close

శనివారం, ఆగస్టు 15, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వేళ.. పైపైకి టమాటా ధర

అదే దారిలో మిగతా కూరగాయలు

డీజిల్‌ రేటు పెరగడమూ కారణమే

ఈనాడు-హైదరాబాద్‌ : టమాటా ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోంది. వర్షాకాలం ఆరంభానికి ముందు ధర లేక పొలంలోనే వాడిపోయి.. రాలిపోయిన టమాటా ఇప్పుడు మార్కెట్లో ఖరీదైన కూరగాయగా మారిపోయింది. రూ.వందలో సగం పెడితే కాని.. కిలో రావడం లేదు. అది కూడా రైతు బజారులో అయితేనే. సూపర్‌ మార్కెట్లు, కాలనీల్లో రిటైల్‌ అమ్మకందారుల దగ్గరకు వెళ్తే రూ.55కి తగ్గడంలేదు. మిగతా కూరగాయల ధరలు కూడా కరోనా వేళ ఆందోళనకు గురి చేస్తున్నాయి.

కరోనా బూచితో..

రైతు బజారుకు వెళ్తే కూరగాయలు తక్కువ ధరకే దొరుకుతాయి. కరోనా భయంతో నగర ప్రజలు రైతు బజార్లకు వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని కాలనీల్లోని వ్యాపారులు, దుకాణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. రిటైల్‌ అమ్మకం దారులు, సూపర్‌ మార్కెట్ల నిర్వాహకులు కిలో రూ.20 తేడాతో అమ్మేస్తున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్లు, రైతుబజార్లలో కిలో రూ.30 లోపు ఉన్న వాటిని రూ.50కి పైగా ధరకు అమ్మేస్తున్నారు. ఉదాహరణకు బెండకాయ.. రైతుబజార్లో రూ.19గా ఉంటే.. రిటైల్‌కు వచ్చేసరికి రూ.32 నుంచి 35కి తక్కువ కాకుండా విక్రయిస్తున్నారు. బీరకాయ రైతుబజార్లో రూ.38 ఉంటే.. సూపర్‌ మార్కెట్‌లో రూ.60 పలుకుతోంది. ఇలా కూరగాయలన్నిటిపైనా 30 నుంచి 40 శాతం అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ ప్రభావం ఆకు కూరలపైనా పడింది. అవి కూడా గతం కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.

30 నుంచి 40 శాతం పెరుగుదల

టమాటాతో పాటు.. ఇతర కూరగాయల ధరలు కూడా 30 నుంచి 40 శాతం ధరలు పెరిగాయి. ఖరీఫ్‌ కాలం కావడంతో తెలంగాణలో కూరగాయల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. మెదక్‌, సంగారెడ్డి, చేవెళ్ల, పరిగి, శంకర్‌పల్లి, వికారాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల నుంచి నగరానికి కూరగాయలు వస్తాయి. వరి పంటలేయడంతో టమాటా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. టమాటాతో పాటు.. ఇతర కూరగాయలు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి వస్తున్నాయి. ఏప్రిల్‌తో పోల్చితే లీటర్‌ డీజిల్‌ సుమారు రూ.10 పెరగడంతో రవాణా ఖర్చులు కూరగాయల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నెమ్మదిగా హోటళ్లు కూడా తెరుచుకుంటున్నాయి. వినియోగం పెరగడం.. సరఫరా తగ్గడం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. అనంతపురం, మదనపల్లి నుంచి టమాటా నగరానికి వస్తుంది. రవాణా ఛార్జీలు పెరగడంతో ధర అనూహ్యంగా పెరిగింది. అక్టోబరు వరకూ స్థానికంగా టమాటా అందుబాటులోకి రాదు.. అప్పటివరకూ ఈ భారాన్ని భరించాల్సిందే.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.