close

బుధవారం, మే 27, 2020

ప్రధానాంశాలు

మహమ్మారి... మనసులోకి దూరి!

దగ్గొచ్చినా.. శరీరం వేడెక్కినా ఆసుపత్రికి పరుగులు
ఈనాడు, హైదరాబాద్‌

డాక్టర్‌.. రాత్రంతా పొడిదగ్గు చాలా ఇబ్బందికి గురిచేసింది. ఉదయాన్నే ఒళ్లు కూడా కాస్త వెచ్చబడినట్టుంది. భయంగా ఉంది.. ఇప్పుడేం చేయాలి..?  వీడియోకాల్‌లో ఓ వైద్యుడికి ఎదురైన అనుభవం ఇది. రెండు రోజులపాటు బాధితుడు పడిన బాధ చూడలేక వైద్య పరీక్షలు చేయించుకోమని ఆయన సూచించారు.
‘‘యూఎస్‌లో ఎంఎస్‌ చేసేందుకు దరఖాస్తు చేశాను. బ్యాంకు రుణం తీసుకొని డబ్బు చెల్లించాను. మార్చి నెలాఖరున వెళ్లాల్సిన ప్రయాణం లాక్‌డౌన్‌తో రద్దయింది. ఒకవేళ ఆంక్షలు సడలించినా ఇంట్లో వాళ్లు అమెరికా పంపేందుకు ససేమిరా అంటున్నారు. డబ్బు పోతే పోనీ అంటున్నారు. ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది’’ అంటూ యువకుడి నిస్పృహ.
గ్రేటర్‌లో మనస్తత్వ నిపుణుల వద్దకు కౌన్సెలింగ్‌కు వచ్చిన బాధితుల్లో ఇవి ఉదాహరణలు మాత్రమే. కరోనాతో  ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు అందినట్టే అంది చేజారిపోయాయి. భవిష్యత్తుపై ఉన్న ఆశలన్నీ అడియాశలయ్యాయనే బాధ మనసును మెలిపెడుతున్నాయి. ఇటీవల ది మావెరిక్స్‌ ఇండియా అనే సంస్థ జరిపిన సర్వేలో దేశంలో 61శాతం మంది ఆర్థిక, ఉద్యోగ భద్రత అంశాలతో మానసిక సమస్యల బారినపడినట్లు తేలింది. కొన్ని రకాల ఫోబియాలు సున్నిత మనస్కులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి..

సానుకూల ఆలోచనలతో మనోధైర్యం
- డాక్టర్‌ హరీష్‌చంద్రారెడ్డి, న్యూరో సైకియాట్రిస్ట్‌
సున్నిత మనస్కులు, ఆందోళనకు గురయ్యే లక్షణాలు ఉండే వారిలో భయాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ఫోబియాలు, హైపోకాండ్రియాసిస్‌ అనే మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. సానుకూల ఆలోచనలతో వీటిని అధిగమించవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే కరోనా అంశాలు చూడవద్దు. రోజూ 30 నిమిషాలు కసరత్తు, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.

ఏదో జరిగిపోతుందనే భయమొద్దు
- రాంచందర్‌, మనస్తత్వ నిపుణులు
కోటికి పైగా జనాభా ఉన్న మహానగరంలోనూ భవిష్యత్తుపై బెంగ, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల్లో ఎదురవబోయే ఇబ్బందులను తలచుకుని మనోవేదన చెందుతున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో అధిక శాతం నలుగురిలో కలవలేకపోతున్నారు. తమ ప్రాంతంలో పాజిటివ్‌ నమోదైతే తమకూ మరణం తప్పదనే ప్రతికూల ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నారు. ఓ సైకియాట్రిస్ట్‌ వద్దకు 10 రోజుల వ్యవధిలో వచ్చిన 50 ఫోన్‌కాల్స్‌లో 40 మంది కేవలం భయాలు, అపోహలతో సంప్రదించటం పరిస్థితికి అద్దం పడుతోంది. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా తమకేదో జరిగిందనే ఉద్దేశంతో వణకిపోతున్నవారున్నారు. చిన్నవాటికే ఆందోళనకు గురవుతూ.. ఏదో జరిగిపోతుందనే భయంతో భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.