close

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

ప్రధానాంశాలు

ఎస్‌బీఐకి రూ.50,000 జరిమానా

 ఫిర్యాదీకి రూ.6,41,952 చెల్లించండి
 ప్రతివాదికి ఫోరం-1 ఆదేశం

ఈనాడు డిజిటల్‌: పత్రాలను ఆదాయ పన్నుశాఖకు పంపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి పరిహారం ఇప్పించాలంటూ అవేర్‌ ఇండియా ఫౌండేషన్‌ నగర వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. 2001-02 సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రూ.6,41,952 ఐటీ శాఖలో జమ చేసేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్రను అవేర్‌ ఇండియా సంస్థ ఆశ్రయించింది. కొన్నాళ్లకే ఆ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమైంది. ఫిర్యాదీ జమ చేసిన డబ్బుకు సంబంధించిన పత్రాలను ఆదాయ పన్నుశాఖను పంపడంలో ప్రతివాది విఫలమైంది. ఫిర్యాదీ డబ్బు ఆదాయ పన్ను శాఖకు బదిలీ కాలేదు. ఆదాయ పన్నుశాఖ డబ్బు చెల్లించాలంటూ పిర్యాదీకి లేఖ పంపింది. డబ్బు కట్టిన తర్వాత కూడా లేఖ రావడంతో సదరు బ్యాంకును సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఫోరాన్ని ఆశ్రయించారు. ఫిర్యాదీ వాదనలను ఖండించి ప్రతివాద బ్యాంకు ప్రతినిధులు ఇందులో తమ తప్పిదం లేదని 12 సంవత్సరాల తర్వాత ప్రస్తావించడం అసమంజసం అని విన్నవించారు. ఈ విషయమై ఇప్పటి వరకు బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్రకు సందేశం పంపకపోవడంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ శాఖ తప్పిందం ఉందంటూ వివరించింది. వాదనలు విన్న ఫోరం-1 అధ్యక్షుడు పి.విజేందర్‌, కె.రామ్‌మోహన్‌, సీ.హెచ్‌ లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్‌ ఫిర్యాదీ వాదనలతో ఏకీభవించింది. రూ.6,41,952 ఫిర్యాదీకి చెల్లించడంతోపాటు పరిహారం కింద రూ.50,000, ఖర్చుల కింద రూ.5,000 ముప్పై రోజులలో  చెల్లించాలని ప్రతివాద ప్రతినిధుల్ని ఆదేశించింది.


ఓరియంట్‌ కార్గో మూవర్స్‌కు రూ.50,000 జరిమానా

నష్టపరిహారం చెల్లించడంలో విఫలమైన రవాణా సంస్థ ఒరియంట్‌ కార్గో మూవర్స్‌ సంస్థకు ఫోరం-1 రూ.50,000 జరిమానా విధించింది. న్యూ ఇండియా అస్యూరెన్స్‌ బీమా సంస్థ (మొదటి ప్రతివాది), గాయత్రి ప్రాజెక్ట్స్‌ సంస్థ (రెండో ప్రతివాది) సంయుక్తంగా ఫోరాన్ని ఆశ్రయించాయి. రవాణా సంస్థ వాహనం గాయత్రి ప్రాజెక్ట్స్‌ సంస్థ తను పంపే సరకు మీద న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో బీమా చేయించి ఓరియంట్‌ కార్గో వాహనంలో సరకును బిహార్‌కు పంపింది. గమ్యస్థానానికి చేరుకుంటున్న సమయంలో వాహనం ప్రమాదానికి గురైంది. సరకు మొత్తం వృథా అయ్యింది. నష్టానికి మొత్తం పరిహారం రూ.6,04,668 రెండో ప్రతివాదికి బీమా సంస్థ కట్టేసింది. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ నష్టపరిహారం తాలుకు డబ్బును బీమా కంపెనీకి ఇవ్వాలంటూ మొదటి ప్రతివాది సబ్రొగేషన్‌ లేఖను రవాణా సంస్థకు సమర్పించారు. ఇందుకు సంబంధించిన డబ్బును బీమా కంపెనీకి ఇవ్వడంలో ప్రతివాద సంస్థ విఫలమైంది. దీంతో రూ.6,04,668 బీమా కంపెనీకి చెల్లించాలంటూ ఫోరం-1 ప్రతివాద ఓరియంట్‌ కార్గో సంస్థను ఆదేశించింది.


ఫిర్యాదికి రూ.42 చెల్లించండి
 పరిహారంగా మరో రూ.3 వేలు సైతం
 ప్రతివాదులకు ఫోరం-1 ఆదేశం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఖాతాలో పడాల్సిన డబ్బుకు రూ.42 తక్కువగా ఇచ్చిన ఎస్‌బీఐ నుంచి డబ్బులు తిరిగి ఇప్పించడంతో పాటు పరిహారం కూడా ఇప్పించాలంటూ ఓ వ్యక్తి నగర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్న సికింద్రాబాద్‌ ప్రాంతం అమ్ముగూడకు చెందిన నీల కొండయ్య ఎస్‌బీఐ బ్యాంకులో ఖాతాదారుడు. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.2.7లక్షలు మంజూరయ్యాయి. అయితే తన ప్రమేయం లేకుండా బ్యాంకు అధికారులు రూ.20,035 బీమా (ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌) కోసం తీసుకుని మిగతా డబ్బులు అతని ఖాతాలో వేశారు. దీన్ని గమనించి బ్యాంకు అధికారులను సంప్రదించిన కొండయ్య తనకు బీమా అవసరం లేదని, తన డబ్బులు ఖాతాలో వేయమని కోరాడు. దీంతో బీమాను రద్దు చేసిన ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రతినిధులు కొండయ్య ఖాతాలో రూ.19,993.82 మాత్రమే వేశారు. కాగా రూ.42 తక్కువ ఇచ్చారంటూ ఎస్‌బీఐ సికింద్రాబాద్‌ శాఖ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సోమాజిగూడ శాఖలను ప్రతివాదులుగా చేర్చుతూ హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై వివరణ అందించిన ప్రతివాదులు ఇందులో సేవల్లో లోపం ఏమీ లేదని, నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఆ డబ్బును తీసుకున్నామని ఫోరం-1 అధ్యక్షుడు పి.విజేందర్‌, సభ్యులు కె.రామ్‌మోహన్‌, సి.లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్‌కు వివరించారు. ఇరువురి వాదనలు విన్న బెంచ్‌ పిర్యాది వాదనలతో ఏకీభవించింది. రూ.42 ఫిర్యాదికి చెల్లించాలంటూ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రతినిధుల్ని ఆదేశించింది. కేసు ఖర్చుల నిమిత్తం రూ.3,000 కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.

సేవల్లో లోపానికి పరిహారం ఇవ్వాల్సిందే..
సరకును సకాలంలో చేర్చడంలో విఫలమై ఆర్థిక నష్టానికి కారణమైన ప్రతివాదులకు ఫోరం-1 జరిమానా విధించింది. చంపాపేట్‌వాసి యాదగిరి బిహార్‌లో కొన్న యంత్రాన్ని నగరానికి చేర్చమంటూ శ్రేయి సంస్థను ఆశ్రయించారు. అడ్వాన్స్‌ చెల్లించాడు. నగరానికి వస్తుండగా రాజౌలి చెక్‌ పోస్ట్‌ వద్ద సరకును సంబంధిత దస్త్రం లేక అధికారులు సీజ్‌ చేశారు. సరైన పత్రాలు లేకుండా సరకును ఇరకాటంలో పెట్టి నష్టం చేకూర్చారంటూ ఆయన నగర ఫోరాన్ని ఆశ్రయించారు. జరిమానా రూ.4,03,575తోపాటు, పరిహారంగా రూ.50,000, కేసు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలంటూ ఫోరం-1 ప్రతివాదులైన శ్రేయి ఎక్విప్‌మెంట్‌, క్విప్పో వాల్యూయర్స్‌ వేలం సంస్థ, కమర్షియల్‌ టాక్స్‌ అధికారిని ఆదేశించింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.