close

మంగళవారం, మే 26, 2020

ప్రధానాంశాలు

ఆపద వేళ.. చిన్నారులకు బాసట

వలస కూలీల పిల్లలకు ప్రత్యేక కిట్లు
బాలసదనం, శిశుగృహాల్లో జాగ్రత్తలు
ఔదార్యం చూపిన జిల్లా బాలల పరిరక్షణ విభాగం

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ వేళ వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని వలస కార్మికులు, జిల్లా మీదుగా వివిధ ప్రాంతాలకు తరలివెళ్లేవారి ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. జిల్లాలోకి ప్రవేశించిన వలస కార్మికుల పిల్లల కోసం బాలల పరిరక్షణ విభాగం ప్రత్యేక దృష్టి సారించి వారికి వివిధ రకాల వస్తువులు ఉన్న కిట్లను పంపిణీ చేసింది. అంతేకాకుండా ఆ చిన్నారులకు తగిన చేయూత అందించింది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.
లాక్‌డౌన్‌తో వలస కార్మికుల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉపాధి కరవై, చేతిలో రూపాయి లేక, సరిపడా ఆహారం లభించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి బాధలు గుర్తించిన జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు ప్రత్యేకంగా కిట్లను అందజేసింది. ఈ కిట్లలో మాస్క్‌లు, సబ్బు, ఓఆర్‌ఎస్‌, బిస్కెట్‌, చిరుతిండి ప్యాకెట్లతో పాటు నీటి సీసా ఉన్నాయి. ఇవి వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
ఇప్పటి వరకు 150 కిట్ల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 150 కిట్లను వలస కార్మికుల బాలలకు పంపిణీ చేశారు. మరో 250 అందుబాటులో ఉన్నాయి. వీటిని సైతం వలస కార్మికుల బాలలకు పంపిణీ చేయనున్నారు. కిట్లు పంపిణీ చేసే సమయంలో వారి బాగోగులు తెలుసుకోవడంతో పాటు రవాణా సమచారాన్ని తెలియజేయడం, కరోనాపై అవగాహన కల్పించి వారిలో ఆత్మస్థ్యైర్యం పెంపొందించడం వంటి చర్యలు చేపట్టారు.
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం
- కె.రాజేశ్‌కుమార్‌, జిల్లా అధికారి, బాలల పరిరక్షణ విభాగం, వికారాబాద్‌.
లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శ్రామిక్‌ రైళ్లలో వెళ్లే వలస కార్మికుల పిల్లలకు రైల్వే పోలీసుల సహకారంతో వైరస్‌ వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాం. వారికి ఉపయోగపడే వస్తువులతో కిట్లు పంపిణీ చేశాం.
పరిగి సదనంలో...
పరిగిలో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం బాల సదనం నిర్వహిస్తోంది. సంరక్షకులు లేని బాలికలు 50 మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. లాక్‌డౌన్‌ వేళ ఇక్కడి బాలలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాలికలకు మాస్క్‌లు, శానిటైజర్‌ సీసాలు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి వైద్యాధికారితో వారానికి రెండు సార్లు పరీక్షలు చేయించారు. ఇతరులను బాల సదనానికి రాకుండా కట్టడి చేశారు. బాలికలకు చిన్న చిన్న క్రీడలను నేర్పించారు. టివీ ద్వారా లఘు చిత్రాలను ప్రదర్శించి వైరస్‌ వ్యాప్తిగా అవగాహన కల్పించేందుకు కృషి చేశారు.  వారిలో వివిధ నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ప్రార్థన, కంప్యూటర్‌లో ప్రాథమిక అంశాలపై శిక్షణ,  చిత్రలేఖనం, పెయిటింగ్‌, పేపర్లతో వివిధ ఆకృతుల తయారీ, బృంద చర్చలు, మొక్కలు, చెట్ల సంరక్షణ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. వికారాబాద్‌లోని శిశుగృహలోనూ ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ 9 మంది శిశువులు ఉన్నారు. భవనాన్ని శానిటైజ్‌ చేయించడంతో పాటు తరచూ శుభ్రం చేసేలా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.