close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

మటన్‌ ధర మంట!

కిలో రూ.700 పైమాటే
  పంపిణీ తగ్గడంతో ధరలకు రెక్కలు
  నగరంలో ఒక్కో చోట ఒక్కో రేటు

మటన్‌ ధరలు నగరంలో మండిపోతున్నాయి. కిలో రూ.700కి పైగా మార్కెట్లో మటన్‌ ధర పలుకుతోంది. సంక్రాంతి నుంచి పెరిగిన ధరలతో నగరవాసులు మటన్‌ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాంస ప్రియులకు ఈ ధరల పెరుగుదల ఏ మాత్రం రుచించడం లేదు. ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్ల పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు. పండగల సీజన్‌లో పెరగాల్సిన మటన్‌ ధరలు సంక్రాంతి తర్వాత అమాంతం పెరిగిపోయాయి. గతంలో నగరంలో రూ.600 నుంచి రూ.620 మధ్య ఉన్న కిలో మటన్‌ ధర ప్రస్తుతం రూ.700కి చేరుకుంది.

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

ప్రస్తుతం మార్కెట్‌లో మటన్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎముకలతో మటన్‌ కిలో రూ.700 వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల ఇంతకు మించి ధర చెబుతున్నారు. బోన్‌లెస్‌ ఏకంగా రూ.900 చేరుకుంది. మటన్‌ కీమా రూ.900, మటన్‌ చాప్స్‌ రూ.700, కేవలం ఎముకలైతే రూ.240గా ధర పలుకుతోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో ధర పలుకుతోంది. సుమారు కిలో రూ.640 మొదలుకొని రూ.680 మరికొన్ని చోట్ల రూ.700 వరకు ధర పలుకుతోంది. గత నాలుగు నెలల్లోనే సుమారు ఆయా చోట్ల రూ.50 నుంచి రూ.70 వరకు ధర పెరిగింది. నగరానికి దిగుమతి అవుతున్న మేకల్లో రకాల ఆధారంగా వీటి ధరలను నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు డిమాండ్‌ పెరగడంతో ధరలు అమాంతం పెరిగిపోయింది. భవిష్యత్తులో వెయ్యికి పైగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మంచి పోషకాహారం...
రోగులకు, ముఖ్యంగా కాళ్లు, చేతులు విరిగిపోయిన వారికి ఆహారంలో మాంసం అందించాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే పెరిగిన ధరలతో వారికి పోషకాహారం అందించాలన్నా ఆలోచించాల్సి వస్తోందని రోగుల బంధువులు అభిప్రాయపడుతున్నారు. దీంతో చికెన్‌ కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే మాంసం వండిపెట్టడం అలవాటు చేసుకున్న కుటుంబాలు సైతం ఇదే దారిని ఎంచుకుంటున్నాయి. దీంతో ప్రతివారం మటన్‌ కొనుగోలు చేసేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొన్ని మధ్య తరగతి కుటుంబాలు పూర్తిగా శాకాహారం వైపు మొగ్గు చూపుతున్నాయి.

సగమే వినియోగం..
ధరలు పెరిగిన నాటి నుంచి సగటు వినియోగం పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ ధరలు ఉన్న సమయంలో రోజుకు 125 నుంచి 150 కిలోల మాంసం విక్రయాలు జరిగేవని ధరలు పెరిగిన తర్వాత 80 నుంచి 90 కేజీలకు వినియోగం పడిపోయింది. విక్రయదారులు కొనుగోలు చేసే మార్కెట్‌లో రూ.600 తాము కొనుగోలు చేస్తున్నామని, దీంతో ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతివారం కిలో మటన్‌ కొనేవారు అరకిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారని దీంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.