close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మమతానురాగానికి ‘రక్ష’.. అనుబంధాల ప్రతీక

నేడు రక్షా బంధన్‌

కొవిడ్‌ నేపథ్యంలో నిరాడంబరంగానే..

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

మమతల మాగాణిలో పూసిన పువ్వులం.. స్నేహానురాగాలు నింపుకొన్న నవ్వులం.. అనురాగానికి ప్రతీకలం.. అనుబంధానికి ప్రతిరూపాలైన అన్నాచెల్లెలం.. అంటూ పాడుకునే రక్షా బంధన్‌ (రాఖీ పౌర్ణమి) రానే వచ్చేసింది. దూరాలను దగ్గర చేస్తూ అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల ఆప్యాయతకు నిలువెత్తు నిదర్శనం ఈ వేడుక. తోబుట్టువుల మమతానురాగానికి ‘రక్ష’ణగా నిలుస్తుంది. ఆపదలో ఒకరికొకరు భరోసాగా ఉందామనే భావనను చాటే ఈ పండగ బాంధవ్యాన్ని కలకాలం నిలుపుకొందామనే సంకేతాన్ని ఇస్తుంది.

- న్యూస్‌టుడే, చేగుంట

శ్రావణ పౌర్ణమిగా పిలుచుకునే రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు సందడి నెలకొంటుంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఇళ్లు కోలాహలంగా మారుతాయి. ఓ సినీ కవి వర్ణించినట్లుగా ‘అన్నా చెల్లెళ్ల అనుబంధాల బంధనానికి వేదిక ఇది. ఈ రోజున అక్కాచెల్లెళ్లు.. అన్న, తమ్ముళ్లకు బంధనం కట్టి రక్షణ కల్పించమని కోరడం సహజం. వారి మధ్య ఉండే ప్రేమ ఎల్లకాలం ఉండాలని ఈ పండగ పరమార్థం. ఈ సారి కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య వేడుకను జరుపుకోవాల్సిన పరిస్థితి. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడం, ప్రయాణాలకు వెనుకడుగు వేయాల్సిన ప్రస్తుత తరుణంలో నిరాడంబరంగా పండగ చేసుకోవాల్సిందే. కాస్త జాగ్త్రతలు పాటిస్తే పండగ సంతోషదాయకం అవడం ఖాయం. ఈ సారి ప్రకృతి మమేకం కావాలని ప్రతీన బూనుదాం. మన కోసం అందరు, అందరి కోసం మనం అన్నట్లుగా ముందుకు సాగాలి. ఆరోగ్య సంరక్షణపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే ఈ పండగను విశిష్టతల సమాహారంగా మార్చేందుకు అడుగేద్దాం.

* ఇది కరోనా కాలం. జాగ్రత్తగా ఉంటేనే మనుగడ సాధ్యం. లేదంటే అసలుకే మోసం. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ.. స్వీయ విచక్షణతో ఆలోచించి జాగ్రత్తలు పాటించాలి. భౌతిక దూరం పాటింపు, మాస్కుధారణ, చేతుల శుభ్రత.. తదితర అలవాట్లను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలి. అవసరం మేరకు బయటకు వెళ్తామని అంతా సంకల్పించుకోవాలి.

* పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుం బిగించాలి. వాయు, జల కాలుష్యం పెరుగుతోంది. ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతోంది. రక్షా బంధన్‌ సందర్భంగా ప్రతి ఒక్కరు కనీసం రెండు మొక్కలు నాటి.. కనుపాపల్లా కాపాడాలి. ప్లాస్టిక్‌ కవర్లు, వస్తువుల నిషేధానికి ముందడుగు వేయాలి.

* రాఖీ కట్టిన అనంతరం సోదరుడు కానుకలు ఇవ్వడం పరిపాటే. ఇదే క్రమంలో వాహనం నడిపించే సోదరుడు ఉంటే శిరస్త్రాణం వినియోగంపై సోదరి వివరించాలి. శిరస్త్రాణం అందించాలి. కరోనా నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా క్షేమాన్ని కాంక్షించడంలో ముందు వరుసలో నిలుస్తారు.

* ప్రస్తుతం ప్రతి ఇంటా చరవాణుల మోత మోగుతోంది. సామాజిక మాధ్యమాల అతి వినియోగం తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ప్రతిఒక్కరూ అవసరం మేరకు చరవాణి వినియోగానికి సంకల్పించుకోవాలి. సామాజిక మాధ్యమాలకు సాధ్యమైనంత మేర దూరంగా ఉండటం ఉత్తమం.

సమాజ రక్షకుడిగాను..

- జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

పేద, ధనిక అన్న తేడా లేకుండా జరుపుకొనే ఈ పండగ రోజు ఇళ్లంతా సందడిగా ఉంటుంది. నాకు ఒక చెల్లి ఉంది. ఆమెకు రక్షణగా నిలవడం ఎంత అవసరమో, సమాజానికి రక్షకుడిగా ఉండటానికి అంతే ప్రాధాన్యం ఇస్తాను. నియోజకవర్గంలోని అక్కాచెల్లెకు పండగ శుభాకాంక్షలు.


తీరిక లేకపోయినా..

- పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే

సోదరుడికి మిఠాయి తినిపిస్తున్న ఎమ్మెల్యే పద్మ (పాతచిత్రం)

నా చిన్నతనం అంతా గడిచింది ఉమ్మడి కుటుంబంలోనే కావడంతో రాఖీ పండగ రోజు మా ఇంట్లో సందడి అంతాఇంతా కాదు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చాక తీరిక దొరకడమే కష్టమైంది.. రాఖీ పండగ రోజు తమ్ముడే నా దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకుంటాడు. ఈ సారి కరోనా నేపథ్యంలో వాళ్లు ఒక నిమిషం వచ్చి వెళ్తామని చెప్పడంతో ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నా. మా తమ్ముడు వంశీధర్‌రెడ్డి చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలు బాధపడ్డారు. అతడు ఆరోగ్యంగా బాగుండాలని వేడుకుంటూ రాఖీ కట్టేవాళ్లం. ఇప్పటికైతే దేవుడి దయతో ఆరోగ్యంగా ఉన్నాడు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పండగ జరుపుకొంటాం. అందరం నిబంధనలు పాటించి వేడుక చేసుకుందాం.


వృక్షాలతో చెలిమి..

చందాయిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో చెట్లకు రాఖీ కడుతూ.. (పాత చిత్రం)

పర్యావరణం బాగుంటేనే.. జీవకోటి మనుగడ సాధ్యం. అందుకే పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ క్రమంలో జిల్లా విద్యా శాఖ వృక్షాబంధన్‌కు పిలుపునిచ్చింది. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు విధిగా తమ ఇళ్ల వద్దే మొక్కలు నాటి రక్షించాలని సూచించింది. ఇదో సదవకాశంగా నిర్వాహకులు విద్యార్థులను భాగస్వాములయ్యేలా ప్రోత్సహించాలి. పర్యావరణ హిత రాఖీల వినియోగం ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది. ఎన్‌జీసీ (నేషనల్‌ గ్రీన్‌ కోర్‌) ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా పలు పాఠశాలల వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటం విశేషం. పర్యావరణ హిత రాఖీలను తయారు చేయిస్తున్నారు. ఈ సారి ఇంటి వద్దే ఉంటూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలి. సమీపంలోని మొక్క/చెట్టుతో ఆత్మీయతను పెంచుకోవాలి. దత్తత తీసుకొని రక్షించాలి.


ప్రత్యేకమైనది..

- మంజుశ్రీ, సంగారెడ్డి జడ్పీ అధ్యక్షురాలు

 

భారతీయులకు ప్రత్యేకమైనది రాఖీ పండగ. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెస్తుంది. నాకు ఒక్కగానొక్క తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. అతడే ప్రతి ఏటా నా వద్దకు వచ్చి రాఖీ కట్టించుకుంటారు. ఇద్దరు చెల్లెలు సైతం ఇక్కడికే వస్తారు. వారందరి రాకతో మా ఇల్లు సందడిగా మారుతుంది. ఈ ఏడాది నిబంధనలు పాటిస్తూ రాఖీ కడతాం.


 

కొత్త అనుభూతిని ఇస్తుంది..

- హేమలతగౌడ్‌, మెదక్‌ జడ్పీ అధ్యక్షురాలు

పండగ రోజు నా ఇద్దరి సోదరులకు రాఖీ కట్టడం నాకెంతో ప్రధానమైనది. తూప్రాన్‌లో నివాసం ఉండే వారికి ప్రతి ఏటా రాఖీ కడతాను. ఈ పండగ ఎన్నో కుటుంబాల్లో కొత్త అనుభూతి కలిగిస్తుంది. అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎంత దూరంగా ఉన్నా రాఖీలు పంపిస్తూ తమ ప్రేమానురాగాలను పంచుకుంటారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ ఈ సారి రాఖీ పండగను జరపుకోవాలి.


ఆత్మీయతను పెంచుతుంది..

కొప్పుల మహేష్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే

మహేష్‌రెడ్డికి రాఖీ కడుతున్న అర్చన

అక్కా తమ్ముళ్ల అనుబంధం, అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగంలోని మాధుర్యం అందరికీ గుర్తుండాలని కోరుకుంటూ తోబుట్టువులు కట్టే ఆత్మీయ బంధనమే రక్షాబంధనం. అన్నలుగా అభిమానించేవారికి, తమ్ములుగా అనురాగం పంచే వారికి అక్కలు, చెల్లెళ్లు ఆనందంగా రాఖీ కడతారు. నాకు అర్చన ఒక్కరే చెల్లెలు. ప్రతి రాఖీ పండగకు హైదరాబాద్‌ నుంచి వచ్చి రాఖీ కట్టడం మధురానుభూతిని కలిగిస్తుంది. రాఖీ కట్టడానికి ఆలస్యంగా వస్తే అప్పటి వరకు ఏదో వెలితిగా అనిపిస్తుంది.


‘సంకల్పం’తో జయిద్దాం

డిప్యూటీ డీఈవోకు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెబుతున్న బ్రహ్మకుమారీస్‌ సంస్థ ప్రతినిధులు (పాతచిత్రం)

బ్రహ్మకుమారీస్‌ సంస్థ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ఏటా రక్షాబంధన్‌ నిర్వహించి ఆప్యాయతను చాటుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పలు సంస్థల ప్రతినిధులకు రాఖీ కట్టి నోటిని తీపి చేయడం సంప్రదాయంగా వస్తోంది. సంస్థ కార్యాలయంలోనూ వేడుక చేపడుతుంటారు. కరోనా నేపథ్యంలో ‘సంకల్ప రాఖీ’ పేరిట పిలుపునిచ్చారు. రాఖీ అంటే.. పవిత్రత, రక్షణకు ప్రతీక. స్వచ్ఛమైన మనసు.. సత్‌ సంకల్పంతో కట్టే రక్ష తప్పక విజయాల వైపు నడిపిస్తుంది. గమ్యస్థానాలకు చేరుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కాచెల్లెళ్లు.. అన్నదమ్ముళ్లు ఒక చోటకు రాలేకపోవడం సమస్యగా మారింది. దీంతో దూరంగా ఉన్న సోదరున్ని కళ్ల ముందు ఉన్నట్లుగా అనుభూతి పొంది.. చేతికి రాఖీ కట్టేసినట్లుగా సంకల్పించుకోవాలని సంస్థ నిర్వాహకులు సూచిస్తున్నారు. సోదరులు అదే భావనను సొంతం చేసుకోవాలి. తద్వారా చక్కటి అనుభూమతి సొంతమవుతుందనేది ఉద్దేశం.


మా చెల్లెలికి అండగా..

- డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

మహేందర్‌రెడ్డికి రాఖీ కడుతున్న చెల్లెలు నర్మదారెడ్డి (పాత చిత్రం)

రాఖీ పౌర్ణిమ సోదర భావానికి ప్రతీక. ఒకే తల్లి కడుపున పుట్టిన వారే కాకుండా సోదర భావంతో పలువురు రాఖీలు కడుతుంటారు. నేను మీకు రక్ష.. మీరు నాకు రక్ష అన్న భావనను కలిగిస్తుంది. తాండూర్‌లో నివాసం ఉండే మా చెల్లెలు నర్మదారెడ్డి (దేవక్క) ప్రతి సారి తప్పనిసరిగా మా ఇంటికి వచ్చి నాకు, నా తమ్ముడు కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికి రాఖీ కడుతుంది. మా చెల్లెలికి అన్ని వేళలా అండగా ఉంటాం.


బంధం బలోపేతం

- గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ

రాఖీ పండగ బంధాలను మరింత బలోపేతం చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ సందర్భంగా వరంగల్‌లో ఉండే మా అక్క రాజ్యలక్ష్మి తప్పనిసరిగా మా ఇంటికి వచ్చి రాఖీ కడుతుంది. మా అక్క కట్టిన రాఖీని చూసి ఎంతో మురిసిపోతాను. అందుకే మా అక్క రాక కోసం నిరీక్షిస్తుంటా. ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా మానుకొని అక్కతో రాఖీ కట్టించుకొని కుటుంబ సభ్యులం అందరం కలిసి పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఆ రోజంతా సరదాగా గడుపుతాం. ఆ రోజు కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటాం.

- న్యూస్‌టుడే, మెదక్‌ కలెక్టరేట్‌, సంగారెడ్డి అర్బన్‌, మనోహరాబాద్‌, తూప్రాన్‌, వికారాబాద్‌

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.