close

మంగళవారం, ఆగస్టు 11, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ పాత మధురం.. ఆనంద శ్రవణం

జిల్లాలో పలువురికి ఆకాశవాణితో అనుబంధం

నేడు ప్రపంచ రేడియో దినోత్సవం

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం

ఉషోదయాన్నే ఆధ్యాత్మికత వెల్లివిరిసే ప్రసారాలు.. మరోవైపు విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలు.. జాతీయ.. అంతర్జాతీయ వార్తలు.. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే గీతాల సమాహారం రేడియో.. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఇప్పటికీ చాలా ఇళ్లలో ఆకాశవాణి మోగుతూనే ఉంది.. పాత జ్ఞాపకాలను తట్టిలేపుతోంది.. ఎఫ్‌ఎం ప్రసారాలతో కార్లు, వాహనాలు, చరవాణులు శ్రోతలను అలరిస్తున్నాయి.. ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం..

ఆకాశవాణి అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేసిన పాలమూరువాసులు

* ఎం.వెంకటగోపాల్‌ (గద్వాల) * అప్పరసు రమాకాంత్‌రావు (గద్వాల)

* కేబీ గోపాలం (ఏనుగొండ)

రేడియో ఒకప్పుడు సమాచార మార్పిడికే పరిమితమయ్యేది.. రాన్రాను కొత్త పుంతలు తొక్కుతూ విజ్ఞానం.. వినోదం.. అందిస్తోంది.. విద్యార్థులకు పాఠాలు.. రైతులకు పాడి పంటలు.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. చిన్నారులకు బాలవినోదం.. బాలానందం.. అందరికీ వార్తలు ఇలా విభిన్న అంశాలతో అన్ని రకాల శ్రోతలను అలరిస్తోంది.. ఏం పెద్దయ్యా.. అని మధ్యాహ్నం వినిపించిందంటే శ్రోతలు అది పాడిపంటలు కార్యక్రమమని ఠక్కున చెప్పేస్తారు. రేడియో ప్రసారాలతో జిల్లాకు చెందిన అనేకమందికి అనుబంధం ఉన్నది. రేడియో ప్రసార కార్యక్రమాల్లో పలువురు కళాకారులు పాలుపంచుకున్నారు. మరికొందరు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.

1970 నుంచి అనుబంధం..

- ధన్వాడ శ్రీశైలం, సీనియర్‌ రంగస్థల కళాకారులు

రేడియోతో 1970 నుంచి అనుబంధమున్నది. అప్పట్లో ప్రతివారం రంగస్థల పద్యాలు ప్రసారమయ్యేవి. వాటిని విన్న తరవాత నేను కూడా నాటకాలు వేసి అందరి మెప్పు పొందాలనే కుతుహలం కలిగింది. జక్లేర్‌కు చెందిన జె.మాధవరావు నేతృత్వంలో 1974లో జిల్లా శ్రోతల సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘం ప్రారంభోత్సవానికి ప్రముఖ రేడియో కళాకారులను ఆహ్వానించాం. కార్యక్రమంలో నేను అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చేశా. నా కళను తిలకించిన వారిలో వి.సత్యనారాయణ నాకు మొదటిసారిగా 1975లో యువవాణిలో పాల్గొనే అవకాశం కల్పించారు. నాటినుంచి అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రహ్మన, దుర్యోధన, రావణ బ్రహ్మ, శకుని, కర్ణ ఇలాంటి అనేక రంగస్థల ఏకపాత్రలు, నాటికలు, నాటకాలు, ఆధ్యాత్మిక లఘుప్రసంగాలు ఇలా 150 వరకు కార్యక్రమాల్లో పాల్గొన్నా. ప్రశంసలు అందుకున్నా. లంకేశ్వర రావణ ఏకపాత్రాభినయం ప్రసారమైన సందర్భంలో శ్రోతల నుంచి వందలాది అభినందన లేఖలు రాగా రేడియోలో మూడు వారాలపాటు చదవటం నాకు గొప్ప సంతృప్తినిచ్చింది. కళాకారులకు కన్నతల్లి ఒడిలాంటిది ఆకాశవాణి రేడియో కేంద్రం.

రేడియో పుట్టు పూర్వోత్తరాలు..

విద్యుత్‌ అయస్కాంత శక్తిగల రేడియో తరంగాలను జర్మన్‌ శాస్త్రవేత్త హెన్రిచ్‌ హెర్డ్‌ 1886లో గుర్తించారు. దాదాపు దశాబ్ధం తర్వాత 1895- 96లో రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఇటాలియన్‌ ‘మార్కోనీ’ ఆచరణలోకి తీసుకువచ్చారు. దేశంలో మొదటిసారిగా 1923లో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1936లో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. తెలుగులో 1938 జూన్‌ 16న ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో ఆరు ఆకాశవాణి కేంద్రాలు ముంబయి, కొల్‌కతా, దిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు ఉండేవి.

పాలమూరులో ఎఫ్‌ఎం రేడియో ప్రసారాలు

ఆలిండియా రేడియో ఎఫ్‌ఎం సేవలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో కూడా అందుతున్నాయి. 2013 ఫిబ్రవరి 18 నుంచి ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో రేడియో శ్రోతల నుంచి స్పందన వస్తోంది. రోజురోజుకు శ్రోతల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణాల్లో కార్లలో, బస్సుల్లో కూడా ప్రసారాలను వింటున్నారు. జిల్లా జైలులో, పెట్రోల్‌ బంకుల్లో కూడా ఏర్పాటు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రం నుంచి 20 కి.మీ.ల పరిధిలో ఎఫ్‌ఎం ప్రసారాలు అందుతున్నాయి.

అన్ని రకాల ప్రసారాలు ..

- రవికాంత్‌, దూరదర్శన్‌ డైరెక్టర్‌, ఎఫ్‌ఎం రేడియో జిల్లా ఇన్‌ఛార్జి

101.2 ఫ్రీక్వెన్సీలో మహబూబ్‌నగర్‌లో ఎఫ్‌ఎం సేవలు అందుతున్నాయి. ప్రజలకు అవసరమవుతున్న విద్య, విజ్ఞానం, ఉద్యోగ సమాచారం, వార్తలు, ప్రధానంగా వినోదాన్ని పంచుతున్న పాటలు చాలామందిని ఎఫ్‌ఎం రేడియో అభిమానులను చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లామొత్తంగా ఎఫ్‌ఎం రేడియో ప్రసారాలు అందాలంటే జిల్లాకు ఎఫ్‌ఎం రేడియో టవర్‌ వస్తే బాగుంటుంది.

ఆత్మీయ దోస్త్‌..

- రావూరి సూర్యనారాయణ, విద్యాశాఖ విశ్రాంత పర్యవేక్షణ అధికారి

సమాచార రంగంలో శక్తిమంతమైన సాధనంగా ఉన్న రేడియో నాకు ఆత్మీయ దోస్త్‌. ఇప్పటికి ఇంట్లో నా చేతిలో రేడియో ఉంటుంది. 1960 నుంచి రేడియో కార్యక్రమాలను వింటున్నా. వినటమే కాకుండా రేడియో ప్రసార కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా. బాలానందం కార్యక్రమానికి రచనలు చేశా. నేను రాసిచ్చిన కథలను వారు నాటికల రూపంలో ప్రసారం చేశారు. పాఠశాల కార్యక్రమాల్లో విద్యార్థుల కోసం రాసిన నాటికలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి. మా మేనమామ మునిమాణిక్యం నర్సింహారావు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆయనకు పాలమూరు జిల్లా అంటే ఎనలేని అభిమానం. కళలు, కళాకారులకు నెలవైన పాలమూరు జిల్లా కళాకారులు రేడియో కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు.

పదేళ్ల నుంచీ..

- టి.పద్మకుమారి, రేడియో అభిమాని, మహబూబ్‌నగర్‌

పదేళ్ల నుంచి క్రమం తప్పకుండా రేడియోలో ప్రసార కార్యక్రమాలు వింటున్నా. ప్రతిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు వనితాలోకం కార్యక్రమం బాగుంటుంది. మహిళలకు అనేక విజ్ఞానాంశాలే కాకుండా విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఇలా అనేక రంగాలకు సంబంధించి నిపుణులు సలహాలు ఇస్తుంటారు. పిల్లలకోసం ప్రసారమవుతున్న బాలవినోదం, మీరుకోరిన పాటల కార్యక్రమంలో అలనాటి మధురమైన పాటలు ఎంతో ఆనందాన్నిస్తాయి. రేడియో ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడిగా మారింది.

రేడియోతోనే కాలక్షేపం..

- ఉమాపతి, వీణ, ప్లూట్‌ కళాకారుడు, మహబూబ్‌నగర్‌

1960 నుంచి రేడియో కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకున్నా. నాకు కూడా రేడియో ప్రసార కార్యక్రమాల్లో పాల్గొనాలనే అభిలాష ఉండేది. 1961లో చాచా నెహ్రూ బాలానంద సంఘం వారి తరఫున దేశభక్తి పాట పాడా. నా పాట విన్న శ్రోతలు అప్పట్లోనే ఫోన్‌ చేసి అభినందించటం మరువలేనిది. రేడియోలో శాస్త్రీయ సంగీతం వినటం వల్ల నాకు కర్ణాటక సంగీతంపై చక్కని అవగాహన పెరిగింది. సంగీతంలో డిప్లొమా సాధించేందుకు దోహదపడింది. గ్రంథాలయ శాఖలో ఉద్యోగ విరమణ పొందాక నాకు రేడియో చక్కని కాలక్షేపం అయింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.