close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాగ్రత్తలు తీసుకుందాం.. కరోనాను తరిమేద్దాం

జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి

న్యూస్‌టుడే, వికారాబాద్‌: జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతుండటంతో పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి 514 కేసులు నమోదయ్యాయి. జులై 18న వికారాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 68 పాజిటివ్‌ కేసులు రాగా, నిత్యం సగటున 20 వరకు వస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నవారి నుంచి నమూనాలను సేకరించి వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని చెబుతున్నా, ఫలితాలు వచ్చేందుకు నాలుగైదు రోజుల సమయం పడుతుండటంతో పాజిటివ్‌ వస్తుందో, నెగటివ్‌ వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వైద్యులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఏదైనా ఆరోగ్య సమస్య ఉత్పన్నమయితే ఆస్పత్రులకు వెళ్లేందుకు జంకుతున్నారు. అయితే అవగాహన ధైర్యానికి మించిన ఆయుధం లేదని, కరోనాకు బయపడకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. వదంతులను నమ్మి ఆందోళనకు గురికావొద్ధు

ఇలా కట్టడి చేద్దాం..

ప్రస్తుతం ఎవరి నోట విన్నా కరోనా మాటే. నియంత్రణకు అలా చేయాలి.. ఇలా చేయాలని మాట్లాడుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపించుకుంటున్నారు మినహా అమలుకు వచ్చే సరికి ఆచరణ ఆ స్థాయిలో కనిపించడం లేదు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలను సైతం దూరం చేసే అవకాశం ఉంది. నిత్యం వినియోగించే వస్తువులను తాకే సమయంలో, బయటికి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

సెలూన్లు, బ్యూటీపార్లర్లలో..: సెలూన్లు, బ్యూటీపార్లకు వెళ్లిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. కచ్చితంగా అందులో పని చేసే వారిని మాస్కులు ధరించమని చెప్పాలి. సామగ్రిని శానిటైజర్‌తో శుభ్రం చేసేలా చూడాలి. వారు ముఖాన్ని తాకే సమయంలో టిష్యూ పేపర్‌ను వాడమని చూచించాలి. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తరువాత ముందు చేతులు, తరువాత ముఖం సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

చిన్నారులు ఆడుకునే సమయంలో..: ప్రధాన కాలనీల్లో పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక స్థలాలు, పరికరాలు ఉన్నాయి. అక్కడ రకరకాల వస్తువులతో చిన్నారులు ఆడుకుంటారు. అక్కడ ఏదైనా వైరస్‌ ఉంటే చిన్నారుల చేతికి అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రోజుల పాటు పిల్లలను ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి.

కంప్యూటర్‌ వినియోగం..: ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంప్యూటర్‌, కీ బోర్డులు రోజు శానిటైజర్‌తో శుభ్రం చేయాలి. వినియోగించిన తరువాత చేతులతో ముఖం తాకొద్ధు చేతులు శుభ్రం చేసుకున్న తరువాతే ముఖాన్ని తాకాలి. భోజనం చేసే ముందు చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి.

బస్సులు, ఆటోల్లో..: ముఖ్యమైన అవసరాలకు, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం చాలా మంది రోజు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సామర్థ్యం వరకే వెళ్తుండటం, క్రమం తప్పకుండా శానిటైజర్‌ చేస్తున్నారు. ఆటోల్లో మాత్రం శుభ్రతే పాటించడం లేదు. ఇప్పటికీ పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. ఒకరిని ఒకరు తాకేలా ప్రయాణం చేయకపోవడం మంచిది. ద్విచక్ర వాహనంపై ఒక్కరు ప్రయాణించడమే శ్రేయస్కరం.

విపణిలో..: వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయల విపణులతో పాటు ఇతర దుకాణాల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఈ ప్రాంతాలకు వెళ్లడం తప్పనిసరి కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు నోరు, ముక్కును కప్పేలా మాస్కులు తప్పనిసరిగా ధరించి జనం ఒకరినొకరు తాకకుండా భౌతిక దూరం పాటించాలి. కూరగాయలు, పండ్లు ఇంటికి తెచ్చిన తరువాత నీటిలో కాస్త ఉప్పు వేసి శుభ్రం చేయాలి.

మరో 18 మందికి పాజిటివ్‌

తాండూరు పట్టణం,దౌల్తాబాద్‌, కొడంగల్‌: జిల్లాలో ఆదివారం మరో 18 మందికి కరోనా సోకిందని జిల్లా వైద్యాధికారి సుధాకర్‌ షిండే తెలిపారు. తాండూరులో అధికంగా 10, వికారాబాద్‌లో 2, పరిగి, కొడంగల్‌లో ఒక్కొక్కటి, దౌల్తాబాద్‌లో 4 కేసులు నమోదైనట్లు చెప్పారు. వీటితో కలిపి జిల్లా వ్యాప్తంగా 514కు పెరిగాయి. 59 మంది నెగటివ్‌ నివేదికలు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కొత్తగా 27 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు చెప్పారు.

* దౌల్తాబాద్‌ మండలంలోని చంద్రకల్‌కు చెందిన నలుగురికి కరోనా సోకిందని వైద్యాధికారి రతన్‌లాల్‌ తెలిపారు. వారం కిందట గ్రామంలో జరిగిన వివాహానికి వచ్చిన బంధువుల వల్ల వ్యాపించిందన్నారు.

* కొడంగల్‌ మండలంలోని అంగడిరైచూర్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్‌బాబు తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి భర్తకు వచ్చిందని ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.