close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

స్పందిస్తున్న హృదయాలు

అన్నార్తులను ఆదుకుంటున్న పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అంతటా లాక్‌డౌన్‌. కనుచూపు మేరలో ఎక్కడా జనసంచారం కానరావడం లేదు. దుకాణాలకు సెలవు.. హోటళ్లు బంద్‌.. పొట్ట నింపుకోలేక అవస్థలు పడుతున్న అభాగ్యులు, కార్మికులకు మేమున్నామంటూ పోలీసులు, మానవతామూర్తులు అండగా నిలుస్తున్నారు. ట్విట్టర్‌, డయల్‌ 100, సహాయక నంబర్ల ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలపై పోలీసులు స్పందించి బాధితుల ఆకలి తీరుస్తున్నారు. కీసరలోని రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ కార్మికులకు భోజన సదుపాయాలను అక్కడి బిల్డర్లతో మాట్లాడి ఏర్పాటుచేయించారు. అల్వాల్‌, కూకట్‌పల్లి, నార్త్‌జోన్‌లోని కార్ఖానా, మియాపూర్‌తో పాటు నగరంలోని పలు ఠాణాల పరిధిలోనూ పోలీసులు తమ దాతృత్వాన్ని ప్రదర్శించారు. అలానే నగరంలోని స్వచ్ఛంద సంస్థలు జీహెచ్‌ఎంసీతో కలిసి ఆహారాన్ని పంచేందుకు ముందుకొచ్చాయి. నాంపల్లి స్టేషన్‌ వద్ద ఉన్న కొందరు అన్నార్తులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశాయి. షాద్‌నగర్‌కు చెందిన మార్వాడీ సమాజ్‌ గణేశ్‌ మండలి 11 పేద కుటుంబాలను దత్తత తీసుకుంది. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు నిత్యవసరాలు అందిస్తామని పేర్కొంది. కలాం ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ తలాబ్‌కట్ట, మంగళ్‌హాట్‌, ధూల్‌పేట్‌, ఎన్టీఆర్‌నగర్‌, ఎల్లమ్మబండల్లోని మురికివాడల్లో నివసిస్తున్న 1000 కుటుంబాలకు రేషన్‌ కిట్ల పంపిణీకి ముందుకొచ్చింది. ప్రొఫెషనల్‌ సాలిడిటరీ ఫోరం నగరంలోని అన్నార్తులకు 2వేల ఆహార పొట్లాలను పంచిపెట్టింది. హెల్పింగ్‌హ్యాండ్‌ హ్యుమానిటీ, సైబారాబాద్‌ పోలీసులతో కలిసి రోజూ 200 ఆహార పొట్లాలను పంపిణీ చేస్తోంది. మెహదీపట్నంకు చెందిన సామాజిక కార్యకర్త కె.ప్రవీణ్‌ తన స్నేహితులు, బంధువుల సాయంతో పలువురి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చాడు. అత్యవసర సహాయం కోసం డయల్‌ 100 లేదా, 94906 17111 నంబర్లను సంప్రదించాలంటూ రాచకొండ కమిషనర్‌ ఇటీవల ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉంటున్న వారెవరైనా జనాల్లోకి వస్తే కరోనా కంట్రోల్‌ రూం నంబరు 94906 17234కు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. రోడ్లపై ఏర్పాటు చేస్తున్న కంచెలను తొలగించాలన్నారు. 800 మంది పాస్‌పోర్టులు సీజ్‌ చేశామని పేర్కొన్నారు. కొత్తగా కూరగాయల మార్కెట్లు సైతం విశాలమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయించామని తెలిపారు.


సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం: మహేష్‌ భగవత్‌, రాచకొండ సీపీ

నాగోలు, న్యూస్‌టుడే: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని భువనగిరి, మల్కాజిగిరి, ఎల్బీనగర్‌ జోన్లలో ఆకలితో అలమటిస్తున్నవారికి సాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ మహేశ్‌భగవత్‌ తెలిపారు. శనివారం నాగోలులోని క్యాంపు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బాలాపూర్‌, న్యూబాబానగర్‌లోనూ పశ్చిమబంగాకు చెందిన వలస కార్మికుల దీనస్థితిని కోల్‌కతాకు చెందిన ఓ ఎమ్మెల్యే తనకు తెలపగా స్థానిక దాతల సాయంతో భోజన ఏర్పాట్లు చేయించామన్నారు. వందమందికి పైగా ట్రాన్స్‌జెండర్లకు ప్రజ్వల సంస్థ ప్రతినిధి డా.సునీత కృష్ణన్‌ ఆధ్వర్యంలో మౌంట్‌ఫోర్డ్‌ సోషల్‌ ఇనిస్టిట్యూట్‌ సమన్వయకర్త ఎండీ తురాబ్‌ సహకారంతో నెలకు సరిపడా సరకులను పంపిణీ చేయించినట్లు చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.