.. దేశ భవితకు పునాదులైన యువత ఉత్సాహం.. పిల్లల కేరింతలు.. కళకు మెరుగులు పెట్టే కార్యశాలలు.. కన్నార్పకుండా చూడాలనిపించే యువ కళాకారుల ప్రదర్శనలు.. కనువిప్పు కలిగించే కథలు.. ఇదీ రెండోరోజు హైదరాబాద్‌ సాహితీ ఉత్సవాల వాతావరణం. సైఫాబాద్‌ విద్యారణ్య పాఠశాల వేదికగా రెండోరోజు జరిగిన వేడుకలకు నగరవాసులతో పాటు దేశ విదేశాల నుంచి సాహితీ ప్రియులు పెద్దఎత్తున హాజరయ్యారు. వారి అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకున్నారు.

యువోత్సాహం..: యంగిస్థాన్‌ నుక్కడ్‌ బృందం హైదరాబాద్‌ సాహితీ ఉత్సవాల ప్రాంగణానికి ఉత్సాహం తెచ్చింది. నిర్విరామంగా సాహిత్య, సంగీత ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. ఓవైపు దేశ రాజకీయాలు ఇతరత్రా అంశాలపై తీవ్రంగా జరుగుతున్న చర్చలకు యువతులు నృత్యాలతో జోష్‌ పెంచగా, బృందంలోని పలువురు యువకుల స్టాండప్‌ కామెడీతో అలరించారు. ఉత్సవాల్లో కథలు అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ కథకులు కోయిలీ ముఖర్జీ ‘క్రక్స్‌’ పేరిట ఔత్సాహికులకు కథలు చెప్పారు. ప్రముఖ స్టోరీ టెల్లింగ్‌ సంస్థ ‘భూమిక’ బృందం గరికపాటి ఉదయభాను, విద్యాసాగర్‌, హరీత్‌ చిలువేరు, ప్రియాంక పుంటంబేకర్‌, రావన్‌లు పిల్లల కోసం చెప్పిన సాహసాల కథలు ఆద్యంతం అలరించాయి. బాలలకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించేందుకు రోహిణి చింత కథలు చెప్పారు. ప్రముఖ దర్శకుడు, మలయాళీ రచయిత అదూర్‌ గోపాలకృష్ణ రూపొందించిన చిత్రాలను ప్రదర్శించారు. సామాజిక సమస్యలపై నిర్మించిన చిత్రాలు, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న పలు చిత్రాలు ఆకట్టుకున్నాయి.

కార్యశాలలతో కళలకు మెరుగు
ఔత్సాహికులను కార్యక్రమాల్లో భాగం చేయడం ద్వారా వారిలోని కళకూ మెరుగులు దిద్దారు నిర్వాహకులు. ‘ది లాంగ్‌ అండ్‌ షార్ట్‌ ఆఫ్‌ హైకూ’ కార్యశాల ద్వారా హైకాయ్‌ కవిత్వాన్ని కవి కళా రమేశ్‌ పరిచయం చేశారు. అనంతరం జంతువులపై కథల కార్యశాలను శృతి గరోడియా, అర్చన గరోడియా నిర్వహించారు. శబ్దకారులు స్నిగ్ధ మునిపల్లి, విష్ణు విమల్‌ శబ్దంతో శారీరక, మానసిక ఆరోగ్యంలో వచ్చే మార్పులను ఔత్సాహికులకు వివరించారు. ‘ఫైండింగ్‌ యువర్‌ ఇకిగాయ్‌’ కార్యశాల ద్వారా చిన్నారుకు భవిష్యత్తుపై అవగాహన కల్పించారు.
పలువురు ప్రముఖులు వివిధ
అంశాలపై చర్చలు జరిపారు.


వారి అభిప్రాయాలివి..

అంశం: రైటింగ్‌ ది నేషన్‌
దేశమంతటా మత రాజకీయాలు: అశుతోష్‌, ప్రముఖ పాత్రికేయుడు
భాజపా సర్కారు బాధ్యతలు చేపట్టకుండా ఓ ఆధ్యాత్మిక శిక్షణ సంస్థలా పనిచేస్తోంది. దానికి శాఖలుగా ఆరెస్సెస్‌, భజరంగ్‌దళ్‌లు పనిచేస్తున్నాయి. దేశమంతటా మత రాజకీయాలు నడిపిస్తున్నారు. అందుకు ఆర్టికల్‌ 370, ఎన్‌ఆర్‌సీ, బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలే నిదర్శనం. నేను జేఎన్‌యూలో చదువుకున్నా. దేశంలో ప్రస్తుతం హిట్లర్‌ పాలన కొనసాగుతోంది. ఓ ముస్లిం ఇక్కడ జీవించాలంటే రెండో శ్రేణి పౌరుడిగా ఉండాల్సిన దుస్థితి కల్పించారు.


అంశం: ప్రకృతిని కాపాడే ప్రయోగాలు
ప్రజా సమస్యను రాజకీయం చేస్తున్నారు: బాహర్‌దత్‌, ప్రముఖ

పాత్రికేయురాలు
ప్రకృతిని కాపాడేందుకు ప్రభుత్వాలు ఎలాంటి ప్రయోగాలు చేయడంలేదు. ఒకవేళ ఎవరైనా చేసినా దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. మొన్న దిల్లీలో కాలుష్యం తీవ్రమైంది. ప్రభుత్వాలు దానికి పరిష్కారం ఆలోచించకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఓ ప్రజా సమస్యను రాజకీయ సమస్యగా మార్చేశారు. ప్రకృతి పరిరక్షణకు ప్రభుత్వాలే కాదు ప్రజలూ నడుం బిగించాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.