close

బుధవారం, ఏప్రిల్ 08, 2020

ప్రధానాంశాలు

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై కరోనా దెబ్బ

నిలిచిన దిగుమతులు
పెరిగిన ధరలు
వెలవెలపోతున్న మార్కెట్లు
న్యూస్‌టుడే, హైదరాబాద్‌

కొవిడ్‌-19(కరోనా) వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాణాంతకమైన వైరస్‌పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రభావం మనుషులపైనే కాదు.. వ్యాపారంపై కూడా చూపిస్తోంది. హైదరాబాద్‌కు ఎలాక్ట్రానిక్‌ పరికరాలు పూర్తిగా చైనా నుంచే దిగుమతి అవుతాయి. గత కొంతకాలంగా వైరస్‌ ప్రభావంతో చైనాలోని రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో ఉత్పత్తులు చేరవేయడం పూర్తిగా నిషేధించారు. నగరానికి ఎక్కువగా సెల్‌ఫోన్‌లకు సంబంధించిన పరికరాలతోపాటు కంప్యూటర్లు, పరికరాలు, సీసీ కెమెరాలు, కెమెరాల యాక్ససరీస్‌ పెద్ద మొత్తంలో దిగుమతి అవుతాయి. కరోనా ప్రభావంతో మార్కెట్లు వెలవెల పోతున్నాయి.

ధరలపై ప్రభావం
చైనా నుంచి ఎక్కువగా సెల్‌ఫోన్‌ పరికరాలు, ఎల్‌ఈడీ టీవీలు దిగుమతి అవుతాయి. దాదాపు 85 శాతం వరకు సెల్‌ఫోన్ల కవర్లు, తెర (డిస్‌ప్లేలు), ప్రింటెడ్‌ సర్కిట్‌ బోర్డులు, కెపాసిటర్లు, మెమరీ కార్డులు, ఎల్‌ఈడీ చిప్స్‌, వాషింగ్‌ మెషిన్ల మోటార్లు,  క్లిష్టమైన భాగాలు ఇతర రకాల విడి భాగాలను తయారు చేసి దిగుమతి చేస్తుంది. నోయిడాలోని కొన్ని పరిశ్రమలు (యూనిట్లు) పరికరాలను ఒక దగ్గర అమర్చుతారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని డీలర్‌లకు అక్కడి నుంచి దుకాణాదారులకు అందిస్తారు. ఈ ఏడాది జనవరి నుంచి వాటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఉన్న వాటి నిల్వలు తగ్గిపోవడంతో మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతోంది. ఉన్న పరికరాలపై అద]నంగా ధరలు పెంచుతున్నారు.ఈ ప్రభావం అన్ని ఉత్పత్తులపై పడడంతో డీలర్లు, కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనవరి నుంచి బంద్‌
చైనాలో జనవరి నెలలో కొత్త ఏడాది వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. అక్కడి ప్రజలు నెల రోజులపాటు వాణిజ్య వ్యాపారాలకు స్వస్తి పలికి ఆత్మీయులతో కలసి పండగలో మునిగితేలుతారు. పండగ వాతావరణం నుంచి బయటపడకముందే కరోనా వైరస్‌ అలజడి సృష్టిచింది. ఆ వ్యాధి సోకి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. దీంతో వ్యాపారాలన్నీ నిలిచిపోయాయి. ఇక్కడికి రావాల్సిన పరికరాలు ఎగుమతి చేయకపోవడంతో ఆ ప్రభావం నగరంపై పడింది. ఉన్న పరికరాలు సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడంతో ఇక్కడి వ్యాపారులు ధరలను నెమ్మదిగా పెంచుతున్నారు. ఈ ప్రభావం ఇంకా మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉంటుందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఈ పరికరాలపై ప్రభావం
* సెల్‌ఫోన్‌ పరికరాలు 20-30 శాతం ధరలు పెరిగాయి.
* సీసీ కెమెరాలు   10 శాతం
* కెమెరా యాక్ససరీస్‌ 10-20 శాతం
* టీవీ పరికరాలు 10శాతం

కొంత సమయం పడుతుంది
- పురుషోత్తం, సెల్‌ఫోన్‌ పరికరాల డీలర్‌
కరోనా వైరస్‌ ప్రభావం నగరంలోని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై పడింది. చైనా నుంచి వచ్చే పరికరాలు పూర్తిగా నిలిపోయాయి. ఉన్న వస్తువులు మార్కెట్లో తగ్గిపోయాయి. దీంతో ధరలను పెంచుతున్నారు. మొబైల్‌ కవర్లు, బ్యాటరీలు, పెన్‌డ్రైవ్‌లు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లు కొనుగోలు దారులు లేక వెలవెలపోతున్నాయి. మళ్లీ మార్కెట్‌ పూర్తిస్థాయిలో కోలుకోవాలంటే మూడు నెలలు పడుతుంది. సెల్‌ఫోన్లకు సంబంధించిన పూర్తి పరికరాలు చైనా నుంచే దిగుమతి అవుతాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.