close

బుధవారం, మే 27, 2020

ప్రధానాంశాలు

అటు కరోనా.. ఇటు ఎండలు

నగరవాసీ.. జాగ్రత్తలు తప్పనిసరి

రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఈనాడు, హైదరాబాద్‌

కరోనా వ్యాప్తి ఆగడం లేదు. నిత్యం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వారం నుంచి కరోనాతో మరణాల సంఖ్యా పెరుగుతోంది. మరోవైపు.. కొన్ని రోజులుగా ఎండలు మండి పోతున్నాయి. నగర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. పగలు, రాత్రి తేడా లేకుండా ఉక్కపోత, వేడితో నగరవాసులు అల్లాడి పోతున్నారు.  ఎండలు తీవ్రం కావడంతో డీహైడ్రేషన్‌తో వడదెబ్బ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలే కరోనాతో అందరూ ఆందోళన చెందుతున్నారు. కార్యాలయాలకు, ఇతర పనులపై తప్పనిసరై బయటకు వస్తుండగా.. ఇప్పుడు ఎండలు తాకిడికి అల్లాడిపోతున్నారు.  ఎండలో తిరిగే వారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పొడిగాలులతో న‘గరం’!
భానుడు భగ్గుమంటున్నాడు. భాగ్యనగరం నిప్పుల కొలిమిలా మారింది. కరోనా భయంతో లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమై.. ఆంక్షల సడలింపుతో బయటకు వచ్చారో లేదో నగరవాసిని ఎండలు భయపెడుతున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలపైన పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బయట వేడిగాలులకు తాళలేక ఇళ్లకే ఎక్కువ మంది పరిమితం అయ్యారు.  సాధారణంగా ఫిబ్రవరి ఆఖరి నుంచి ఎండలు దంచికొడతాయి. ఈసారి మే మూడోవారం వరకు మధ్యమధ్యలో మినహా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. వేసవి ముగియడానికి మరికొద్దిరోజులు మాత్రమే ఉండటంతో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీనికి తుపాను తోడవడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోయి పొడిగాలులతో ఎండల తీవ్రత రాజధానిలో పెరిగింది. ఈ వేసవిలో ఇవే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు. రాబోయే రోజుల్లో వడగాలులు వీచే     అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇలా చేస్తే మేలు..
* వేసవిలో చెమటతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. రోజూ ఏదో రూపంలో 4 నుంచి 5 లీటర్లు ద్రవపదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* నీళ్లు మాత్రమే తీసుకోకుండా ఉప్పు, కొంచెం చక్కెర కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండాలి.
* ఇంట్లో ఐస్‌ లేకుండానే నిమ్మరసం, మజ్జిగ ఇతర జ్యూసులు తయారు చేసుకోవడం మంచిది.
* వేసవిలో వేపుడు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉండే ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
* మద్యపానానికి దూరంగా ఉండాలి. పగటి పూట ఎండలో మద్యం తాగడం మరింత హాని చేస్తుంది. వడదెబ్బకూ దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
* కిడ్నీ, గుండె సంబంధిత తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఎండలోకి వెళ్లకపోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.