close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనంతగిరికి కొత్త అందాలు!

పర్యాటకంగా అభివృద్ధికి ప్రణాళికలు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నాయి. అటవీ ప్రాంతం మొత్తం 3,600 ఎకరాల్లో విస్తరించి ఉండగా, దీనికి ఆనుకుని 80 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఊటీగా పిలిచే ఈ ప్రాంతంలో ఎన్నో రకాల వనమూలికలు, ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నాయి. ట్రెక్కింగ్‌కు అనువైన కొండలు, లోయ ప్రాంతాలు, మూసీ నది జన్మస్థలం, సమీపంలోనే అనంతపద్మనాభ స్మామి దేవాలయం, కూతవేటు దూరంలో బోటింగ్‌కు అనువైన కోట్‌పల్లి జలాశయం ఇక్కడి ప్రత్యేకత. లాక్‌డౌన్‌కు ముందు వరకు నిత్యం వందల మందితో ఈ ప్రాంతం కిటకిటలాడేది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా ఇక్కడ అభివృద్ధి ఇన్నాళ్లూ కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడా దస్త్రాల్లో కదలిక కనిపిస్తోంది. కుదిరితే ప్రభుత్వం, లేకుంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి.

వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు..: వారం రోజుల పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో నిమగ్నమైన వారు వారాంతంలో బెంగళూరు తదితర ప్రాంతాల్లోని వెల్‌నెస్‌ కేంద్రాలకు ఎక్కువగా వెళ్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. వీరిని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్న అనంతగిరిలో వెల్‌నెస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం యోచిస్తోంది. సహజ సిద్ధంగా అటవీ ప్రాంతంలో పెరిగిన ఔషధ మొక్కల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు నయం అవుతాయని నమ్ముతారు. అందుకే ఇక్కడ దశాబ్దాల క్రితమే క్షయ నివారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆధునిక హంగులతో వెల్‌నెస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ధ్యానం, యోగా, జిమ్‌, ఆయుర్వేద చికిత్స ఈ కేంద్రంలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

ఆహారం, వసతి సదుపాయాలు..

అనంతగిరి ప్రాంతానికి నిత్యం వందల మంది వస్తుంటారు. పగలంతా అటవీ ప్రాంతాన్ని ఆస్వాదించడం, కోట్‌పల్లిలో బోటింగ్‌, కొండల్లో ట్రెక్కింగ్‌తో గడిపిన వారు సాయంత్రం సేద తీరేందుకు సరైన వసతి, తినేందుకు ఆహారం అందించేందుకు హరిత రిసార్ట్స్‌ తప్ప ఇతర ఏర్పాట్లు లేవు. దీంతో భారీ సామర్థ్యం కలిగిన హోటల్‌ నిర్మాణానికి తాజా ప్రతిపాదనల్లో చోటు కల్పిస్తున్నారు.

ట్రెక్కింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం

పర్యాటకుల్లో ఎక్కువ మంది ట్రెక్కింగ్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే స్థానికులు అటవీ మార్గంలో ఉదయం, సాయంత్రం వేళ నడక కొనసాగిస్తున్నారు. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఏడు దారుల్లో ట్రెక్కింగ్‌ ట్రాక్‌ల నిర్మాణానికి గతంలో ఒమర్‌ జలీల్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. అటవీ శాఖ అతిథి గృహం నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని బుగ్గరామలింగేశ్వరాలయం, అనంతపద్మనాభస్వామి దేవాలయం, ఇతర మార్గాల్లో ట్రాక్‌లు నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇప్పటికీ వాటికి మోక్షం లభించలేదు. ఆ ప్రతిపాదనలను ప్రస్తుతం మరోమారు పరిశీలించి, కార్యాచరణ రూపొందించనున్నారు.

తీగ మార్గం..

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణంలోని కైలాసగిరి కొండపై తీగ మార్గాన్ని (రోప్‌ వే) అభివృద్ధి చేశారు. అనంతగిరిలోనూ తీగ మార్గాన్ని నిర్మించాలని కొన్నాళ్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అటవీ శాఖ అతిథి గృహం నుంచి అటవీ శాఖ పరిపాలనా కార్యాలయ భవనం వరకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. సుమారు కిలోమీటరు దూరం సర్వే సైతం పూర్తి చేశారు. నిధులు అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు ఆసిక్త చూపుతుండటంతో త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

నేను బాధ్యత తీసుకుంటున్నా

- రంజిత్‌రెడ్డి, ఎంపీ, చేవెళ్ల

ఇటీవల అనంతగిరి ప్రాంతాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించా. అభివృద్ధి ఎలా చేయాలనేది స్పష్టత వచ్చింది. వారం రోజుల్లో ఉన్నతాధికారులతో సమీక్షస్తా. అటవీ శాఖ నిర్మాణాలకు అనుమతించని పక్షంలో అవసరమైన ప్రభుత్వ భూములను లీజు పద్ధతిన తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఈ ప్రాంతం అభివృద్ధికి అడుగులు వేయలేదు. ఇప్పుడు నేను బాధ్యత తీసుకుంటున్నా. రెండు మూడేళ్లలో ఈ ప్రాంతం స్వరూపమే మార్చాలని అనుకుంటున్నా. ఫలితంగా స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.