close

సోమవారం, ఆగస్టు 03, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా గుప్పిట్లో నగరం!

గ్రేటర్‌లో 1,422 కేసుల నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా గుప్పిట్లో నగరం విలవిల్లాడుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్‌ స్వైరవిహారం చేస్తోంది. మంగళవారం గ్రేటర్‌ వ్యాప్తంగా 1,422 కేసులు నమోదయ్యాయి. శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో 176 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ పరిధిలో 94 మంది కొవిడ్‌ బారినపడ్డారు. బస్తీలు, కాలనీల్లో సమూహాలు ఎక్కువగా ఉండటంతో కేసుల పెరుగుదల అధికంగా ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఊహించని స్థాయిలో కేసుల సంఖయ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈనెలలోనే ఇప్పటివరకు కేసుల సంఖ్య 7 వేలు దాటాయి. గాంధీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఏడుగురు మృతిచెందడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
మలక్‌పేటలో ఆగని కేసులు..
ప్రారంభంలో మలక్‌పేటలో బాధితుల సంఖ్య అత్యధికంగా నమోదైంది. సుమారు 15 రోజులు వైరస్‌ విలయ తాండవం చేసింది. అనంతరం కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ వేగం పుంజుకుంది. మంగళవారం సర్కిల్‌ పరిధిలో 38 మందికి కరోనా సోకడమే అందుకు నిదర్శనం. ఇలాంటి సమయంలోనూ అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో కొంతకాలంగా భూ రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారులు, మధ్యవర్తులు, కొనుగోలుదారులతో కార్యాలయం పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. ఫలితంగా పలువురు వైరస్‌ బారినపడ్డారు. ఇటీవల ఓ స్థిరాస్తి వ్యాపారి కొవిడ్‌ బారినపడి మరణించగా ఇప్పుడు ఆయనతో కలివిడిగా మెలిగినవారు బాధితులయ్యారు. హయత్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, కాప్రా, కుత్బుల్లాపూర్‌ సర్కిల్, యూసుఫ్‌గూడ, అంబర్‌పేట, మూషీరాబాద్, ఖైరతాబాద్, కార్వాన్, మెహిదీపట్నం, చార్మినార్, సంతోష్‌నగర్, సర్కిళ్లలోనూ కేసులు భారీగా వెలుగులోకి వచ్చాయి. కరోనాతో జల్‌పల్లి పురపాలిక శ్రీరామకాలనీ వాసి (49) మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద యువతే ఎక్కువ..
యువ రక్తం కదా.. మనకు ఏమీ కాదులే అనుకోవడం అంటే.. కొవిడ్‌తో ముప్పు తెచ్చుకున్నట్లే. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు పరీక్ష కేంద్రాల్లో యువతే అధిక సంఖ్యలో పరీక్షల కోసం వరుస కడుతున్నారు. వయసు ఎక్కువ ఉన్నవాళ్లు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారికే కరోనా ముప్పు తెస్తుందనేది కూడా అపోహ మాత్రమే. మృతుల్లో 35-45 ఏళ్ల మధ్య 35 శాతం మంది వరకు ఉంటున్నారు. అప్పటి వరకు అందరితోనే నవ్వుతూ చక్కగా మాట్లాడేవారు సైతం తర్వాత కొన్నిగంటల్లో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కరోనా పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. అయితే తప్పనిసరిగా వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలి. సొంత వైద్యం పనికి కాదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిఒక్కరు మాస్క్‌లు ధరించాలి. ప్రతి 20 నిమిషాలకు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. జనసమూహాలకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా 80 శాతం వైరస్‌కు దూరంగా ఉండొచ్చు.


నెలాఖరున ఉద్యోగ విరమణ..
ఇంతలోనే కరోనాతో మృతి

అబిడ్స్, న్యూస్‌టుడే: జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న టాక్సు ఇన్‌స్పెక్టరు(58) కరోనాతో మృతిచెందారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. అనారోగ్యంగా ఉండటంతో ఉస్మానియా వైద్యులు పరీక్షలు నిర్వహించగా శనివారం రాత్రి పాజిటివ్‌ అని తేలింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపించారు. సోమవారం రాత్రి ఆయన మృతిచెందారు. మంగళవారం ఉదయం ఎర్రగడ్డలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ అధికారి (58)కి పని ఒత్తిడి వల్లనే ఆరోగ్య సమస్యలు వచ్చాయని తోటి ఉద్యోగులు తెలిపారు. 


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.