close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముందు ఒకటి.. తర్వాత మూడు

రోహింగ్యాలకు భారత పౌరులుగా గుర్తింపు

పాతబస్తీలో నకిలీ గుర్తింపు కార్డుల తయారీల ముఠా


పోలీసులకు పట్టుబడ్డ మహ్మద్‌ ఫరూక్‌, ఆధార్‌ కార్డు తయారు చేసిచ్చిన నిందితుడు ఖదీరుద్దీన్‌

ఈనాడు, హైదరాబాద్‌: మయన్మార్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న శరణార్థుల్లో కొందరు భారత పౌరులుగా ఉండేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి జారీ చేసిన శరణార్థి గుర్తింపుకార్డు (యూఎన్‌హెచ్చార్సీ) ఉన్నా.. ఇక్కడే ఉండేందుకు ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పొందుతున్నారు. ఇందుకోసం దళారులను ఆశ్రయించి రూ.వేలు ఖర్చు పెడుతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో ఉంటున్న రోహింగ్యాల్లో కొందరు కొద్దినెలల నుంచి ఓటరు గుర్తింపు కార్డులను సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు తొమ్మిది, పదేళ్ల క్రితమే వాటిని సంపాదించి గోప్యంగా ఇక్కడే ఉంటున్నారు. రోహింగ్యాలు అక్రమంగా గుర్తింపు కార్డులు పొందుతున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పరిశోధించగా తొమ్మిదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్న శరణార్థి మహ్మద్‌ ఫరూక్‌ వద్ద ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డులు లభించాయి. అతడితోపాటు వాటిని సమకూర్చిన ఖదీరుద్దీన్‌ అరెస్ట్‌ చేసిన అనంతరం ఇంకా ఎంతమందికి భారత పౌరులుగా గుర్తింపు కార్డులున్నాయన్న కోణంలో పరిశోధిస్తున్నారు.

పాతబస్తీలో ముఠాలు..

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో శరణార్థులుగా నివాసముంటున్న వారిలో కొందరికి ఓటరు గుర్తింపు కార్డులు ఎలా వస్తున్నాయని హైదరాబాద్‌, రాచకొండ పోలీసులు పరిశోధించారు. ఓటరు గుర్తింపు కార్డులు పొందినవారిని, వారికి గుర్తింపు కార్డులను సమర్పించిన నిందితులను విచారించారు. పాతబస్తీ, శివారు ప్రాంతాల్లోని శరణార్థులు వీటిని పొందేందుకు దళారులకు డబ్బులిస్తున్నామని చెప్పారు. కొందరు దళారులు, ఏజెంట్లు ముఠాలుగా ఏర్పడి డబ్బు కోసం రోహింగ్యాలకు ఓటరు గుర్తింపు కార్డులను సమకూర్చుతున్నారు. ఇందుకోసం అవసరమైన విద్యార్హతలు, ఇతర ధ్రువపత్రాలు రోహింగ్యాల వద్ద లేకపోవడంతో అద్దెఇంటి నంబర్ల విద్యుత్‌ ఛార్జీల బిల్లులను సమర్పిస్తున్నారు.క్షేత్రస్థాయి సిబ్బంది కొందరు శరణార్థుల చెప్పిన వివరాలను నమ్మి వారికి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. అనంతరం ఆధార్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులు, పాన్‌కార్డులు తీసుకుని తెలంగాణ సర్కార్‌ సంక్షేమ పథకాలను పొందుతున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొద్దినెలల క్రితం ముగ్గురు రోహింగ్యాలను అరెస్ట్‌ చేశారు. ఇందులో ఒక నిందితుడి భార్య ప్రసవించగా కేసీఆర్‌ కిట్‌ కూడా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇచ్చారు.

మయన్మార్‌.. ఢాకా..

మయన్మార్‌లో పరిస్థితులు బాగోలేకపోవడంతో అక్కడున్న వారి కొందరు నేపాల్‌ సరిహద్దుల గుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు శరణార్థులుగా పదిహేనేళ్ల నుంచి వస్తున్నారు. వీరికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు కార్డులు ఇస్తుండగా స్థానిక స్వచ్ఛంద సంస్థలు రోహింగ్యాలకు చేతనైనంత సాయం చేస్తున్నాయి. పోలీసులు, స్థానిక సంస్థలు శరణార్థుల శిబిరాల ఏర్పాటులో సాయపడుతున్నారు. ఇలా కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న శరణార్థులందరికీ ఐక్యరాజ్య సమితి గుర్తింపు కార్డులున్నాయి. ఐదారేళ్ల నుంచి మయన్మార్‌లో పరిస్థితులు దిగజారిపోవడంతో వీరు అక్కడి నుంచి సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు చేరుకుంటున్నారు. శరణార్థుల గుర్తింపు కార్డులు పొందాక ఇండో-బంగ్లా సరిహద్దును దాటి హౌరాకు వస్తున్నారు.బస్సుల్లో వేర్వేరు రాష్ట్రాలకు వెళ్తున్నారు. శరణార్థుల్లో ఎక్కువమంది హైదరాబాద్‌లోనే ఉండడంతో ఇక్కడికే వస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.