close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యా మెరుగులు.. పాలనకు వారధులు!

డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఏర్పాటుకానున్న కమిటీలు

సమర్థత చాటితేనే సత్ఫలితం

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

పాలక మండళ్లు.. ఒక వ్యవస్థను ఉన్నతీకరణ వైపు నడిపిస్తాయి. ప్రజాస్వామ్యయుత పాలనకు నిలువుటద్దంలా నిలుస్తాయి. ప్రభుత్వానికి.. నిర్దేశిత వ్యక్తులకు వారధిగా మారుతాయి. ఆ రెండు వర్గాలను సమన్వయించుకొని ప్రతిఫలాలు అందేలా చొరవ చూపుతాయి. ఈ క్రమంలోనే ఉన్నత విద్యాసంస్థలు స్వతంత్రంగా వ్యవహరించేందుకు పాలక మండళ్ల (బోర్డు ఆఫ్‌ గవర్నర్లు - బీవోజీ) ఏర్పాటుకు కేంద్రం నూతన విద్యా విధానంలో పొందుపరిచింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో పలు రకాల మండళ్లు పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయంతో ఒనగూరనున్న ప్రయోజనాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

సిద్దిపేటలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో వివిధ రకాల కమిటీలు పని చేస్తున్నాయి. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలల్లో పాలక మండలి (గవర్నింగ్‌ బాడీ) ఉంటుంది. ఇందులో మొత్తం పది మంది ఉంటారు. మొదటి వ్యక్తిగా.. సీసీఈ (కమిషనర్‌ ఆఫ్‌ కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌) ఛైర్మన్‌గా, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన ముగ్గురు (ఆర్జేడీ, రాష్ట్రస్థాయిలో మరో ఇద్దరు ప్రముఖులు), ప్రిన్సిపల్‌ నామినేట్‌ చేసిన ముగ్గురు (ఇద్దరు కళాశాల సీనియర్‌ అధ్యాపకులు, పట్టణంలోని ఒక ప్రముఖుడు), యూజీసీ నామినీ, అనుబంధ విశ్వవిద్యాలయంతో ప్రతిపాదిత ప్రొఫెసర్‌ సభ్యులుగా, ప్రిన్సిపల్‌ ఎక్స్‌అఫీషియోగా ఉంటారు. స్వయం ప్రతిపత్తి లేని కళాశాలల్లో కళాశాల ప్రణాళిక, అభివృద్ధి మండలి (సీపీడీసీ - కాలేజీ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌) ఉంటుంది. అధ్యక్షుడిగా ప్రిన్సిపల్‌, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒకరు, ఒక సీనియర్‌ అధ్యాపకుడు, మరో ముగ్గురు నుంచి ఐదుగురు (వివిధ రంగాల ప్రముఖులను) సభ్యులుగా నియమించవచ్ఛు సీపీడీసీ కార్యక్రమాల పర్యవేక్షణకు మండలిలో నుంచి ఒకరిని కార్యదర్శిగా ఎన్నుకుంటారు.

ప్రణాళికలు రూపొందించి..

వివిధ విద్యా సంస్థల అత్యున్నత పాలక మండళ్లు.. కళాశాల నిర్వహణకు విధానాలు, వ్యూహాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అవసరమైన వనరులు రూపకల్పన చేస్తారు. విద్యాసంస్థల పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేయడంలో మండళ్ల పాత్ర కీలకం. మొత్తంగా కళాశాలకు, సమాజానికి మధ్య వారధులుగా పని చేస్తాయి. కళాశాల ఉన్నతికి సలహాలు, సహకారాన్ని కాలానుగుణంగా అందజేస్తాయి. విద్యార్థి కేంద్రంగా ఉండే విద్య, సాంస్కృతిక, సామాజిక తదితర అంశాలను రూపొందిస్తాయి. నిధులు సమీకరించడంతో పాటు సద్వినియోగం అయ్యేలా కృషి చేయడం మండలి ప్రధాన విధి. అవకతవకలకు, నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఉండదు.

బీవోజీల ద్వారా..

భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న బీవోజీల్లో స్థానికంగా ఉండే వివిధ రంగాల వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులకు స్థానం కల్పిస్తారు. తద్వారా విద్యాసంస్థలను పటిష్టం చేయడం సహా క్షేత్రస్థాయిలో ఉండే సమస్యల గుర్తింపు, అధ్యయనం చేసే వీలు చిక్కుతుంది. నిధులను సమకూర్చితే సముచిత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు దోహదం చేస్తాయి.


అమలుపై దృష్టి సారించాలి..

డా. గోపాల సుదర్శనం, వాణిజ్యశాస్త్ర సహాయక ఆచార్యులు, సిద్దిపేట

ఇప్పటికే కళాశాలల స్థాయిలో ఉన్న వివిధ కమిటీలను మించి మెరుగైన వ్యవస్థను ప్రతిపాదించాల్సి వస్తే పక్కాగా అమలుపై దృష్టి సారించాలి. బీవోజీలకు కొన్ని ఆర్థిక వనరులను సమకూర్చడంతో పాటు సమర్థులను సభ్యులుగా చేర్చుకోవాలి. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరువేరుతుంది. రాజకీయ ప్రమేయం లేకుండా విద్యావిషయిక రంగాల్లోని నిష్ణాతులైన వ్యక్తులను చేర్చుకుంటే నైపుణ్యమైన మార్గనిర్దేశం అందుతుంది.


ఇప్పటికే ఉన్నా..

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల్లో మండళ్లు ఉన్నా.. నామమాత్రంగా పని చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికి ఒకసారి కూడా సమావేశం కాలేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని చోట్ల రెండేళ్లకు ఒకసారి కూడా నిర్వహించకపోవడం గమనార్హం. నిధులు కేటాయింపులు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో బీవోజీలు ఏర్పాటయ్యే వరకు ఆయా కమిటీలు సక్రమంగా పని చేసేలా పర్యవేక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక ప్రైవేటు కళాశాలల్లో పేరుకు మాత్రమే కొన్ని చోట్ల తల్లిదండ్రుల కమిటీలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో బీవోజీ వ్యవస్థను ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలకు అనువర్తింపజేయాలి. తద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది.


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.