close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

ఒక్కసారి.. ఇంకొక్కసారి!

దుస్తులు, అలంకరణ సామగ్రి పునర్వినియోగం
స్థిర ఫ్యాషన్‌ సందేశమిచ్చిన ఇవాంక
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

స్నేహితుల షాపింగ్‌కు తోడుగా వెళ్తే.. కొత్త తరహా దుస్తుల్ని చూడగానే.. మనమూ ఏదో ఒకటి కొనాల్సిందేనని మనసు పట్టుబడుతుంది. వారం కిందే షాపింగ్‌ చేసినా.. ఆఫర్‌ ఉందనో.. ఆహా అనిపించిందనో.. కొనేస్తారు. తీసుకొచ్చి వార్డ్‌రోబ్‌లో పడేస్తారు. ఇది నగరంలో దాదాపు సగంమంది అమ్మాయిలకు అలవాటుగా మారిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓసారి ధరించిన దుస్తుల వైపు మళ్లీ చూడని వారు  చాలామందే.. ప్రస్తుతం దీంతో ఏ సమస్యా లేదు. బాధంతా భవిష్యత్తులోనే.. ఎలా అంటారా..? ఇలా ఒకసారి వాడి పడేస్తున్న దుస్తులు, ఇతర ఉపకరణాలు ప్రకృతికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు పర్యావరణ వేత్తలు. ఈ తరుణంలో ప్రముఖులూ తరచూ దీని గురించే సందేశాలిస్తుండడంతో ఇప్పుడు ‘గ్రీన్‌ ఫ్యాషన్‌’ కాలం వస్తోందంటున్నారు నిపుణులు.

అన్ని రకాలుగా ముప్పే..

ఫ్యాషన్‌ రంగంలో ఎక్కువగా వినియోగించే టీషర్టులనే ప్రాతిపాదికగా తీసుకుంటే..ఓ టీషర్టును పడేసిన తర్వాత భూమిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుంది. దాని తయారీకి 2700 లీటర్ల నీరు ఖర్చవుతుంది. ఓ మనిషి 900 రోజులు వినియోగించే నీటితో అది సమానం. అంతేకాదు తయారీ క్రమంలో భారీగా విద్యుత్‌ వినియోగం, విడుదలయ్యే కర్బన ఉద్గారాలు.. ఇలా ప్రతిదీ పర్యావరణానికి హాని చేకూర్చేదేనని నిపుణులంటున్నారు. 


రాబోయే ట్రెండ్‌ అదే..

ఇప్పటికే ఫ్యాషన్‌ ప్రియుల్లో అవగాహన తెచ్చేందుకు  డిజైనర్లు ప్రయత్నిస్తున్నారు. పాత వస్త్రాలు, ఇతర అలంకరణ వస్తువులకు కొత్త మెరుగులు దిద్దుతున్నారు. పర్యావరణహితం కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ‘గ్రీన్‌ ఫ్యాషన్‌’గా అభివర్ణిస్తున్నారు. దీన్ని ప్రముఖ సంస్థలు అందిపుచ్చుకుని రీసైకిల్‌ వస్త్రాల తయారీపై దృష్టి సారిస్తున్నాయి.


కొత్త ప్రయోగాలు..

డిజైనర్లు మరో అడుగు ముందుకేస్తున్నారు. వ్యర్థాలను పునరుత్పత్తికి తేవడంతో పాటు భూమిలో తేలికగా కలిసిపోయే ఉత్పత్తులతో సరికొత్త రూపాలను సృష్టిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లోని కొన్ని సంస్థలు ప్లాస్టిక్‌ సీసాల రీసైక్లింగ్‌తో పాలిస్టర్‌ వస్త్రాలను రూపొందిస్తున్నాయి. సైకిల్‌ ట్యూబులతో జాకెట్లు, టీషర్టులను తయారు చేస్తున్నాయి. 


ప్రముఖుల సందేశాలు..

వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాల్లో ఒకసారి ధరించిన దుస్తులు మళ్లీ వేసుకోరు ఫ్యాషన్‌ ప్రియులు. అది ప్రముఖుల విషయంలో మరింత ప్రత్యేకం. రెండురోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గారాలపట్టి ఇవాంక వేరే దేశాల పర్యటనలో వేసుకున్న దుస్తులే భారత్‌ పర్యటనలోనూ ధరించి సస్టెయినబుల్‌ ఫ్యాషన్‌ని ప్రోత్సహించారని విశ్లేషిస్తున్నారు నగర డిజైనర్లు. ఆ మధ్య హాలీవుడ్‌ నటి ఎమ్మా వాట్సన్‌ ఓ బహిరంగ కార్యక్రమానికి ప్లాస్టిక్‌ సీసాల నుంచి ఉత్పత్తి చేసిన గౌన్‌ ధరించి హాజరయ్యారు.


పరిష్కారానికి మూడు అంశాలు..

నియంత్రణ: వాడకం, కొనడం తగ్గించాలి.
పునర్వినియోగం: ఒకసారి కొన్న దుస్తుల జీవితకాలం.. మన్నికను బట్టి మూడేళ్లు. అప్పటిదాకా దాన్ని వాడాలి.
పునరుత్పత్తి: వాడినవి పడేయకుండా వాటి నుంచి కొత్త రూపాలు తయారు చేయాలి. ఇతర  అవసరాలకు వాటిని  ఉపయోగించాలి.


మన దగ్గరా మారాలి..
 వాసవి రావ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌

మన దేశంలో ఈ తరహాపై ఆసక్తి ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఈ ఉత్పత్తులతో ఫ్యాషన్‌ సృష్టించేవారు తక్కువ. దానికి తోడు రీసైకిల్డ్‌ అనగానే వెనకడుగు వేసేవారూ ఉంటారు. కానీ విదేశాల్లో ఇప్పటి ఫ్యాషన్‌కు తగ్గట్లుగా రీసైకిల్‌ చేయడం, కొత్త రూపాలు సృష్టించడంలో నైపుణ్యం ఉంటుంది. అందుకే అవి ఏ రంగానికి చెందిన వారినైనా ఆకట్టుకుంటాయి. 


ఆ మూడు అంశాల్ని పాటిస్తేనే భవిత
 ప్రతిభ శర్మ, ఫ్యాషన్‌ డిజైనర్‌, లెక్చరర్‌

నియంత్రణ, పునర్వినియోగం, పునరుత్పత్తి  అంశాలనే ఈ రంగంలోకి వచ్చే వారికి  చెబుతున్నాం. ఇప్పుడు మారితేనే భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాల వనరులు దొరికే చోట మనమున్నాం.  వాటిని నాశనం చేయొద్దు. అందుకు తగ్గట్టే పాత ఫ్యాషన్‌కి కొత్త మెరుగులు దిద్దుతున్నాం. హైదరాబాదీయులు దీన్ని త్వరగానే అందిపుచ్చుకుంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.