close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

ఓటరు చైతన్యమేదీ?

పక్క నగరాలతో పోల్చితే కరీంనగర్‌లోనే తక్కువ పోలింగ్‌
ఉద్యోగులు, విద్యావంతులు ఇక్కడే ఎక్కువ  ః చొరవచూపని అభ్యర్థులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, కార్పొరేషన్‌

కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే ఆశించిన స్థాయిలో పోలింగ్‌ జరగలేదు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు, కుటుంబాలు ఉన్నప్పటికీ ఓటు వేయడానికి నిరాసక్తత వ్యక్తం చేసినట్లు పోలింగ్‌ వివరాలు తెలుపుతున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు సైతం ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించడంలో వెనుకబడిపోయారు. పక్కనే ఉన్న నగరపాలక సంస్థ రామగుండంతో పోల్చితే కరీంనగర్‌ నగరపాలిక సంస్థలోనే పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. అదీ కొత్తగా విలీనమైన గ్రామాల పరిధిలోనే అధిక శాతం పోలింగ్‌ జరిగినట్లు స్పష్టమవుతోంది. గత శాసనసభ ఎన్నికలతో పాటు నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోల్చితే గతం కంటే కొంత శాతం పెరిగినా అదీ అనుకున్న స్థాయిలో పెరుగుదల కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

అభివృద్ధి చెందిన ప్రాంతమైనా.. : ఉమ్మడి జిల్లా కేంద్రంలో విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపార కుటుంబాలు ఎక్కువగా ఉన్నారు. ఓటర్లలో వీరి సంఖ్యే ప్రధానం.. పోలింగ్‌ అయిన ఓటర్ల సరళిని బట్టి చూస్తే.. విద్యావంతులు ఎక్కువ ఆసక్తి కనబర్చలేకపోయారు. ఓటరు అవగాహన కార్యక్రమాలతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేసినా దాని ఫలితం పోలింగ్‌పై కనిపించలేదు. వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు, రోజువారీ కూలీలు కొంతమేర ఉద్యోగ, వ్యాపార కుటుంబాలు, మహిళలు ఓటేశారు. యువ ఓటర్ల శాతం అంతంతమాత్రంగానే ఉంది.

అభ్యర్థుల చొరవ ఏదీ? : సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గణనీయంగా పెరుగుతోంది. నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ 60 డివిజన్లకు గాను 58 డివిజన్‌లలో ఎన్నిక జరిగింది. 2, 3 డివిజన్లు మినహా నలుగురికి పైగా ప్రతి డివిజన్‌లో బరిలో ఉన్నారు. మొత్తం 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంపై చూపిన ఆసక్తిని పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు వెళ్లేలా అవగాహన కల్పించడంలో సఫలీకృతులు కాలేకపోయారు. అలాగే ఓటర్ల జాబితాలో జరిగిన తప్పిదాలను పోలింగ్‌కు ముందే సవరించి ఆ ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తే కొంతమేర పోలింగ్‌ పెరిగేది. ఈ విషయంలోనూ ప్రయత్నలోపం ఉంది.

డివిజన్ల పునర్విభజనతో ప్రధాన సమస్య : నగర పరిధిలో శివారు గ్రామాలను విలీనం చేయడంతో 50 డివిజన్ల నుంచి 60 డివిజన్లకు డివిజన్ల పునర్విభజన చేపట్టారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలు ఇంటింటా తయారు చేసినప్పటికీ ఆ ఇంటి నంబర్ల ఆధారంగా కొందరి ఓట్లు గల్లంతయ్యాయి. కొందరి పేర్లు రెండు సార్లు నమోదు కాగా, మరికొందరి పేర్లు ఏ డివిజన్‌లో ఉన్నాయో దొరక్కపోవడంతో ఓటర్లు ఓటు వేయకుండా వెనుదిరిగారు.

శివారు గ్రామాల్లోనే ఓటింగ్‌ శాతం ఎక్కువ : నగరంలోని విలీనమైన గ్రామాల కంటే నగరంలోని పలు డివిజన్‌లలో తక్కువ పోలింగ్‌ నమోదైంది. 2వ డివిజన్‌ పరిధిలోని వల్లంపహాడ్‌, తీగలగుట్టపల్లి, 8వ డివిజన్‌లోని అలుగునూర్‌, 7వ డివిజన్‌లోని సదాశివపల్లి, 18, 19 డివిజన్ల పరిధిలోని రేకుర్తి, 16వ డివిజన్‌లోని పద్మానగర్‌తో పాటు నగరంలోని నాలుగైదు డివిజన్‌లలో ఎక్కువ పోలింగ్‌ అయింది. కొన్ని డివిజన్‌లలో 4వేలకు పైగా ఓటర్లు ఉన్నా.. 2500లోపే పోలింగ్‌  జరిగింది.

పోలింగ్‌ కేంద్రాలు పెంచినా.. : గతంతో పోల్చితే ఈసారి పోలింగ్‌ కేంద్రాలను నగరపాలక అధికారులు నగరంలో పెంచారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సూచనల మేరకు కిలోమీటర్‌ దూరంలో ఆయా డివిజన్‌లలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 800 మందికి ఒక బూత్‌ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

కరీంనగర్‌లోనే తక్కువ : ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఉన్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇతర నగరాల నగరపాలికలను పోల్చితే కరీంనగర్‌లో పోలింగ్‌శాతం తగ్గింది. పక్కనే ఉన్న రామగుండం నగరపాలక సంస్థలో 67.66 శాతంతో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు వచ్చారు. పురపాలికల్లోనూ 70శాతం పైనా పోలింగ్‌ నమోదైంది. కరీంనగర్‌లో 62.52 శాతానికే పరిమితమైంది. గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. 2014 సంవత్సరంలో జరిగిన నగరపాలక ఎన్నికలతో పోల్చితే 3 శాతం పెరిగినప్పటికీ శివారు గ్రామాల విలీనం ప్రభావం చూపించింది.

2018 అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ శాతం
కరీంనగర్‌: 63.20

2014 నగరపాలక ఎన్నికల్లో ఓటర్ల వివరాలు
నగరం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం
కరీంనగర్‌ 228856 136800 59.59

2019 పార్లమెంటు ఎన్నికల ఓటర్ల వివరాలు
నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పోలింగ్‌ శాతం
కరీంనగర్‌ 1650893 1147697 69.51

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.