close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

సగమేచెల్లించారు

మిగతా బిల్లులకు ఆన్‌లైన్‌ గడువు

బియ్యం మిల్లర్లతో మందగమనం

న్యూస్‌టుడే, బోధన్‌

ఒడుదొడుకులతో ఖరీఫ్‌ సీజన్‌ గట్టెక్కిన రైతులు ఇప్పుడు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి పెట్టుబడి కోసం కర్షకులు నిరీక్షిస్తున్నారు. పంట రుణాల మంజూరు వైపు తొంగిచూడని బ్యాంకర్ల కారణంగా ఆర్థిక సర్దుబాట్ల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం తాలూకు చెల్లింపులు ఇప్పటి వరకు సగం శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా సగం ముట్టజెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ట్యాబ్‌ల్లో వివరాలు నమోదు చేసే ఆన్‌లైన్‌ ప్రక్రియ బియ్యం మిల్లర్ల కారణంగా మందగిస్తోంది.

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ఉమ్మడి జిల్లాలో 310 కేంద్రాలు ఏర్పాటు చేసి 215 మిల్లులకు తరలించారు. సహకార సంఘాలు ఎప్పటి మాదిరి ఎక్కువ సంఖ్యలో కేంద్రాలు నిర్వహించాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన మిల్లర్‌కు పంపారు. ప్రతి లారీలో ఎన్ని బియ్యం బస్తాలు ఉన్నాయి? వాటి తూకం? రైతుల పేర్లు ట్రక్‌షీట్‌లో నమోదు చేసి పంపుతారు. బస్తాలు దింపుకొనే మిల్లర్‌ తూకాన్ని నిర్ధరించుకొని సంతకం చేశాక కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు తిరిగి ట్రక్‌షీట్‌ వస్తుంది. దానిని పౌరసరఫరాల శాఖకు పంపుతారు. గతంలో బిల్లుల చెల్లింపులకు ఈ విధానాన్ని ప్రామాణికం చేసుకునేవారు.

మహారాష్ట్రలో డిమాండు

పొరుగున ఉన్న మహారాష్ట్రలో సన్న బియ్యానికి డిమాండు ఉండడంతో ఎక్కువ ధరకు రైతులు అక్కడ అమ్ముకున్నారు. సన్నరకం ధాన్యాన్ని పాలకులు ఇక్కడ ద్వితీయ శ్రేణిగా గుర్తిస్తారు. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రానికి సన్నరకం తరలింది. ఈ పరిణామాలు ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభావితం చేసింది.

ప్రస్తుతం ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య ఆధారంగా నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకొని పౌరసరఫరాల అధికారులు ట్యాబ్‌లు అందించారు. వాటిని ఎలా వాడాలో తర్ఫీదు కూడా ఇచ్చారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు ట్యాబ్‌లో ట్రక్‌షీటులోని వివరాలు నమోదు చేస్తారు. వాటిని మిల్లర్‌ కంప్యూటర్‌ లేదా అండ్రాయిడ్‌ ఫోన్‌లో పరిశీలించడానికి పౌరసరఫరాల శాఖ రూపొందించిన యాప్‌ ఉంది. అందులో ఆమోదం తెలిపితేనే డబ్బు చెల్లింపుల బిల్లు తయారవుతుంది. అయితే ఆన్‌లైన్‌ ఆమోదాన్ని మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన నేటి వరకు గడువు

ఇప్పటి వరకు సేకరించిన 3.95 లక్షల టన్నులకు గాను సుమారు 2.5 టన్నులకు రూ.375 కోట్లు ముట్టజెప్పారు. ఇంకా 1.90 లక్షల టన్నులకు డబ్బు చెల్లించాల్సి ఉంది. మరో వారం దాకా కొనసాగే కొనుగోళ్లతో ఈ సంఖ్య కొంత పెరగనుంది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్ల తాలూకు వివరాలు మొత్తం నేటి వరకే ట్యాబ్‌ల్లో ఆన్‌లైన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు గడువు నిర్దేశించారు.

60 శాతం కొనుగోళ్ల లక్ష్యం

రెండు జిల్లాలు కలిపి ఖరీఫ్‌లో 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేసిన అధికారులు అందులో 7.20 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించాలని లక్ష్యం విధించుకొన్నారు. అయితే అందులో గరిష్ఠంగా 4 లక్షల టన్నులు మాత్రమే అంటే సుమారు 60 శాతం దిగుబడిని మాత్రమే సేకరించారు. వరి కోతలు ప్రారంభమైన సమయంలో కురిసిన భారీ వర్షాలు ధాన్యం ఎండబెట్టడానికి అనుకూలించలేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో క్వింటాకు రూ.300 తగ్గించుకొని రైతులు పచ్చి ధాన్యాన్ని విక్రయించారు. సర్కారు ధర మొదటి శ్రేణి ధాన్యం క్వింటాకు రూ.1,835 కాగా రెండవ రకం ధాన్యానికి రూ.1,815 ప్రకటించింది.

తరుగుపై వివాదాస్పదం

టన్నుకు ఐదు కిలోల తరుగును కొందరు మిల్లర్లు విడిగా తీసుకుంటున్న తీరు వివాదాస్పదం అవుతోంది. తాము పంపిన బస్తాల తూకం తగ్గించడాన్ని సహకార సంఘాలు అంగీకరించడం లేదు. వెరసి బిల్లుల తయారు ఆలస్యం అవుతోంది. అంతర్జాల నెట్‌వర్క్‌ సమస్య వల్ల ట్యాబ్‌లను సహకార కార్యదర్శుల ఆధీనంలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ట్యాబ్‌లు వాడుతున్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల మధ్య ‘తరుగు’ పరిష్కారమైతే రైతులకు డబ్బు చెల్లింపుల వేగం పెరుగుతుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.