close

బుధవారం, ఫిబ్రవరి 26, 2020

ప్రధానాంశాలు

గంటగంటకు గుండెల్లో ఘంటలు

అభ్యర్థుల్లో ఉత్కంఠ

నేటి ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

కోర్టు కేసులతో ఆలస్యం

ఓటరు జాబితా ప్రహసనం

రిజర్వేషన్లపై నైరాశ్యం

టికెట్లకు కాళ్లబేరం

పార్టీల కాఠిన్యం

తిరుగుబాట్ల అసహనం

నాలుగు రోజులే ప్రచారం

లక్షలకులక్షలు కృష్ణార్పణం

ఓటరు మనసులో ఫలితం

లెక్కపెట్టేందుకు కదిలిన పటాలం

తెలుసుకొనేందుకు నేతలు ఆగమాగం..

 

పుర ఎన్నికలు సాగిన తీరిది.

అనేకానేక నిరీక్షణలు ఎదుర్కొన్న నాయకులు చివరి ఘట్టానికి చేరుకుని తమ ‘గంట’ ఎప్పుడొస్తుందని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నేడు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను అనుసరించి లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మూడు వార్డుల ఓట్లను ఒక్కో రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో లెక్కించేలా కార్యాచరణ చేశారు.

30 నిమిషాలకో వార్డు ఫలితం

* ఉదయం ఏడు గంటలకు లెక్కింపు సిబ్బంది, పర్యవేక్షకులు కేంద్రాలకు చేరుకుంటారు.

* 8 నుంచి 9.30 నిమిషాల వరకు బాక్సులను తెరిచి 25 బ్యాలెట్‌ పత్రాల చొప్పున కట్టలు కడతారు.

* రెండో దశలో 9.30 నుంచి 10 గంటల వరకు అభ్యర్థుల వారీగా ఓట్లను లెక్కిస్తారు.

* 10 నుంచి ప్రతి 30 నిమిషాలకో వార్డు ఫలితం వెల్లడవుతుంది.

ఓట్ల లెక్కింపు ఇలా

ఒక్కో టేబుల్‌ వద్ద ఓట్లను లెక్కించేందుకు సూపర్‌వైజర్‌తో పాటు ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించారు. తొలుత పోలింగ్‌ కేంద్రాల వారీగా బ్యాలెట్‌ పెట్టెలను విప్పి ప్రాథమికంగా లెక్కించి 25 పత్రాల చొప్పున కట్ట కడతారు. వాటన్నింటిని ఒక డ్రమ్ములో వేసి వంద ఓట్ల చొప్పున ఒక్కో టేబుల్‌పై లెక్కిస్తారు. వార్డుల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రకారం ట్రేలను సిద్ధం చేశారు. ప్రతి టేబుల్‌కు అభ్యర్థి లేదా అతని తరఫు ఏజెంట్‌ ఉండచ్ఛు

అధ్యక్ష పీఠాల కైవసానికి కసరత్తు

ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాక ముందే అభ్యర్థులను శిబిరానికి తరలించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 27న సభ్యత్వ ప్రమాణంతో పాటు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకొనేలా శనివారం నోటిఫికేషన్‌ రానుంది. ఈ నేపథ్యంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా చతురతతో వ్యవహరించి పుర పీఠాలను దక్కించుకునేందుకు అన్ని పార్టీల కీలక నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలో

* జిల్లాలోని మూడు పురపాలికల్లో మొదటగా టేబుల్‌కో వార్డు ఓట్లను లెక్కించేలా ఏర్పాటు చేశారు. అనంతరం మరో వార్డు ఓట్లను లెక్కించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.

* కామారెడ్డి పట్టణంలోని 49 వార్డుల ఓట్ల లెక్కింపునకు 17 మంది రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. ఒక్కొక్కరి సమక్షంలో మూడు వార్డుల ఓట్లను లెక్కించనున్నారు.

* మొదటి హాల్లో 10 మంది రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో లెక్కింపు జరిగేలా ఏర్పాట్లు చేశారు. రెండో హాల్లో ఏడుగురు అధికారులు ఉంటారు.

నిజామాబాద్‌ జిల్లాలో

నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ పురపాలికల్లోని అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు ఒకేసారి చేపట్టనున్నారు. మున్సిపాలిటీ వారీగా విడివిడిగా హాళ్లలో టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఒక్కో టేబుల్‌కు ఇద్దరేసి చొప్పున కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించారు. మరో 60 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు. మూడు వార్డులకు ఒకరు చొప్పున నియమించిన ఆర్వోలు లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

విడతల వారీగా కామారెడ్డి బల్దియా వార్డుల ఫలితాలు

మొదటి: 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31, 34, 37, 40, 43, 44, 45, 46

రెండు: 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29, 32, 35, 38, 41, 44, 47 .

మూడు: 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48

బాన్సువాడలో

మొదటి: 1, 4, 7, 10, 13, 19

రెండు: 2, 5, 8, 11, 14, 17

మూడు: 3, 6, 9, 12, 15, 18

ఎల్లారెడ్డిలో

మొదటి: 1, 4, 7, 10

రెండు: 2, 5, 8, 11

మూడు: 3, 6, 9, 12

మొదటి గంటలో ఆర్మూర్‌ ఆరు వార్డులు

ఆర్మూర్‌ ఆర్మూర్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి గంటలోనే ఆరు వార్డుల ఫలితాలు తెలిసిపోనున్నాయి. ప్రతి రౌండులో వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. 7, 16, 19, 23, 25, 29 వార్డుల్లో వెయ్యిలోపే పోలయ్యాయి. ఈ మేరకు వీటి ఫలితాలు అర గంటలోనే తెలిసిపోతాయి. మిగతా 30 వార్డుల ఓట్లు రెండు రౌండ్లలో లెక్కిస్తారు. అత్యధికంగా నాలుగో వార్డులో 1360, 11వ వార్డుల్లో 1100 లోపు ఓట్లున్నాయి. వీటి లెక్కింపు గంటన్నర పట్టనుంది. కాగా ఫలితాల వెల్లడి కొంత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితాల వివరాలను మొదట సంబంధిత రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడికి మెయిల్‌ ద్వారా పంపిస్తారు. ఆయన చూసి ఆమోదం తెలిపిన తర్వాతే వెల్లడిస్తారని సమాచారం.

ఒక్క రౌండ్‌లోనే 20వ వార్డు ఫలితం

బోధన్‌ పట్టణం బోధన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో మొదటి రౌండ్‌లోనే 20వ వార్డు ఫలితం వెల్లడి కానుంది. ఇక్కడ 895 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఒక్కటి మినహా అన్నింటా వెయ్యికి పైగా పోలింగ్‌ నమోదైంది. పట్టణంలో అన్ని వార్డుల గరిష్ఠ ఓటర్ల సంఖ్య 1700 వరకు ఉంది. అందులో అత్యధికంగా 30వ వార్డులో 1387 ఓట్లు పోలయ్యాయి. ఇక 1040- 1090 మధ్య ఏడు వార్డులు ఉన్నాయి. దాదాపుగా అన్ని వార్డుల్లోనూ 1100- 1390 మధ్య ఓట్లు పోలయ్యాయి. 1100లోపు ఓట్లు పోలైన వార్డుల్లో ఫలితం వేగంగా వెల్లడయ్యే ఆస్కారముంది.

10వ డివిజన్‌దే మొదట ఫలితం

నిజామాబాద్‌ నగరం: నిజామాబాద్‌ నగర పాలిక సంస్థలోని 60 డివిజన్ల ఓట్ల లెక్కింపు శనివారం ఒకేసారి చేపట్టనున్నారు. తొలి ఫలితం 10వ డివిజన్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2,435 ఓట్లు పోలయ్యాయి. అన్నింటి కంటే ఎక్కువగా 1వ డివిజన్‌లో 4,335 ఓట్లు పోల్‌ అయ్యాయి. దీని ఫలితం చివరిగా రానుందని అధికారులు భావిస్తున్నారు.

ఫలితాల వెల్లడి ఇలా

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.