close

శనివారం, జూన్ 06, 2020

ప్రధానాంశాలు

మాస్కులు.. మరవద్దు జాగ్రత్తలు

వాడి ఇష్టారీతిన పడేస్తే ముప్పు
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో కరోనా వైరస్‌ కేసులు పెరగడంతో ప్రజలు మరింత అప్రమత్తం అయ్యారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల హెచ్చరికలతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. కొవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్నవారు తుమ్మినా, దగ్గినా పడే తుంపర్లతో ఇతరులకు వ్యాధి వ్యాపించే అవకాశం ఉండటంతో.. ఇంటి నుంచి అత్యవసర పనుల కోసం బయటకొస్తున్న ప్రతి ఒక్కరూ ముఖాలకు మాస్క్‌లు ధరిస్తున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కూడా కొవిడ్‌ వ్యాప్తి నిరోధానికి మాస్క్‌లు ధరించాలని తాజాగా సూచనలు చేసింది. ప్రజలు సైతం మార్కెట్లో కొనుగోలు చేసినవి, ఇంట్లో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరిస్తున్నారు. ఇవేవీ అందుబాటులో లేనివారు చేతి రుమాళ్లు ఉపయోగిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మాస్క్‌లు వాడి ఇష్టారీతిగా పడేస్తున్నారు. రోడ్లపై, పాదబాటలపై, చెరువుల్లో ఎక్కడ పడితే అక్కడ వాడి పడేసిన మాస్క్‌లు కన్పిస్తున్నాయి. వీటితో జంతువులు, పక్షులకు ముప్పు పొంచి ఉంది. కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతూ మాస్క్‌ వాడి ఇష్టారీతిన పడేస్తే తెలియక ఎవరైనా ముట్టుకుంటే ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మాస్క్‌ల వాడకం మంచిదే అయినా వాటిని ఎలా వాడాలి? ఎక్కడ పడేయాలి అనేది కూడా తెలిసి ఉండడం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

చెత్తలో కలుస్తున్నాయ్‌..
ఆసుపత్రిలో వైద్యులు ఉపయోగిస్తున్న మాస్క్‌లను మాత్రమే ప్రస్తుతం బయో వేస్ట్‌ కింద పరిగణిస్తూ జాగ్రత్తగా వాటిని నిర్వీర్యం చేస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలుపుతున్నారు. ప్రజలు ముందు జాగ్రత్తగా వాడినవన్నీ మున్సిపల్‌ వ్యర్థాల్లో కలిసిపోతున్నాయి. కొన్ని గాలికి ఎగిరిపోతూ చెరువులు, చెట్ల వద్ద పడిపోతున్నాయి. వీటిని సైతం చెత్త నుంచి వేరు చేసి నిర్వీర్యం చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.


వాడేటప్పుడు ఇలా..

* మాస్క్‌ ధరించడానికి ముందు చేతులను సబ్బు, నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
* ముక్కు, నోరు మొత్తం కన్పించకుండా, ముఖానికి మాస్క్‌కు మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా ధరించాలి.
* ముఖానికి కట్టుకునేటప్పుడు చేతులు దానికి తాకకుండా చూసుకోవాలి.
* మార్కెట్లో చౌకగా దొరికే మాస్క్‌లన్నీ ఒకసారి వాడకానికి మాత్రమే. ముఖం నుంచి మాస్క్‌ ఒకసారి తీశారంటే ఆ తర్వాత కొత్తది వాడడం మేలు. వాడినవి పదేపదే వాడొద్దు.


పడేసేటప్పుడు..

* మాస్క్‌ను వెనక నుంచి తీయాలి. ముందు భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో తాకవద్దు.
* ముఖం నుంచి తీసిన వెంటనే మూసి ఉన్న డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలి. ఒక కాగితంలో చుట్టి వేయడం మంచిదని వైద్యులు అంటున్నారు.
* మాస్క్‌ చేతితో తీసిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. లేదా శానిటైజర్‌ రుద్దుకోవాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.