close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రేటర్‌ పోరు ముంగిట.. నగర నేతలకు పెద్దపీట

భాజపా రాష్ట్ర కమిటీలో పలు కీలక పదవులు

నగరాన్ని జిల్లాలుగా విభజించి బాధ్యతల అప్పగింతకూ కసరత్తు


పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బంగారు శృతిని సత్కరిస్తున్న నేతలు

ఈనాడు - హైదరాబాద్‌; బర్కత్‌పుర, న్యూస్‌టుడే: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీలో నగర నేతలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించిన రాష్ట్ర కమిటీలో నగరంతో పాటు.. శివార్లకు చెందిన పలువురు నాయకులకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె శృతిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆమె గతంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా పని చేశారు. అలాగే 8 మంది ఉపాధ్యక్షుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఉన్నారు. డాక్టర్‌ ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, బొమ్మా జయశ్రీ, కె.మాధవి, జి.ఉమారాణి రాష్ట్ర కార్యదర్శులుగా, రాష్ట్ర సంయుక్త కోశాధికారిగా భవర్‌లాల్‌వర్మ, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా డాక్టర్‌ ఉమాశంకర్‌ నియమితులయ్యారు.

మోర్చా అధ్యక్ష పదవుల్లోనూ..

భాజపా అనుబంధ సంస్థల్లోనూ గ్రేటర్‌ నేతలకు ప్రాధాన్యం లభించింది. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా మేడ్చల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన ఎ.భానుప్రకాశ్‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా నగరానికి చెందిన కె.గీతామూర్తి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పాతబస్తీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర తనయుడు భాస్కర్‌ నియమితులయ్యారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కొప్పు బాషాకు అవకాశం దక్కింది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా కృష్ణసాగర్‌రావు నియమితులయ్యారు.

గ్రేటర్‌ ఎన్నికలకు సమాయత్తం..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. నగర భాజపా శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. తెరాసకు భాజపాయే ప్రత్యామ్నాయం అంటూ పోటీకి సై అంటున్న నాయకత్వం రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యతనిచ్చి నగరంపై దృష్టి పెట్టింది. గత గ్రేటర్‌ ఎన్నికల్లో 4 డివిజన్లను కైవసం చేసుకున్న విషయం విదితమే. తెరాస, మజ్లిస్‌ తర్వాత నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా భాజపా నిలబడింది.

4 జిల్లాలుగా నామకరణం

నగరాన్ని నాలుగు జిల్లాలుగా భాజపా విభజించింది. త్వరలో ఈ జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాన్ని చేపట్టేందుకు రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. అంబర్‌పేట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి నియోజకవర్గాలతో ఏర్పాటు చేసిన జిల్లాకు అంబర్‌పేటగా; సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, ముషీరాబాద్‌, కంటోన్మెంట్‌ నియోజకవర్గాలతో ఏర్పాటు చేసిన జిల్లాకు మహంకాళి జిల్లాగా; కార్వాన్‌, గోషామహల్‌, చార్మినార్‌ నియోజకవర్గాలతో ఏర్పాటు చేసిన జిల్లాకు గోల్కొండగా; మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, యాఖుత్‌పుర, బహదూర్‌పుర నియోజకవర్గాలతో ఏర్పాటు చేసిన జిల్లాకు భాగ్యనగర్‌ జిల్లా నామకరణం చేసింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.