close

శుక్రవారం, నవంబర్ 27, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆకలి తెలిసిన మనసులు..

క్షుద్బాధ తీర్చుతున్న మానవీయత
ఆస్పత్రులు, ఇతర ప్రదేశాల్లో అన్నదానం
గ్రేటర్‌ ఒడిలో పేదలకు వెసులుబాటు

 

ఆకలికి అలమటించే ఎంతోమంది పేదలు పట్టెడు అన్నం పెట్టే చేతుల వైపు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారిలో...నా అనేవారు లేని వారు కొందరైతే...ఎంతో దూరం నుంచి వైద్యం కోసం నగరానికి వచ్చిన వారు మరికొందరు. అరకొర ఆదాయంతో ఆ పూట అన్నం మానేస్తే నాలుగు డబ్బులు మిగులుతాయని నీళ్లు తాగి సరిపెట్టుకునే వారు ఇంకొందరు. ఇలాంటి ఎంతోమంది ఆర్తుల ఆకలిని మహానగరం తీర్చుతోంది. పలువురు వ్యక్తులు, పలు ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు పట్టెడు అన్నం పెట్టి నిత్యం ఎంతోమంది క్షుద్బాధ తీర్చుతున్నారు. వైద్య సేవల కోసం నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జె, నిలోఫర్‌ తదితర ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. రోగులకు సహాయకులుగా రోజుల తరబడి ఇక్కడే ఉండాలి. ఆసుపత్రి ప్రాంగణంలోని షెడ్లలో ఉంటూ ఇలా దాతలు పెట్టే అన్నంతో ఆకలి తీర్చుకోగలుగుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

* పని ఒత్తిడితో పట్టించుకోని ఆకలి.. కొద్దిసేపు సేదతీరగానే కడుపులో పేగులు గుర్తుచేశాయి. జేబునిండా సొమ్ములు.. పిలిస్తే వచ్చివాలే మనుషులు.. అయినా అప్పుడు కనీసం బిస్కెట్లైనా దొరకని పరిస్థితి ఆయనది.  ఆ సమయంలో.. తాను రోజూ వెళ్లేదారిలో ఫుట్‌పాత్‌లపై కూర్చునే అభాగ్యులు గుర్తొచ్చారు. వారిలో కొందరికైనా కడుపు నింపాలనుకున్నారు. రోజూ అక్కడకు ఆహారం చేర్చేందుకు వాహనం, ఇద్దరు మనుషులను ఏర్పాటు చేశారాయన.. రెండేళ్లుగా.. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వద్ద కొందరి ఆకలి తీర్చుతున్నారని వాహన డ్రైవర్‌ తెలిపాడు. ఎవరా దాత అని అడిగితే.. కడుపు నింపేందుకు ఆహారం కావాలి కానీ..పేరుతో పనేమిటని.. తమ యజమాని వెల్లడించవద్దన్నారని అన్నాడు.

* సుధ సాధారణ గృహిణి. కుమార్తెతో కలసి 2 సంచుల నిండా..బత్తాయి,అరటిపండ్లు తీసుకుని ఆస్పత్రి వద్దకు చేరారు. చెట్ల కింద.. రహదారి పక్కన నిలబడిన రోగుల బంధువులకు  పంచారు. ఆకలితో ఉన్న వారికి కాస్తయినా సాయపడ్డామనే తృప్తితో వెనుదిరిగారు. వీలు చిక్కినప్పుడల్లా తామిద్దరం ఇలా వచ్చి  సాయం చేస్తామన్నారు.

* ఆసిఫ్‌నగర్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 1988లో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థులు.. సుమారు 63 మంది ఉంటారు. 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థు  లందరూ కలిశారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కొందరి ఆకలైనా తీర్చాలనే అంగీకారానికి వచ్చారు. అందరూ పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. తమ సంపాదనలో కొంత ఇద్దామనే నిర్ణయానికి వచ్చారు. ఆ సొమ్ముతో ప్రతినెలా ఒకటి, రెండుసార్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు పోషకాహారం అందజేస్తున్నామని వారి ప్రతినిధి రాము తెలిపారు. ఇదే స్ఫూర్తితో పేదలు, మధ్యతరగతి కుటుంబాల కాలనీల్లో ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఎంఎన్‌జే వద్ద నిత్య అన్నదానం...

నాంపల్లిలోని ఎంఎన్‌జే ఆస్పత్రికి తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దుల నుంచి పేద క్యాన్సర్‌ రోగులు వస్తుంటారు. కొన్నిసార్లు రోజుల తరబడి రోగులతోపాటు సహాయకులు ఇక్కడే ఉండాలి. రోజూ రెండు పూటలా భోజనానికి ఒకరికి కనీసం రూ.200అవుతుంది.ఆసుపత్రికి ఆనుకుని ఉన్న కనకదుర్గమ్మ ఆలయ పూజారి శ్రీనివాసశర్మ, పక్కనేఉన్న నిలోఫర్‌ కేఫ్‌ యజమాని బాబురావు కలిసి 18 ఏళ్లుగా ఇలాంటి వారి కడుపు నింపుతున్నారు. ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజనం అందిస్తుంటారు. వీలును బట్టి రాత్రి కూడా భోజనం పెడుతున్నారు. నిత్యం 500 మందికి తక్కువ కాకుండా రోగుల సహాయకులు, కూలీలు అన్నం తింటున్నారు. 


నాలుగు మెతుకులు చాలు

దీర్ఘకాలిక వ్యాధులు, రహదారి ప్రమాదాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వందలాది మంది చేరుతుంటారు. ఆసుపత్రుల్లో రోగికి మాత్రమే ఆహారం ఇస్తారు. సహాయకులకు హోటళ్లే ఆధారం.  వీరిలో అధికశాతం అర్ధాకలితో కాలం వెళ్లదీస్తుంటారు. రాబిన్‌హుడ్‌ ఆర్మీ హైదరాబాద్‌ ఛాప్టర్‌ ప్రతినిధులు ఇలాంటి వారి ఆకలి తీర్చడాన్ని యజ్ఞంగా భావిస్తుంటారు. సంస్థలు, క్యాంటీన్లు, హోటళ్లు, పబ్‌లు, వేడుకలు వంటి చోట్ల మిగిలిన ఆహారాన్ని సేకరిస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ నగరం చుట్టూ తిరుగుతూ అన్నార్తులకు చేరవేస్తున్నారు. 


రూ.5 భోజనం... భరోసా...

స్వచ్ఛంద స్వంస్థలు, ట్రస్టులు, వ్యక్తులే కాదు...జీహెచ్‌ఎంసీ అందించే రూ.5 భోజనమూ ఎంతోమంది పేదలు, కూలీలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్ల ఆకలి తీర్చుతోంది. రూ.5కు కనీసం చాయ్‌ కూడా రాని ఈ రోజుల్లో....చాలామంది కడుపు నిండా తినగలుగుతున్నారు. ముఖ్యంగా వ్యాపార కూడళ్లు, ఆసుపత్రులు, బస్టాండ్‌లు ఇతర జనసమ్మర్థంగా ఉన్న ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఎంతోమందిని ఆదుకుంటాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా 150 వరకు ఇవి ఉన్నాయి. రోజూ మధ్యాహ్నం వేడి వేడిగా అన్నం, కూర, పచ్చడి, సాంబారుతో రుచిగా అందిస్తూ పేదల మన్ననలను అందుకుంటున్నారు. 


సొంత లాభం కొంత మానుకొని..

సొంత లాభం కొంత మానుకొని...తోటి వారికి సాయం చేసేవారు తక్కువ మందే. వారిలో చమన్‌లాల్‌ సురేష్‌కుమార్‌ ఒకరు. జీహెచ్‌ఎంసీ పక్కనే నిత్యం ఎంతోమంది ఆకలి తీర్చుతున్నారు. అక్కడే వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు. రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. వ్యాపారి అయిన చమన్‌లాల్‌ లాభాల్లో కొంత ఇలా పేదల ఆకలి తీర్చడానికి కేటాయిస్తున్నారు. ఆకలితో ఉన్న మనిషికి వేడి వేడి అన్నం...పప్పు చాలు...అది అమృత తుల్యమని చెప్పే ఈయన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 


కమ్మటి రొట్టెలు...  వేడి వేడి బెల్లం జిలేబీ...

ఆ ప్రాంగణంలో అడుగు పెట్టగానే బెల్లం జిలేబీ ఘుమఘుమలు నోరూరింపజేస్తాయి. బ్రెడ్‌, వేడి వేడి కూరతోపాటు...బెల్లం జిలేబీలను అక్కడ అందిస్తారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కల్యాణ మండపం వద్ద ఓ వ్యాపార కుటుంబం 12 ఏళ్లుగా ఆర్తుల క్షుద్బాధను తీర్చుతోంది. ఒంటిగంట కొట్టగానే ఎంతోమంది ఇక్కడకు చేరుకుంటారు. వీరిలో పేదలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు,  ఆ దారిలో వెళ్లే వారు అక్కడ ఆగి...తృప్తిగా తిని వెళతారు..ఈ కార్యక్రమానికి మీకు స్ఫూర్తి ఎవరంటే.. ‘దేవుడిచ్చిన దాంట్లో కొంత ఇతరులకు పెడితే తృప్తి’ అనే జవాబు వారి నుంచి వస్తుంది. నిత్యం 250-300 మంది ఇక్కడ ఆహారం స్వీకరించి దాతలను దీవిస్తూ అక్కడి నుంచి కదులుతుంటారు.


మంచి చేద్దాం.. సంతృప్తి పొందుదాం

అతడో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అయినా ఏదో వెలితి. ఆధ్యాత్మిక గురువుతో మనోవేదన పంచుకున్నాడు. తీసుకోవటమే కాదు.. పంచుకోవాలని సూచించారు. దీంతో మిత్రబృందంతో కలసి ఒకరోజు స్వయంగా చేసిన వంటకాలను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ అవ్వ ఇచ్చిన ప్రశంస.. అతడి మనసుకు ఆనందాన్ని పంచింది. ‘మీపేరు’ అని అడిగితే.. ఎందుకులెండి.. కాస్త అన్నం పెట్టడం గొప్పగా భావించేవాణ్ని కాదన్నాడు.


పుట్టిన రోజు..  పెళ్లి రోజు..

చాలామంది పుట్టిన రోజు..పెళ్లి రోజు పార్టీల ఖర్చు కొంత తగ్గించుకొని ఆ సొమ్మును సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. ఇలాంటి ప్రత్యేక దినాల్లో కొంత మొత్తాలను ట్రస్టులకు ఇచ్చి వారి పేరుతో అన్నదానం చేస్తున్నారు. స్నేహితులు, బంధువులను పిలిచి పార్టీలు, విందులు ఇచ్చినా...ఇలాంటి సేవల్లో పాలు పంచుకుంటే ఎంతో తృప్తి కలుగుతోందంటున్నారు.


15 రోజుల నుంచి రూ.5 భోజనమే
భగవంతుడు, సుజాత దంపతులు, నాగర్‌కర్నూలు

మా బిడ్డ ప్రసవానికి నిలోఫర్‌కి తీసుకొచ్చాం. పిల్లాడు ఐసీయూలోనే ఉన్నాడు. మేం ఇక్కడి షెడ్డులో కాలం వెళ్లదీస్తూ ఇక్కడే రూ.5 భోజనం తింటున్నాం. 15 రోజుల నుంచి ఇదే ఆదుకుంటోంది. కూలీనాలీ చేసుకొని బతికేటోళ్లం. బయట డబ్బులు పెట్టి తినాలంటే కష్టమే. ఇలా రూ.5 భోజనం మమ్మల్ని ఆదుకుంటోంది. 


నా భార్య జ్ఞాపకార్థం ఏటా చేస్తా
మదన్‌లాల్‌, వ్యాపారి, సికింద్రాబాద్‌

అప్పటివరకు తమతో ఉంటున్న కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా వదిలేసి వెళ్లిపోతే ఆ బాధ వర్ణించలేనిది. వారి పేరుతో ఏదైనా సేవా కార్యక్రమం చేస్తే...కొంత మనశ్శాంతి. నా భార్య పేరుతో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా. కుటుంబమంతా కలిసి ఏదైనా ట్రస్టుతో కలిసి అన్నదానం చేస్తుంటాం. నలుగురి ఆకలి తీర్చడం కంటే తృప్తి ఏమంటుంది.


బయట ఖర్చు భరించలేక..
చంద్రయ్య, మణుగూరు

నా భార్య కడుపులో కణితి ఉండడంతో చికిత్సకు ఈ నెల 10న ఎంఎన్‌జే ఆసుపత్రికి వచ్చాం. ఆమెకు ఆసుపత్రిలో భోజనం పెడుతున్నారు. నాకు ఏ దిక్కు లేదు. బయట హోటల్‌లో తినాలంటే అంత ఖర్చు భరించలేను. దుర్గాదేవి ఆలయమే ఆదుకుంటోంది. అప్పటి నుంచి ఇక్కడే అల్పాహారం, మధ్యాహ్న భోజనం తింటున్నా. ఎంతో రుచిగా వేడి వేడిగా పెడుతున్నారు. 


అన్నదాతలు.. ప్రత్యక్ష దైవాలు
 ఇరుగు చంద్రయ్య, మిర్యాలగూడ

రోగులతోపాటు వచ్చే సహాయకులకు ఎలాంటి భరోసా ఉండటం లేదు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉంటూ...పక్కనే ఉన్న హోటల్‌ లేదంటే తోపుడు బండి వద్ద పైసలు ఇచ్చి తినాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారంతా పేదలే. బయట డబ్బులు పెట్టి తినడం కష్టమే. అన్నదానం చేసే వారు ప్రత్యక్షంగా కన్పించే దేవుళ్లు. మా లాంటి వారికి పూర్తి అండ దొరుకుతోంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.