close

బుధవారం, నవంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రేటర్‌ పీఠం ఎటు

రాబోయే ఎన్నికలపై దృష్టి
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)కి గతసారి జరిగిన ఎన్నికల్లో అధికార తెరాస ఘన విజయం సాధించింది. వచ్చే ఏడాది జరిగే పాలకవర్గ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఇందుకు ఇప్పటినుంచే బల్దియాపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాల్సిందేనని శనివారం వెల్లడైన పుర ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్రమంతటా ఏకపక్ష విజయాలు సాధించిన తెరాస రంగారెడ్డి జిల్లాలో మాత్రం అదే జోరు ప్రదర్శించలేకపోయింది. దీనికి కారణం నేతల సమన్వయ లేమి, తిరుగుబాటు అభ్యర్థులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీపరంగా ఇతరత్రా నగర పరిధిలో కూడా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. 2016 నాటి బల్దియా పోరులో 150 డివిజన్లకు గాను 99 చోట్ల తెరాస, 44 స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

మంత్రి కేటీఆర్‌ వ్యూహాలతో...
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మొదటిసారి జీహెచ్‌ఎంసీకి 2016 జనవరిలో ఎన్నికలు జరిగాయి. మంత్రి కేటీఆర్‌ ప్రచార కార్యక్రమాలను, వ్యూహాలను ముందుండి నడిపించారు. లక్ష రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం, ఇతరత్రా సంక్షేమ పథకాలు భారీ విజయానికి దోహదపడ్డాయి. ఇటీవల జరిగిన శాసనసభ, §ర్లమెంటు ఎన్నికల్లోనూ నగర పరిధిలో తెరాస మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంది. ఆ ప్రకారం చూస్తే రంగారెడ్డి జిల్లా పరిధిలోని 12 మున్సిపాల్టీల్లోనూ, 3 నగరపాలక సంస్థల్లోనూ ఏకపక్ష విజయాలు సాధించాల్సి ఉంది. ఇందుకు భిన్నమైన ఫలితాలు తాజాగా వచ్చాయి. 12 మున్సిపాల్టీల్లో నాలుగు చోట్ల మత్రమే పూర్తిస్థాయిలో తెరాస విజయం సాధించింది. అలానే మూడు నగరపాలక సంస్థల్లో ఒక్కదానిలోనే స్పష్టమైన మెజార్టీ సాధించగా, మరో రెండింటిలో హంగ్‌ ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్‌, భాజపా ఉనికిని ప్రదర్శించాయి. చాలా వార్డుల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగితే.. ప్రస్తుతం బల్దియా పాలకమండలి కాలపరిమితి వచ్చేయేడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. సర్కారు షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే తదుపరి ప్రక్రియ ఈ ఏడాది నవంబరులో మొదలవుతుంది. ప్రస్తుత ఫలితాలను పరిశీలిస్తే గతంలో రెండు సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌ స్వల్పంగా సీట్లు పెంచుకుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.