close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

చోళరాజుల కట్టడం.. తెలంగాణకు మకుటాయమానం

కేశవగిరిపై స్వయంభువుగా వెలిసిన చెన్నకేశవ స్వామి
నాడు ఉత్సవానికి అధికారిక సెలవు ఇస్తూ నిజాం ఫర్మానా
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
న్యూస్‌టుడే, కేశవగిరి

చోళ రాజుల కాలం నుంచి నిజాం హయాం వరకు అంగరంగ వైభవంగా పూజలు, ఉత్సవాలు జరుపుకొని తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన కోవెలగా పేరుగాంచింది. ఔరంగజేబును సైతం తలవంచేలా చేసిన ఘనత ఈ గుడి సొంతం.  నిజాం తన హయాంలో ఆలయ బ్రహ్మోత్సవాల కోసం నగరంలో ఒక రోజు సెలవు ప్రకటిస్తూ ఫర్మానా జారీ చేసిన సందర్భం ఓ కలికితురాయిగా చెప్పవచ్చు.. ఇలా చంద్రాయణగుట్టలోని ఎత్తైన కొండ (కేశవగిరి)పై కొలువుదీరిన స్వయంభూ శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేసుకుంది. ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి.

‘చెన్నరాయుని గుట్ట’గా ప్రసిద్ధి..
చెన్నకేశవస్వామి కొలువై ఉన్న ఈ కొండను అప్పట్లో ‘చెన్నరాయుని గుట్ట’గా పిలిచేవారు. కాలక్రమేణా ఇది ‘చంద్రాయణగుట్ట’గా రూపాంతరం చెందింది. ‘కేశవగిరి’గాను పిలుస్తారు. చెన్న కేశవస్వామి పక్కనే మహా శివాలయం, భ్రమరాంబదేవి సమేత చెన్నమల్లికార్జునస్వామి ఆలయాలు కొలువుదీరాయి. అండాళమ్మ, గోదాదేవి, రంగనాథస్వామి ఆలయం, చతుర్భుజ ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణ మండపం వద్ద మర్రి వృక్షానికి ఉన్న ‘వృక్ష గణపతి’ ప్రత్యేక ఆకర్షణ. గుట్టకు కి.మీ దూరంలో ఉన్న శ్వేతగంగ నీటిని పూజలకు వినియోగించేవారు. శ్వేత గంగ ఇప్పటికీ నీటితో కళకళలాడుతోంది.


నిజాం హయాంలో ఆలయ పునరుద్ధరణ

చోళ రాజుల కాలంలో నిర్మితమై కాలక్రమేణా జీర్ణావస్థకు చేరిన ఆలయాన్ని గమనించిన నిజాం ప్రభువు.. ఆలయం విశేషాలు తెలుసుకోవాలని తన సలహాదారుడు రాజా బన్సీరాజ్‌ బహదూర్‌ను ఆదేశించాడు.  ఆలయ చరిత్రను తెలుసుకొని 16 గ్రామాల జాగీరును మాన్యంగా ఇచ్చారు. ఆలయాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. బన్సీరాజ్‌ బహదూర్‌ ఆధ్వర్యంలో ఆలయం పునర్నిర్మితమైంది. బ్రహ్మోత్సవాలలో స్వామి కల్యాణం జరిగే రోజున ప్రభుత్వం తరఫున అధికారికంగా బ్యాండు మేళం గుట్టపై స్వామి కల్యాణానికి వచ్చేది. నిజాం హయాం తరువాత కొన్నేళ్ల వరకు బాగానే ఉన్నా.. తదనంతరం మూడున్నర దశాబ్దాల వరకు ఉత్సవాలకు తెరపడింది. 2005 నుంచి ఏటా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.


15- 19 వరకు బ్రహ్మోత్సవాలు..
స్వయంభువు శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప, ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్‌ జుర్కి అనిల్‌కుమార్‌, మాజీ సభ్యులు పల్సం శ్రీనివాస్‌గౌడ్‌, ఎం.ప్రభాకర్‌రాజు, యం.శోభారెడ్డి, నరేశ్‌కుమార్‌, అర్చకులు కంజర్ల ప్రతాపాచార్యులు ఉత్సవ వివరాలు వెల్లడించారు. 


నిజాం వారసత్వం కొనసాగింపు..

నిజాం హయాంలో ఉత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించేవారు. చంద్రాయణగుట్టపై ఉత్సవాల పునరుద్ధరణ జరిగిన 2005 నుంచి స్థానిక పోలీసుస్టేషను సీఐ స్వామికిపట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఉత్సవాల నిర్వహణకు నిజాం హయాంలో అన్ని విధాలుగా సాయం అందినా... ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం ఆశించిన స్థాయిలో లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.