close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీళ్లకు నీళ్లు

● కాల్వలు, తూముల మరమ్మతులకు శ్రీకారం

● ‘ఉపాధి’తో సాగుకు పెన్నిధి ●

నీటిపారుదల శాఖకు అనుసంధానం

న్యూస్‌టుడే, తాండూరు పట్టణం


సుల్తాన్‌పూర్‌ కాలువలో మట్టిని తొలగిస్తున్న కూలీలు

తూము వద్ద పనులు

వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని ఆయా మండలాల పరిధిలో చిన్న, పెద్ద సాగు నీటి వనరులు ఉన్నాయి. జిల్లాలోని కోట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, లక్నాపూరు, అల్లాపూరు, నందివాడు, కొంశెట్టిపల్లి ప్రాజెక్టుల కింద కాల్వలు, తూములు బాగు చేయటానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పథకం అమలుతో కాల్వల్లోని ముళ్ల పొదలు తొలగించి, మూసుకు పోయిన తూములను బాగు చేయనున్నారు. తద్వారా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగనుంది. మూడేళ్ల నుంచి ఆశించిన వానలు కురవకపోవటంతో జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల కింద పంటల సాగు గణనీయంగా పడిపోయింది. అంతేకాకుండా కాల్వలు, తూములు సక్రమంగా లేకపోవటంతో పొలాలకు నీరందక రైతులు పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయలేకపోయారు. ప్రస్తుతం ఉపాధి నిధుల ఖర్చు చేసి మరమ్మతులు చేయడంతో సాగు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చెరువుల కింద ఉన్న కాల్వలు, తూములు రైతులే స్వయంగా బాగు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీని ద్వారా పనులు పకడ్బందీగా చేయనున్నారు.

పెద్ద ప్రాజెక్టు కోట్‌పల్లి

జిల్లాలో పెద్ద ప్రాజెక్టు కోట్‌పల్లి. ఈ జలాశయం పరిధిలో పెద్దేముల్‌, ధారూర్‌ మండలాలున్నాయి. వీటి పరిధిలో 9,200 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. కాలువలు సరిగా లేక మూడేళ్లుగా పూర్తి స్థాయిలో సాగుకు నోచలేదు. ప్రస్తుతం చేపడుతున్న పనులతో ఈ రెండు మండలాల పరిధి 18 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

జుంటుపల్లి

తాండూరు నియోజకవర్గం యాలాల మండలం జుంటుపల్లి ప్రాజెక్టు కింద సాగు పెరగనుంది. ప్రాజెక్టు కింద 2,800 ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి కాల్వ కింద 1600, ఎడమ కాల్వ కింద 1200 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం కుడి ఎడమ కాల్వ కింద ఉన్న జుంటుపల్లి పరిధి భూములకు మాత్రమే నీరు అందుతోంది. పేర్కంపల్లి, పేర్కంపల్లి తండా, ఎన్కేపల్లి, అక్కంపల్లి, చెన్నారం, పగిడిపల్లి, అగ్గనూరు పొలాలకు సాగు నీరు అందటం లేదు.

జిల్లాలో అత్యధికంగా వ్యవవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రెండు లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. నీటి వనరులు చెప్పుకోదగిన స్థాయిలో లేవు. ఉన్నవాటిల్లో పంట కాలువలు నిర్వహణ కొరవడి చివరి ఆయకట్టుకు నీరందడంలేదు. వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. వీటిని సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నీటిపారుదల శాఖకు ఉపాధి హామీని అనుసంధానం చేసి కాల్వలు, తూములకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. ఉపాధి నిధులు కేటాయించడంతో కూలీలకు ముమ్మరంగా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా పనులను ప్రారంభించారు. ఇది మంచి పరిణామమని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం నీటి వనరులు

40 నుంచి 100 ఎకరాల మధ్య ఆయకట్టు ఉన్నవి

40 ఎకరాల లోపు ఆయకట్టు ఉన్నవి

100 ఎకరాల పైగా ఆయకట్టు ఉన్నవి

జిల్లాలో ఇలా నిండితే పూర్తి ఆయకట్టు సాగు

పరిగి నియోజకవర్గంలోని లక్నాపూరు ప్రాజెక్టు నిండితే చివరి ఆయకట్టుకు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు కింద 2,647 ఎకరాల భూములున్నాయి. కుడి కాల్వ కింద 1,147, ఎడమ కాల్వ కింద 1,500 ఆయకట్టు ఉంది. ఈ కాల్వల కింద ఐనాపూరు, మిట్టకోడూరు, రాజాపూర్‌, లక్నాపూరు, మోమిన్‌ కలాన్‌, అంతారం గ్రామాల పరిధి పొలాలకు సాగు నీరు అందుతోంది. వరద కాల్వలను బాగు చేస్తే ప్రాజెక్టు నిండి పూర్తి స్థాయిలో భూములు సాగయ్యే అవకాశాలున్నాయి.

వృథాకు అడ్డుకట్ట

సుందర్‌, ఈఈ సాగు నీటి పారుదల శాఖ, వికారాబాద్‌

నీటి వనరుల అభివృద్ధికి ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయటంతో కాల్వలు, తూములు మరమ్మతులు చేస్తున్నాం. దీని ద్వారా సాగు నీరు పూర్తి స్థాయిలో పొలాలకు చేరనుంది. ప్రాజెక్టులు, చెరువుల వద్ద కాలువలనురైతులు బాగు చేసుకుంటే వారికి ఆదాయం సమకూరుతుంది. చిన్న చెరువులు సైతం నిండటానికి వీలు ఉంటుంది. ఈ విషయమై అవగాహన కల్పిస్తాం. స్వచ్ఛందంగా వారే ముందుకు వస్తే మరింత మేలు జరుగుతుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.