close

శుక్రవారం, జూన్ 05, 2020

ప్రధానాంశాలు

ప్రహరీల సుందరీకరణ.. పూర్తయ్యేనా!

నిధులు మంజూరైనా పనుల్లో తాత్సారం
చైతన్యం కలిగించే చిత్రాలు వేస్తే ప్రయోజనం

న్యూస్‌టుడే, పరిగి: ఎవరి నోట విన్నా ఇప్పుడు కరోనా మాటే. ఇప్పటికే అనేక మంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక్కటే మార్గం. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లాక్‌డౌన్‌ విధించి ప్రజలు భౌతిక దూరం పాటించేలా చైతన్యం కల్పించాయి. ఇదే విధానం కొనసాగించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలి. పరిగి పురపాలక శాఖ ఆధీనంలో ప్రభుత్వ కార్యాలయాల సుందరీకరణ పనులకు గతంలో రూ.6.9లక్షలను మంజూరు చేసింది. వీటితో పర్యావరణం, స్వచ్ఛభారత్‌, హరితహారం, పరిశుభ్రత తదితర అంశాల గురించి ప్రహరీలపై చిత్రాలు గీయనున్నారు. ఇదే సమయంలో కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు, అవగాహన కల్పించేందుకు కూడా ఇవి దోహదపడనున్నాయి.
పరిశుభ్రతే లక్ష్యంగా...
భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం పాటించకుంటే కలిగే కష్టనష్టాలను ప్రహరీలపై ప్రజలు ఆసక్తిగా చూసే విధంగా చిత్రాలు రూపుదిద్దుకోవాలని పలువురు కోరుతున్నారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని గ్రామ పంచాయతీలు, సామాజిక భవనాలపై ఏర్పాటు చేస్తే కొంతైనా మేలు కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. తొలకరి వర్షాలు త్వరలోనే పలకరించనున్నాయి. హరితహారం కింద నాటిన మొక్కలు మేకలకు ఆహారంగా మారుతున్నాయి. పర్యావరణ పరిరక్షణపై కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను సూచించే చిత్రాలు ప్రహరీలపై వేయిస్తే స్థానికులకు అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్‌ నిబంధనలు, సామాజిక చైతన్యం కలిగించే సూక్తులు, బొమ్మలు వేయించడం ద్వారా కొంత వరకూ ప్రజల్లో మార్పు తీసుకురావచ్చని స్థానికులు చెబుతున్నారు.
ఉన్నతాధికారులు టెండర్లు పిలిచారు
- జి.తేజిరెడ్డి, కమిషనర్‌
కార్యాలయాలకు సంబంధించిన ప్రహరీల సుందరీకరణ పనులకు ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికానుంది. చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు ప్రజలను చైతన్య పరిచేవిగా ఉంటాయి.
గోడలపై సినిమా పోస్టర్లు
పట్టణం నుంచి వికారాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపైనే కోర్టు, ఉపకారాగారం, సహకార బ్యాంకు, ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, మినీ స్టేడియం, నీటి పారుదల శాఖ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నం.1, ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయం, పురపాలక సంఘ కార్యాలయాలకు చెందిన ప్రహరీలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం వాటిపై ప్రైవేట్‌ పోస్టర్లు వెలుస్తున్నాయి. మరికొన్ని ప్రధాన ప్రాంతాల్లో సినిమా పోస్టర్లను అతికించడం, మేకలు తినడం లేదా చించేయడంతో ప్రహరీలు చూసేందుకు కూడా కళావిహీనంగా కనిపిస్తున్నాయి. పైగా ప్రహరీలు దెబ్బతింటున్నాయి. గతంలో ఇక్కడ జిల్లా పాలనాధికారిణిగా పనిచేసిన ఆయిష మస్రత్‌ ఖానమ్‌ ప్రహరీల సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. నిధులు మంజూరై నాలుగు నెలలు కావస్తున్నా నేటికీ ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లా కేంద్రంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రహరీలన్నీ కొత్త శోభను సంతరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మున్సిఫ్‌ కోర్టు నుంచి తహసీల్దార్‌ కార్యాలయం మధ్యలో రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం ఉంది. దీని ప్రహరీ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇదే సమయంలో ప్రహరీ నిర్మాణాలు పూర్తి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పట్టణ వాసులు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.