close

ఆదివారం, అక్టోబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాల్యం... కబంధహస్తం..!

లాక్‌డౌన్‌లో భారీగా బాల్య వివాహాలకు ఏర్పాట్లు!

అడ్డుకున్న ఐసీడీఎస్‌ అధికారులు

నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌


అంగన్‌వాడీ కార్యకర్తలతో చైల్డ్‌లైన్‌ 1098 కౌన్సిలర్‌ సమావేశం

బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం రకరకాల చర్యలు చేపడుతోంది. పోలీసులు కళాజాత నిర్వహించి అవగాహన పెంచుతున్నారు. వీటికితోడు బాలల హక్కుల పరిరక్షణ కమిటీ నిర్వాహకులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలకు నేటికీ అడ్డుకట్ట పడటంలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు అటు ప్రభుత్వం, ఇటు సేవా సంస్థల నిర్వాహకులు జిల్లాలో మొత్తం 94 బాల్య వివాహాలను అడ్డుకుని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇవి వెలుగులోకి వచ్చినవి మాత్రమే. ఇంకా వెలుగు చూడనివి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ వేళ గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిపించేశారనే అనుమానాలు వ్యకం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచి పరిస్థితులను అధిగమించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

పది పూర్తిచేస్తే పెళ్లే...: జిల్లాలో మొత్తం 1,070 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటికి చేరువులో ఉన్న గ్రామాల నుంచే పిల్లలు తరగతులకు హాజరవుతున్నారు. ఆపై చదువులకు వెళ్లేందుకు సరైన రవాణా సదుపాయాలు ఉండటంలేదు. కళాశాలలు దూరంగా ఉంటున్నాయి. ఇలాంటి కారణాలతో పదో తరగతి పూర్తయిన వెంటనే వివాహం చేయడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారని సంబంధిత సంక్షేమ శాఖ అధికారుల సర్వేలో తేలింది.

ప్రత్యేక వార్షిక కార్యాచరణ

లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన బాల్య వివాహాల సంఖ్య అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో బాల్య వివాహాల నివారణకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఇతర శాఖల సిబ్బందితో ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. తొలుత స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. బాల్య వివాహాల నివారణకు అవగాహన కల్పించడం, పోలీసు, సఖి కేంద్రాల ద్వారా బాధితులను ఆదుకోవడం తదితర అంశాలను ఒక ప్రణాళికా బద్ధంగా అమలు చేయనున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష

- లలితకుమారి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారిణి

ఆడపిల్లకు 18 ఏళ్ల లోపు వివాహం చేయడం చట్ట విరుద్ధం. ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా జరిమానా, జైలు శిక్ష రెండూ అనుభవించాల్సిందే. సరిహద్దు మండలాల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. దీన్ని అధిగమించేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం.
 


భిన్న భౌగోళిక పరిస్థితులు

జిల్లాలో మొత్తం 18 మండలాలు, 566 గ్రామ పంచాయతీలు, 970 ఆవాస గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. గ్రామీణ నేపథ్యం కావడంతోపాటు తల్లిదండ్రుల్లో చదువుకున్న వారు తక్కువ. పట్టణ ప్రాంతాల్లోనే సుమారు 58 శాతం మంది ప్రాథమిక చదువులు నేర్చుకున్నట్లు అంచనా. వికారాబాద్‌ జిల్లా తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతం కావడం, మరో వైపు కర్ణాటకతో అంతర్రాష్ట్ర సరిహద్దు, పారిశ్రామికంగా వెనుకబడి ఉండటం ఇలా అన్ని రకాలుగా జిల్లా విభిన్నమైన భౌగోళిక పరిస్థితులతో ముడిపడి ఉంది.

* కొడంగల్‌, బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌, కుల్కచర్ల తదితర మండలాల నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్‌, పుణే తదితర ప్రాంతాలకు వలసలు భారీగా ఉంటాయి. నెలల తరబడి సొంత గ్రామాలకు దూరంగా ఉంటారు. ఏడాదిలో పండగలు, ఇతర సందర్భాల్లో ఇళ్లకు వచ్చినపుడు వివాహాలకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఆయా మండలాల్లోనే అధిక సంఖ్యలో బాల్య వివాహాలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

* లాక్‌డౌన్‌ వేళ గత మార్చి నుంచి ఆగస్టు వరకు దాదాపు 79 మంది బాలికలకు 18 ఏళ్లు నిండకుండానే వివాహం చేయడానికి తల్లిదండ్రులు ముందుకొచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. జనవరి నుంచి లెక్కగడితే ఈ సంఖ్య 94 వరకు ఉంది. దీంతో ఆయా కుటుంబాల తల్లిదండ్రులు, పెద్దలు, గ్రామస్థులకు స్త్రీ, శిశుసంక్షేమ శాఖ, పోలీసు తదితర శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.


ఇవీ ప్రధాన కారణాలు

* వీలైనంత తొందరగా కూతురి పెళ్లి చేసేయాలనే తల్లిదండ్రుల ఆలోచన

* ఉన్నత చదువులకు, ఉపాధికి అందుబాటులో లేని అవకాశాలు

* నిరక్షరాస్యత, పేదరికం, వలసలు, అంతర్రాష్ట్ర సరిహద్దు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.