close

సోమవారం, ఆగస్టు 03, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎటు పోవాలి..? ఏం చేయాలి..?

‘పాజిటివ్‌’ వచ్చినా చికిత్స గగనమే!
ఫోన్‌లో ప్రాథమిక వైద్య సేవలు అందడం లేదు
సంక్షిప్త సందేశం వస్తేనే.. ప్రభుత్వ వైద్యం
మహానగరంలో కరోనా రోగుల ఆందోళన
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. వైద్యం కోసం ఎవరిని సంప్రదించాలి.. తక్షణ వైద్యం ఎలా పొందాలి.. ఇప్పుడు హైదరాబాద్‌లో వందలాది మంది కరోనా రోగులను వేధిస్తున్న ప్రశ్న ఇది. పాజిటివ్‌ అని తేలినా కూడా నిర్ధారిత ధ్రువపత్రం సంబంధిత రోగుల సెల్‌ఫోన్‌కు రెండు మూడు రోజుల తరువాత గానీ చేరడం లేదు. ఈ పత్రం లేకపోతే తాము ఆస్పత్రిలో చేర్చుకోలేమని ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పోనీ ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తే అక్కడ పడకలు ఖాళీ లేవని సమాధానం వస్తోంది. దీంతో వ్యాధి నిర్ధారణ అయిన రోగులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. తమకు ఏమవుతుందోనంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.  
ఆలస్యంగా సంక్షిప్త సందేశం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మహానగరం పరిధిలో కరోనా నిర్ధారిత పరీక్షలు బాగా పెరిగాయి. రోజుకు 4వేల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. నగరంలో కరోనా పరీక్షా ఫలితాలు ఒక రోజు వ్యవధిలోనే ప్రకటించేలా మంత్రి ఈటల రాజేందర్‌ అనేక చర్యలు తీసుకున్నా కూడా పలు లోటుపాట్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు జరిగిన మూడు, నాలుగు రోజులకు గానీ ఫలితాలు వెల్లడి కావడం లేదు. తీరా ఫలితం పాజిటివ్‌గా వచ్చిన తరువాత వెంటనే వారికి ప్రభుత్వ వైద్యం అందుతుందా అంటే అదీ లేదు. నిబంధనల ప్రకారం పరీక్షా ఫలితం సంబంధిత వ్యక్తి సెల్‌ఫోన్‌ నంబర్‌కు పంపించాలి. ఇదే ఫలితం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, 104 కాల్‌సెంటర్‌ విభాగానికి చేరాల్సి ఉంది. వైద్య విభాగానికి సమాచారం చేరుతున్నా.. రిపోర్ట్స్‌ వచ్చిన రెండు రోజుల వరకు రోగుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడం లేదు. ఈ మెసేజ్‌ చూపిస్తేనే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. చాలామంది తమకు పాజిటివ్‌ అని నిర్ధారణ అయిన వెంటనే ప్రభుత్వ వైద్యుల నుంచి ప్రాథమిక వైద్య ప్రక్రియ మొదలవుతుందని ఒక రోజు ఎదురు చూస్తున్నారు. అప్పటికీ ఫోన్‌ రాకపోతే వెంటనే ఛాతీ ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.  మీకు ఫోన్‌ మెసేజ్‌ రాలేదు కదా.. వచ్చిన తరువాత ఆస్పత్రికి రండి అంటూ వారిని తిప్పి పంపుతున్నారు. దీంతో కరోనా రోగులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.  
* పడకల్లేవ్‌!... వందలామంది కరోనా రోగులు తక్షణ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. తమ దగ్గర పడకలు లేవని...తాము ఇప్పటికిప్పుడు పడకను ఏర్పాటు చేసి వైద్యం అందించలేమని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో సంబంధిత రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది రోగులు మహానగరంలో ఇంట్లోనే ఉండి మందులు వాడుతున్నారు.
అందరికీ వైద్య సేవలు అందిస్తున్నాం
మహానగరంలో తమ అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పరిధిలో కరోనా రోగులకు వైద్య సహాయం అందిస్తున్నామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారులు ‘ఈనాడు’కు తెలిపారు. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదన్నారు. తమ వైద్యులు రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడుతున్నారని చెప్పారు.


ఎంత దారుణం!

ఎల్బీనగర్‌కు చెందిన మహిళ ఈనెల ఒకటో తేదీన పరీక్ష చేయించుకున్నారు. ఫలితాలు మూడు రోజుల తరువాత వచ్చాయి. మహిళ సెల్‌ఫోన్‌కు ఈ ఫలితాలను ఎస్‌ఎంఎస్‌ చేయలేదు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఆమె స్థానికంగా ప్రభుత్వ వైద్యులను సంప్రదిస్తే తమను పూర్తిగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
* వనస్థలిపురానికి చెందిన గర్భిణికి పరీక్షలు చేయించుకున్న మూడు రోజుల తరువాత పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. తనకు ప్రభుత్వ వైద్యుల నుంచి ఫోన్‌ద్వారా వైద్యం అందుతుందని ఆమె ఎదురు చూసింది. ఎవరూ స్పందించకపోవడంతో ప్రైవేటు వైద్యులను సంప్రదించి ఇంట్లోనే చికిత్స తీసుకుంటోంది.


వైద్య సిబ్బంది కొరత..

మొన్నటి వరకు రోజుకు 500లోపు కరోనా కేసులు వచ్చేవి. అదే ఇప్పుడు రోజుకు 1200లకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైద్య సిబ్బంది తక్కువ. ఇందులో చాలామంది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఉన్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు.  దీంతో వందలాది మంది కరోనా రోగులు ఒకటి రెండు రోజులు సొంత వైద్యమో, లేక తమ కుటుంబ వైద్యులకో ఫోన్‌ చేసి ప్రాథమికంగా చికిత్స పొందుతున్నారు. ఊపిరి తీసుకోవడం కష్టమైనా ఇతరత్రా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారికి కూడా వెంటనే వైద్యం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.