close

బుధవారం, అక్టోబర్ 21, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతివకు అందలం.. అన్నదాతకు ప్రయోజనం

తక్కువ అద్దెకే పరికరాలు

రెండు కేంద్రాల్లో లభ్యం

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, పరిగి

రైతు సేవకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లు

పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తోంది. దీనికి తోడు అధికారులు ప్రోత్సహించడంతో వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఈ విషయంలో పాలనాధికారిణి పౌసుమిబసు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళా రైతు సంఘాలు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నారు. తద్వారా జిల్లాలో సెర్ప్‌ సేవలు విస్తృతం కానున్నాయి. ఇప్పటికే అతివలు వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తుండగా, నూతనంగా ప్రారంభమైన సంఘాలు అన్నదాతలకు తోడ్పాటు అందించేందుకు కార్యాచరణ మొదలయింది...

జిల్లాలో లక్షలాది మంది రైతులు, మహిళలు సేద్యంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సాగు పనులు ఒకేసారి రావడంతో కూలీల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలే దిక్కవుతున్నారు. అందుబాటులో యంత్ర పరికరాలు లేకపోవడం, కూలీలు లేకపోవడంతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. పత్తితీతల సమయంలో మంత్రాలయం, కర్నూలు నుంచి ముందస్తు డబ్బులు చెల్లించి నెల రోజుల పాటు ఇక్కడే ఉండే విధంగా కూలీలను తీసుకువస్తున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు మహిళా రైతు ఉత్పత్తి సంఘాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. మోమిన్‌పేట, కుల్కచర్ల మండలాల్లో ఇవి కొనసాగుతున్నాయి. పండ్లు, చిరుధాన్యాలు, కూరగాయలు గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయడమే ధ్యేయంగా రైతు ఉత్పత్తి కంపెనీ ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించారు.

బహిరంగ విపణి కంటే..
రాయితీపై ఇచ్చే పరికరాలను వ్యవసాయశాఖ పంపిణీ చేయడంలేదు. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. నాగళ్లతో దున్నడానికి గంటకు రూ.800 వసూలు చేస్తుండగా, రోటోవేటర్‌కు రూ.వెయ్యి వరకు తీసుకుంటున్నారు. అయినా సమయానికి లభించడం లేదు. వీటి కొరత తీర్చేందుకు ఏరువాక కస్టమర్‌ హైరింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. బహిరంగ విపణి కంటే పరికరాలను తక్కువ అద్దెకు అందించనున్నారు. తొలి ప్రాధాన్యం కంపెనీలో సభ్యులుగా నమోదైన రైతులకే. అనంతరం ఇతరులకు అవకాశం కల్పించనున్నారు. జాతీయ గ్రామీణ మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్రాలకు రూ.54 లక్షలు కేటాయించింది. వీటితో ట్రాక్టర్లు, నాగళ్లు, ట్రైలర్‌, పవర్‌వీడర్‌, రోటోవేటర్‌, థైవాన్‌ స్ప్రేయర్‌, మల్టీక్రాఫ్‌ ఫ్రెషర్‌, నూర్పిడి యంత్రాలు తదితర 14 రకాల సేద్య పరికరాలు కొనుగోలు చేశారు. వీటికోసం షెడ్‌ నిర్మిస్తున్నారు. మోమిన్‌పేట్‌లోని శ్రీఅనంతపధ్మనాభ రైతు ఉత్పత్తి కంపెనీలో 954 మంది, కుల్కచర్ల శ్రీరామలింగేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంఘంలో 1968 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు.

ఇతర రైతుల నుంచి కూడా..

సాగు అవసరాలకు కేంద్రాల నుంచి పరికరాలను అద్దెకు తీసుకుంటే బహిరంగ మార్కెట్‌ కంటే ఐదు శాతం తక్కువగా అద్దె వసూలు చేస్తారు. అదే సమయంలో ఒకే సారి రైతులందరికి పరికరాలు అద్దెకు ఇవ్వాలంటే సాధ్యం కాని పని. మండలం, కంపెనీ పరిసర ప్రాంతాల్లోని ట్రాక్టరు, ఇతర పరికరాలు ఉన్న యజమానుల వివరాలు సేకరించారు. అవసరమైతే వారి నుంచి అద్దెకు తీసుకుని రైతులకు అందిస్తారు. అందులో 90 శాతం యజమానికి చెల్లించి, 10 శాతం కంపెనీ మార్జిన్‌గా పెట్టుకుంటుంది. ఈ ఆదాయం కంపెనీ బలోపేతనికి ఉపయోగపడుతుంది.

పెరగనున్న ఉపాధి అవకాశాలు

జిల్లాలో ఏరువాక కస్టమర్‌ హైరింగ్‌ కేంద్రాల వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పరికాలను నడిపించేందుకు సిబ్బంది అవసరం ఏర్పడుతుంది. నిర్ణీత మొత్తంలో వేతనం చెల్లిస్తూ తాత్కాలికంగా ఉద్యోగులను నియమించనున్నారు. అదే సమయంలో రైతు ఉత్పత్తి కంపెనీలో ఆసక్తి ఉన్న రైతులు, బోర్డు డైరెక్టర్లకు ట్రాక్టర్‌, ఇతర పరికరాల వినియోగంపై శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్‌, తాండూరు, దౌల్తాబాద్‌ మండల కేంద్రాల్లోనూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కసరత్తు జరుగుతోంది.
 


ఎరువులు, విత్తనాలు కూడా..

మున్ముందు ఎరువులు, విత్తనాలు విక్రయించేందుకు అనుమతులు తీసుకున్నారు. వీటికోసం ప్రత్యేకంగా దుకాణ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే రబీ సీజన్‌ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.


రైతులకు ఎంతో మేలు: కృష్ణన్‌, డీఆర్‌డీఓ

జిల్లాలో రైతు ఉత్పత్తి కంపెనీల పనితీరు బాగుంది. సన్న, చిన్నకారు రైతుల కోసమే ఈ ఏరువాక కస్టమర్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. తక్కువ అద్దెతో అందరికి వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మరో మూడు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.