close

సోమవారం, జులై 13, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎక్కువ పరీక్షలు చేయడంతోనే కరోనా కట్టడి

డీఆర్‌డీవోతో కలిసి ఔషధ పరీక్షలు
నిర్వీర్య వైరస్‌తో టీకాల తయారీపై పలు సంస్థల ప్రయోగాలు
ఒంటెల నుంచి యాంటీ బాడీల తయారీ
సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా
ఈనాడు, హైదరాబాద్‌  

లక్షణాలు కనిపించని కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అత్యధికమని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా అన్నారు. ఎక్కువ మందికి ఎలాంటి చికిత్స లేకున్నా కోలుకుంటారని.. కానీ వారితో వైరస్‌ సంక్రమణ జరిగే ప్రమాదముందని పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేయవచ్చన్నారు. దేశవ్యాప్తంగా కేసుల్లో వ్యత్యాసానికి రాష్ట్రాలు పూర్తి సామర్థ్యంతో పరీక్షలు చేయకపోవడమే కారణమని తెలిపారు. పరీక్షలు చేస్తే పాజిటివ్‌ కేసులు లేవన్న చోట కూడా బయటపడొచ్చన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులతో మున్ముందు కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా మసులుకోవాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)లో నెలన్నర రోజులుగా జరుగుతున్న పరిశోధనల వివరాలను ఆయన గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
* దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల రోగుల నమూనాల నుంచి వేరుచేసిన వైరస్‌ను సీసీఎంబీ వైరాలజిస్టు డాక్టర్‌ కృష్ణన్‌ హెచ్‌ హర్షన్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ప్రయోగశాలలో వృద్ధి చేస్తోంది. ఈ నిర్వీర్య వైరస్‌పై కరోనాను ఎదుర్కొనే టీకాలు, ఔషధాల తయారీ పరిశోధనలు పురోగతిలో ఉన్నాయి. వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిసి ఈ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల ఇన్‌ఫ్లూయంజాలను నయం చేసేందుకు ఉపయోగిస్తున్న ఔషధాల్లో కరోనాపై పనిచేస్తాయని గుర్తించిన వాటిని ల్యాబ్‌లో వైరస్‌పై ప్రయోగిస్తున్నారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఈ తరహా ఔషధ పరీక్షలు నిర్వహిస్తోంది.

* నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌నే టీకాగా అభివృద్ధి చేసేందుకు పలు సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి. నిర్వీర్యమైన వైరస్‌ను ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. మానవ కణంలోకి ప్రవేశిస్తే రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించి యాంటీబాడీలను తయారుచేస్తుంది. దీంతో కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించగానే పోరాడుతుంది కాబట్టి వ్యాధి సోకదు అనేది ఈ టీకా తయారీ లక్ష్యం. పోలియో వంటి వ్యాధుల నివారణకు ఈ తరహా టీకాలను వాడుతున్నారు.
* యాంటీబాడీలు/యాంటీడాట్స్‌ తయారీకి వృద్ధి చేసిన వైరస్‌తో నగరానికి చెందిన పలు సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి యాంటీబాడీల సేకరణకు అదనంగా ఎలుకలు,గుర్రాలు, ఒంటెల నుంచి యాంటీబాడీల తయారీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ వృద్ధిచేసిన వైరస్‌ను గుర్రాలు, ఒంటెల్లోకి ప్రవేశపెడితే వాటి శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి.వీటిని సేకరించి శుద్ధిచేసి యాంటీడాట్స్‌గా వినియోగించే పరిశోధనలు పురోగతిలో ఉన్నాయి.
* యాంటీబాడీలు ఏ మేరకు పనిచేస్తున్నాయనే పరీక్షలు వృద్ధి చేసిన వైరస్‌పై జరుగుతున్నాయి.
* క్రిమి సంహారం చేసేందుకు ఎక్కువగా అతినీల లోహిత(యూవీ-సి) పరికరాలు తయారుచేస్తున్నారు. వీటి అవసరం ఎక్కువగా ఉంది. వీటితో పాటు పీపీఈ కిట్లు ఏ మేరకు సురక్షితమా అని..పెంచిన వైరస్‌తో సీసీఎంబీలో పరీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.