close

బుధవారం, మే 27, 2020

ప్రధానాంశాలు

హద్దులు మీరుతున్నారు

ఆక్రమణలకు గురవుతున్న రహదారులు
పట్టించుకోని అధికారులు
ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

రహదారులు ఆక్రమణకు గురవుతున్నాయి. వీటిని ఆనుకుని పొలాలున్నవారు.. స్థిరాస్తి వ్యాపారులు హద్దులు దాటి కంచెలు వేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా ప్రయాణికుల ఆహ్లాదానికి నాటిన హరితహారం మొక్కలను యథేచ్ఛగా తొలగిస్తున్నారు. ఈ పరిణామంతో దారులు కుంచించుకుపోయి ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సర్వే చేసి హద్దు రాళ్ల ఏర్పాటు చేసేందుకు నిధులు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతోనే సరిపోతోందని వారు పేర్కొంటున్నారు.
జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధీనంలో 900 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, పరిగి, ఇతర మండల కేంద్రాలు, పక్క జిల్లాలను అనుసంధానం చేస్తూ వీటిని నిర్మించారు. శాఖ పరిధిలోని రోడ్డు కనీసం 50, 66, 100 అడుగుల వెడల్పు వరకు మూడు రకాలుగా ఉంటాయి. దారి మధ్య నుంచి ప్రతి కిలోమీటరుకు రెండు వైపులా ఐదేసి చొప్పున మొత్తం పది హద్దు రాళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చాలా రోజులుగా రహదారుల పరిధిని సూచించే రాళ్లు ఏర్పాటు చేయడం లేదు. దీంతో అటూ, ఇటూ ఉన్న వ్యవసాయ, ఇతర భూ యజమానులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాల యజమానులు నేరుగా రహదారికి ఆనుకుని గోడలు నిర్మిస్తున్నారని జడ్పీటీసీ సభ్యులు గత పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తెచ్చారు. దీని వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై రహదారులు, భవనాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 750 కిలోమీటర్ల రహదారిలో ఆక్రమణలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వీటిని గుర్తించి, సరిహద్దుల లెక్క తేల్చేందుకు సుమారు రూ.70 లక్షల నిధులు అవసరం ఉంటాయని   ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం
- లాల్‌సింగ్‌, రహదారులు, భవనాల శాఖ జిల్లా అధికారి
రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయి. సర్వే చేసి, హద్దులను తేల్చేందుకు నిధుల అవసరముందని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. రాగానే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.