close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మాతృ భాషలో చదివారు..కీర్తి శిఖరాన మెరిశారు...

బడిలో దిద్దినఅ..ఆ..లతో ఉన్నత స్థానాలు
మన వర్ణమాల సంస్కృతి సంప్రదాయాల వరమాల
అంతర్జాతీయ వేదికలపై విజేతలు
- ఈనాడు, హైదరాబాద్‌

రక్షణ రంగంలో ఎన్నో అస్త్రశస్త్రాలకు రూపమిస్తున్న డీఆర్‌డీఓ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి తెలుగు మాధ్యమంలో చదివి.. ఆంగ్లంపై పట్టు సాధించి శాస్త్రవేత్త కాగలిగానంటారు. మాతృభాషలో ప్రావీణ్యం సాధిస్తే ప్రపంచంలో ఏ భాషనైనా ఇట్టే నేర్చుకోవచ్చంటారు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎం.డి. ఎన్వీఎస్‌ రెడ్డి. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నపుడు పెదనాన్న కొనిచ్చిన నిఘంటువుతో ఆంగ్లానికి పునాది వేసుకున్నానని సగర్వంగా చెబుతున్నారు హెచ్‌సీయూ ఉప కులపతి పొదిలె అప్పారావు.. భిన్న రంగాల్లో.. వివిధ హోదాల్లో రాణిస్తున్న ఎంతోమంది తెలుగును మరవకుండా.. ఆంగ్లాన్ని నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దశాబ్దాల క్రితం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అక్షరాలు దిద్దిన చేతులు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో జర్నల్స్‌కు రచనలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎంతోమంది వైద్యులు.. మరెంతోమంది శాస్త్రవేత్తలు, విద్యాధికులు తమ తొలి అడుగులు తెలుగు అక్షరాలతోనే మొదలయ్యాయంటున్నారు. తమ గమ్యాన్ని చేరేందుకు మాతృభాష వేసిన  పునాది తీరును ‘ఈనాడు’తో పంచుకున్నారు.


ఇంగ్లిషు చెబుతూనే.. తెలుగూ నేర్పాలి
- ఎం.దానకిషోర్‌, ఎం.డి., జలమండలి

నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నా. ఇంగ్లిషును ఒక సబ్జెక్టుగా మా ఉపాధ్యాయులు బాగా చెప్పేవారు. నా పట్టుదల వల్ల త్వరగా ఆ భాష అబ్బింది. పట్టు సాధించేందుకు ఇష్టం తొలి మెట్టు. ఆంగ్లంలో చదువు చెప్పినా సరే...డిగ్రీ వరకు తెలుగు సబ్జెక్టు  తప్పనిసరి చేయాలి. ప్రాథమిక స్థాయిలో రోజుకు రెండు గంటలపాటు, ప్రాథమికోన్నత స్థాయిలో రోజు ఒక గంట, ఇంటర్‌లో వారానికి రెండు, మూడు గంటలు తెలుగుపై దృష్టి పెట్టాలి. తద్వారా అటు ఆంగ్లంతోపాటు తెలుగులోనూ విద్యార్థులు ప్రావీణ్యం సాధించేందుకు వీలు ఏర్పడుతుంది. విద్యార్థులకు తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచాలి. ఉన్నత తరగతుల నుంచే కథ, కథానిక, నవలల గురించి పరిచయం చేయాలి. కాళోజీ, సినారె, విశ్వనాథ సత్యనారాయణ, చలం ఇలా గొప్ప తెలుగు రచయితల  సాహిత్యాన్ని  ఇష్టంతో  చదివేలా వారిలో ఆసక్తి పెంచాలి.


తెలుగులోని విరుపులు, నుడికారం ఇతర భాషల్లో బహు అరుదు. బోధించే ఉపాధ్యాయుడిని బట్టి కూడా భాషపై అభిరుచి ఏర్పడుతుంది.


సమగ్ర అధ్యయనంతోనే సాధ్యం
-డాక్టర్‌ నరేంద్రనాథ్‌, ఆర్థోపెడిక్‌ వైద్యులు, నిమ్స్‌ మాజీ సంచాలకులు

అభివృద్ధి చెందిన రష్యా, చైనా, జపాన్‌ తదితర దేశాలు ఇప్పటికీ మాతృ భాషలోనే ఉన్నత విద్య కొనసాగిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలని ఉంటే ఆంగ్లం నేర్చుకుంటారు. హెచ్‌ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు తెలుగులోనే చదువుకున్నా. అప్పట్లో ఒక సబ్జెక్టుగా ఇంగ్లిషు బోధన నాణ్యంగా ఉండేది. సైన్సు, లెక్కల్లో వచ్చే సాంకేతిక పదాలను తెలుగులో బోధిస్తూనే బ్రాకెట్‌లో ఆ పదాలను ఆంగ్లంలో రాసేవారు. ఇలా చిన్న తరగతుల నుంచే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం గురించి పరిచయం చేసేవారు. ముఖ్యంగా మాతృ భాషపై పట్టు వస్తే...మిగతా భాషలు నేర్చుకోవడం తేలికని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాథమిక స్థాయిలో మాతృ భాషలో బోధన సాగినా...ఆంగ్లం ఒక సబ్జెక్టుగా చెప్పేటప్పుడే వ్యాకరణం నుంచి పద సంపద, వాక్య నిర్మాణం వరకు సమగ్రంగా వివరించాలి. తద్వారా వారు ఉన్నత విద్యకు వచ్చినా ఆంగ్లం అంటే భయపడే పరిస్థితి ఉండదు. 


మూలాంశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం
- ప్రొఫెసర్‌ వి.ఎస్‌.రావు, ఉపకులపతి, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ, రాజస్థాన్‌

నేను 11వ తరగతి వరకు తెలుగులోనే చదువుకున్నా. ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తికాగానే పీయూసీలో చేరాను. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం. మొదట్లో ఇబ్బంది పడినా పట్టు సాధించేందుకు ఎక్కువ సేపు కష్టపడేవాడిని. సంకోచించకుండా తెలిసిన వారినుంచి నా సందేహాలను తీర్చుకునేవాడిని. మాతృభాషలో బోధన ఉంటే అర్థం చేసుకోగలుగుతాం. అదే ఇంకో భాషలో నేర్చుకోవాలంటే ఎక్కువ శ్రమించాలి. ఏ మాధ్యమం అయినా మూలాంశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. బట్టీ విధానంలో ప్రస్తుత చదువులు నడుస్తున్నాయి. బోధనలో ఈతీరు మారాలి. ఉన్నత విద్యలో ఇంగ్లిష్‌లో తప్ప పుస్తకాలు అందుబాటులో లేవు. 


పట్టుదల ఉంటే పట్టు సాధించొచ్చు..
- ఎన్వీఎస్‌ రెడ్డి, ఎం.డి., హైదరాబాద్‌ మెట్రో రైలు

నేను డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా. తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు మా ఊరు. పదోతరగతి వరకు అక్కడే. ఆపై ఇంటర్‌, డిగ్రీ రామచంద్రాపురం వీఎస్‌ఎన్‌ కళాశాలలో చేశాను. ఏడో తరగతి నుంచే ఇంగ్లిష్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకున్నాను. కాంపిటీషన్‌ సక్సెస్‌ వంటి పత్రికలు చదువుతున్నప్పుడు ఎక్కువ మంది ఐఏఎస్‌లు దిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థులే ఉండడం గమనించాను. అక్కడ చదివి సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావాలనే ఉద్దేశంతో సైన్స్‌ విద్యార్థినైనా డిగ్రీలో బీఏ లిటరేచర్‌ చేశాను. అనంతరం దిల్లీలోని జేఎన్‌యూలో ఎంఏ, ఆ తర్వాత ఎంఫిల్‌ చేశాను. ఆంగ్లంపై పట్టు ఉన్నా అక్కడ అడుగు పెట్టినప్పుడు నాలాంటి వారికి ఆ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉండేది. అలా వచ్చిన వారంతా పబ్లిక్‌ స్కూళ్లు, ఐఐటీల్లో చదివినవారు. నేనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాను. ఇంగ్లిష్‌ రాయడం వరకు ఇబ్బంది లేకున్నా.. కొంత ఆత్మన్యూనత భావం ఉండేది. ఆంగ్లంపై పట్టు సాధించేందుకు బీబీసీ, వాయిస్‌ ఆఫ్‌ అమెరికా బాగా వినేవాడిని. కొత్త పదాల అర్థాలకు నిఘంటువులు తిరిగేయడం, దాని మూలం ఎక్కడని అధ్యయనం చేసేవాడిని. ప్రతి చర్చలో పాల్గొనేవాడిని. అలా ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాను. తెలుగులో చదువుకున్నా ఆసక్తి, పట్టుదల ఉంటే ఆంగ్లం నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు.


సాధనతో సాటి భాష కరతలామలకం
- ప్రొ.పొదిలె అప్పారావు, ఉప కులపతి, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

నా ప్రాథమిక విద్య తెలుగులోనే సాగింది. అమరావతి తుళ్లూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1970-75 మధ్య ఆరు నుంచి పదో తరగతి వరకు చదివాను. అంతకుముందు అయిదో తరగతి వరకు ఊళ్లో ఒకరు ప్రత్యేకంగా పాఠాలు చెప్పారు. గుంటూరులోని హిందూ కళాశాలలో ఇంటర్‌లో చేరాను. కొంత తెలుగు, కొంత ఆంగ్ల బోధన వల్ల కష్టం అనిపించలేదు. పీజీకి వచ్చాక ఆంగ్లం నేర్చుకోవాలన్న తపన ఎక్కువైంది. డిగ్రీ రెండో ఏడాదిలో ఉన్నప్పుడు పెదనాన్న నిఘంటువు బహుమతిగా ఇచ్చారు. అందులోని పదాలు నేర్చుకుంటూ సాధన మొదలెట్టాను. ఆంగ్ల పత్రికలు చదువుతూ ఐదు పదాలను నోట్‌ చేసుకుని అర్థాలు వెతికేవాడిని. ఓ పదంతో అయిదు వాక్యాలు సొంతంగా రాసుకుని ఎలా ఉపయోగించాలో తెలుసుకునే వాడిని. మా పీహెచ్‌డీ సూపర్‌వైజర్‌ కొన్ని వాక్యాలను సరిదిద్దేవారు. ప్రస్తుతం ఉన్నత స్థాయి ఆంగ్లాన్ని మాట్లాడే స్థాయికి చేరుకున్నా. 


అమ్మ భాషలోనే చదువుతూ ఆంగ్లంపై పట్టు
- డాక్టర్‌ ఎ.వి.గురవారెడ్డి, ఎం.డి., సన్‌షైన్‌ ఆసుపత్రులు

నా ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య మొత్తం తెలుగులోనే కొనసాగింది. ఆంగ్లం ఒక సబ్జెక్టుగా బోధించేవారు. తెలుగుతోపాటు నాకు చిన్నప్పటి నుంచే ఇంగ్లిషుపై మక్కువ ఎక్కువ. దీంతో ఉన్నత విద్యకు వచ్చేలోపు ఆ భాషపైనా పట్టు సాధించా. సమయం దొరికితే గ్రంథాలయాల్లో గడిపే వాళ్లం. షేక్‌స్పియర్‌, ఛార్లెస్‌ డికెన్స్‌ వంటి కవుల రచనలు, ఆంగ్ల డిటెక్టివ్‌ నవలలు చదివేవాడిని. ఇది ఆ భాషను బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అన్ని పరీక్షల్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో టాపర్‌గా నిలిచేవాడిని. ఇప్పటికీ తొలుత తెలుగులో మాట్లాడడానికే ప్రాధాన్యం ఇస్తాను. అప్పట్లో మాకు తెలుగుతోపాటు అంతే అద్భుతంగా ఆంగ్ల పాఠాలను బోధించే వారు.  విద్యార్థి తెలివితేటలు, కష్టపడే తత్వంపై అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 


మనోవికాసానికి దోహదపడుతుంది
- డా. లక్ష్మయ్య, సీనియర్‌ శాస్త్రవేత్త, ఎన్‌ఐఎన్‌

మాతృభాషలో మమకారం ఉంటుంది. జీవితపు విలువలు నేర్పించేది కాబట్టే దాన్ని అమ్మభాష అంటారు. ఇక్కడి నుంచి తెలుసుకున్నది బడి వరకూ కొనసాగితే ప్రతి అంశం తేలికగా అర్థమవుతుంది. మనోవికాసానికి దోహద పడుతుంది. మాది కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం జాగిరిపల్లి. పాఠశాల నుంచి కళాశాల వరకూ తెలుగు మాధ్యమంలోనే. ప్రాథమిక విద్య అంతా ఒక్కరే మాస్టారు. హుజూరాబాద్‌లో ఇంటర్‌ బైపీసీ చదివాను.. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఉండగా.. కళాశాల విజ్ఞాన యాత్రలో భాగంగా వరంగల్‌ కాకతీయ వైద్య విశ్వ విద్యాలయానికి వెళ్లాను. అక్కడ వైద్యవిద్య గురించి తెలుసుకున్నా.. తెలుగులో చదివి ఇంగ్లిష్‌లో ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష రాశాను. మంచి ర్యాంకుతో సీటు సంపాదించగలిగా. అప్పుడైనా, ఇప్పుడైనా ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ సీట్లలో 50 శాతం తెలుగులో చదివినవారే ఎగరేసుకుపోతున్నారు. ప్రపంచాన్ని తెలుసుకునేందుకు ఇంగ్లిషు అవసరం.. జీవితాన్ని ఆస్వాదించేందుకు అమ్మభాష అంతే ముఖ్యం.


‘ప్రాథమిక’ బోధన మనదై ఉండాలి
- డాక్టర్‌ శేషగిరిరావు, కార్డియాలజిస్టు

పది వరకు తెలుగులోనే చదివా. ప్రతి తరగతిలో ఆంగ్లం ఒక సబ్జెక్టుగా ఉండేది. మొక్కుబడిగా కాకుండా వ్యాకరణ సహితంగా  బోధించేవారు. షేక్‌స్పియర్‌ వంటి ఆంగ్ల రచయితల నవలల పరిచయం చెప్పేవారు. ఆంగ్ల పత్రికలు చదవడం, ఆ వార్తలు వినడం ద్వారా భాషలో మెలకువలు నేర్చుకున్నాం. ఇంటర్‌, తర్వాత వైద్య విద్య ఆంగ్ల మాధ్యమంలోనే సాగినా ఇబ్బంది పడలేదు. పిల్లలు మాట్లాడే భాషలోనే ప్రాథమిక విద్యా బోధన సాగడం వల్ల త్వరితగతిన అలవడుతుంది. మాతృభాష తెలిస్తే అన్యభాషలు నేర్చుకోవడం తేలిక. తెలుగులో బోధిస్తూనే పిల్లలకు నెమ్మదిగా ఆంగ్లాన్ని పరిచయం చేస్తూ ఇష్టం పెంచాలి. పది, ఇంటర్‌కు వచ్చేసరికి వారికి పూర్తిగా అది అలవడుతుంది. రెండు భాషలపై పట్టు పెంచుకుంటారు. 


రాత్రింబవళ్లు చదువుపైనే దృష్టి
- డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి, ఛైర్మన్‌, డీఆర్‌డీవో

నేను పదోతరగతి వరకు నెల్లూరు జిల్లాలోని మా ఊరు మహిమలూరు ప్రభుత్వ పాఠశాలలో చదివాను. అంతా తెలుగు మాధ్యమంలోనే సాగింది. ఇంటర్‌ నెల్లూరులోని వీఆర్‌ కళాశాలలో ఇంగ్లిషు మీడియంలో చేరాను. దీంతో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. పట్టుబట్టి నేర్చుకోవడంతో తెలుగు నుంచి ఇంగ్లిష్‌కు త్వరగానే మారగలిగాను. ఆ తర్వాత అనంతపురం జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ చేశాను. మంచి స్నేహితుల సాన్నిహిత్యం దొరకడంతో రాత్రింబవళ్లు చదువుపైనే దృష్టి పెట్టగలిగాను. నాకు బషీర్‌, భానుకుమార్‌ ఇద్దరు సన్నిహిత మిత్రులున్నారు. బషీర్‌ తెలుగు మాధ్యమం నుంచే వచ్చినా రాష్ట్రస్థాయి ర్యాంకర్‌. ఇస్రోలో శాస్త్రవేత్త. భానుకుమార్‌ ఐఐఎం అహ్మదాబాద్‌లో చదివి దుబాయ్‌లోని ఓ బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.