close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బలవర్ధకం.. రోగనిరోధకం!

వంటింటి చిట్కాలకు ప్రాధాన్యం

పెరిగిన మాంసాహారం వినియోగం

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట

కరోనా వైరస్‌కు మందు లేదు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే మార్గం. ప్రభుత్వం సైతం ఇదే సూచిస్తోంది. బంధువులు, స్నేహితులతో చరవాణి సంభాషణలోనూ ఇదే విషయం చర్చకువస్తోంది. ఎవరికి తెలిసినవి వారు ఇతరులతో పంచుకుంటున్నారు. వెరశి విటమిన్‌ మాత్రలకు డిమాండ్‌ పెరిగింది. ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాల ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రజలు అనుసరిస్తున్న విధానాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

సంప్రదాయం.. ఆధునికం..

కరోనా దరిచేరకుండా ఉండేందుకు వైద్యులు ఎక్కువ సీ విటమిన్‌ను సూచిస్తుండటంతో కొందరు నేరుగా మాత్రల వైపు దృష్టి సారిస్తున్నారు. మరికొందరు వంటింట్లో ఉండే వాటినే కాస్త ఎక్కువగా తీసుకుంటున్నారు. ఉల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, మెంతులు, తేనె, మిరియాలు వంటకాల్లో వాడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో కషాయం తాగడం, ఆవిరి పట్టడం, వేడి నీళ్లు తాగడం వంటివి పాటిస్తున్నారు. బాదం, కిస్‌మిస్‌, ఖర్జూర, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ ఎక్కువగా వినియోగిస్తున్నారు. తులసి, నిమ్మ రుచితో ఉన్న టీ, కాఫీ తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. సుగంధ ద్రవ్యాలు, మూలికల నుంచి తయారైన నూనెలు వాడుతున్నారు. నారింజ, ఆపిల్‌, అరటి, అంగూర వంటి పండ్లను కొనుగోలు చేస్తున్నారు.

విక్రయాలు రెట్టింపు

రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు మాంసాహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ ముందుతో పోలిస్తే ప్రస్తుతం మాంసం విక్రయాలు రెట్టింపయ్యాయని దుకాణదారులు చెబుతున్నారు. గుడ్లు, చికెన్‌, మటన్‌, చేపలు, రొయ్యల విక్రయాలు భారీగా పెరిగాయని, సాధారణంగా శ్రావణ మాసంలో విక్రయాలు తగ్గుతాయని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. నాటుకోళ్ల మాసంలో ఔషధ గుణాలు ఎక్కువనే ప్రచారం ఉండటంతో వాటిని కొనుగోలుపై అధిక దృష్టి సారిస్తున్నారు.

ఆయుర్వేద మందులపై దృష్టి

ఉమ్మడి జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయుర్వేద మందులపై దృష్టి సారిస్తున్నారు. ఈ ఉత్పత్తుల్లో తిప్పతీగ, అశ్వగంధ చూర్ణం, కషాయాలు, చవన్‌ప్రాస్‌, గోమూత్రం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఆయుర్వేద మందుల దుకాణాల్లో వీటికి కొరత ఏర్పడటం గమనార్హం. మొత్తానికి ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది.


నిపుణుల సూచనల మేరకు..

- అరుణ్‌, పెద్దశంకరంపేట

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిపుణుల సూచనలు పాటించడం తప్పనిసరి. వాట్సాప్‌, యూట్యూబ్‌లలో చూసి మందలు వాడొద్ధు వైద్యుల సూచనలు మేరకు మందులు వినియోగించాలి. అన్నింటి కంటే ముఖ్యంగా పోషకాహారం తీసుకోవడం మేలు.


వైద్యుల సలహా తీసుకోవాలి

- పుష్పవతి, వైద్యాధికారి

సామాజిక మాధ్యమాల్లో చూసినవి, ఇతరులు చెప్పినవి అనుసరించి ఏవి పడితే ఆ మాత్రలు వేసుకోకూడదు. వైద్యుల సలహా తీసుకొని మాత్రమే వినియోగించాలి. ఇంట్లోని ఔషధ గుణాలున్న సుగంధ ద్రవ్యాలను సైతం కొంత కొంత మోతాదులోనే వాడాలి. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కరోనా నుంచి మనకు మనం కాపాడుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవడం అవసరం.


ఎన్నో ప్రయోజనాలు

- తేజ దేశ్‌పాండే, ఆయుర్వేద వైద్యురాలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయుర్వేదంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతో ఆయుర్వేద ముందులు ఎంతో ఉపయోగపడతాయి. వీటితో ప్రయోజనమే తప్పా ఇబ్బందులు ఉండవు.


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.