close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధైర్యపడొద్దు... అండగా ఉంటా 

- ఇడుపులపాయలో సీఎం జగన్‌

- ప్రజాప్రతినిధులు, అధికారులతో భేటీ 

 

కార్యకర్తలు, నాయకులకు నమస్కారం చేస్తున్న సీఎం జగన్‌

వేంపల్లె, న్యూస్‌టుడే: ‘పార్టీ కోసం కష్టపడి పనిచేశారు, అధైర్యపడొద్దు...అందరికీ అండగా ఉంటాన’ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. రెండు రోజుల జిల్లా పర్యటన కోసం మంగళవారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఆయన ఇడుపులపాయకు వచ్చారు. హెలిప్యాడ్‌ వద్ద పులివెందుల నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, సీనియర్‌ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు తమ వ్యక్తిగత సమస్యలతోపాటు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. దాదాపు గంటన్నర పాటు ముఖ్యమంత్రి నాయకులు, కార్యకర్తల విన్నపాలు విన్నారు. ఈ సందర్భంగా పులివెందులకు చెందిన వైకాపా రాష్ట్ర వైద్యుల విభాగం అధ్యక్షుడు వై.ఎస్‌. అభిషేక్‌రెడ్డి ముఖ్యమంత్రికి వైఎస్సార్, జగన్‌ చిత్రపటాన్ని అందించారు. 
కాలినడకన 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌లా సీఎం జగన్‌ కాలినడకన గెస్ట్‌హౌస్‌కు నడిచివెళ్లారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఇడుపులపాయకు వచ్చిన ప్రతిసారి హెలిప్యాడ్‌లో దిగి కిలోమీటర్‌ దూరంలోని గెస్ట్‌హౌస్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి నడుచుకుంటూ వెళ్లేవారు. దారిపొడవునా ప్రజలు, కార్యకర్తలను పేరుపేరునా పలుకరించి వారి సమస్యలను వినేవారు. నేడు తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఆయన నాన్న మాదిరే కాలినడకన గెస్ట్‌ హౌస్‌కు వెళ్లారు. దారి వెంబడి ఎంపీ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్, జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. మార్గం మధ్యలో జిల్లాలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ముఖ్యమైన కార్యకర్తలను సీఎం పేరుతో పిలిచి మాట్లాడారు. స్థానికులు కొందరు తమ సమస్యల గురించి సీఎంకు విన్నవించారు.  

అభివృద్ధి పనులపై చర్చ...
ఇడుపులపాయకు వచ్చిన ముఖ్యమంత్రి గెస్ట్‌హౌస్‌లో జిల్లా బాధ్య మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్, జేసీలు గౌతమి, సాయికాంత్‌ వర్మ, ట్రైనీ కలెక్టర్‌ వికాస్‌ మార్మత్, జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అభివృద్ధి పనులన్నీ టెండర్ల దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చివరగా ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వేల్పుల రామలింగారెడ్డి సీఎంను ప్రత్యేకంగా కలిశారు. 
తరలివచ్చిన నాయకులు 

ముఖ్యమంత్రిని కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తరలివచ్చారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దముడియం నేత గిరిధర్‌రెడ్డి, పులివెందుల మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ వై.ఎస్‌. మనోహర్‌రెడ్డి, వై.ఎస్‌. మధుసూదన్‌రెడ్డి, వై.ఎస్‌. సుధీకర్‌రెడ్డి, వై.ఎస్‌. కొండారెడ్డి, వేంపల్లె మండల వైకాపా కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ సభ్యుడు మహమ్మద్‌ దర్బార్‌ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అన్బురాజన్, ఆర్డీవో నాగన్న, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్‌ వద్ద పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగించారు.
విమానాశ్రయంలో...
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు కడప విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.36 గంటలకు సీఎం కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే సిద్ధంగా ఉన్న ప్రత్యేక హెలికాప్టర్‌లో 4.50 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా కలెక్టరు హరికిరణ్‌తో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీ అన్బురాజన్, జాయింట్‌ కలెక్టరు గౌతమి,  ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ,రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రఘురాంరెడ్డి,  కొరముట్ల శ్రీనివాసులు, మాజీ మేయరు సురేష్‌బాబు, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో కర్నూలు రేంజి డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఆర్డీవో మలోలా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

శిక్షణ కలెక్టర్, జేసీలను సీఎంకు పరిచయం చేస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

​​​​​​​

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.