close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

‘పుర’భివృద్ధి చెందేలా..!

సీఎం దిశానిర్దేశంతో ఆశలు
కార్యాచరణ దిశగా సమాయత్తం
ఉమ్మడి జిల్లాలో రూపుమారనున్న పట్టణాలు
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, న్యూస్‌టుడే- కార్పొరేషన్‌

మ్మడి జిల్లాలోని పట్టణాల ప్రగతి దిశగా ఆశలు చిగురిస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సుకు నాలుగు జిల్లాల నుంచి మంత్రులతోపాటు పురపాలిక ఛైర్మన్లు, మేయర్లు, పాలనాధికారులు, కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం పట్టణ ప్రగతి నిర్వహణకు సంబంధించిన విధివిధానాలతోపాటు కార్యాచరణను ఖరారు చేయడంతో జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టత వచ్చినట్లయింది. ఈ నెల 24 నుంచి 10 రోజులపాటు కరీంనగర్‌, రామగుండం నగరపాలక సంస్థలతోపాటు 14 పురపాలికల్లో పట్టణ ప్రగతిని కొనసాగించేందుకు అవసరమైన చర్యల్ని నాలుగు జిల్లాల పరిధిలో తీసుకోనున్నారు. పూర్తిస్థాయి ప్రణాళికలను రూపొందించి అభివృద్ధికి అడుగులేయాలని సీఎం సూచించడంతో ఆ దిశగా చర్యలు శరవేగంగా కనిపించనున్నాయి. ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో ప్రధానంగా పట్టణాలను ఆదర్శంగా తీర్చే క్రతువులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యాన్ని ప్రస్తావించడంతో అందరూ ఉత్సాహాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి ఈటల రాజేందర్‌, పురపాలిక  మంత్రి కేటీఆర్‌, మరో ఇద్దరు మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ సదస్సులో పాల్గొన్నారు. కరీంనగర్‌, రామగుండం మేయర్లు సునీల్‌రావు, అనిల్‌కుమార్‌తోపాటు ఇటీవల ఎన్నికైన అన్ని పురపాలికల ఛైర్మన్లు, ఛైర్‌పర్సన్లు సదస్సులో సీఎం మాటల్ని శ్రద్ధగా ఆలకించారు. నాలుగు జిల్లాల పాలనాధికారులు శశాంక, కృష్ణభాస్కర్‌, సిక్తాపట్నాయక్‌, రవితోపాటు నలుగురు అదనపు కలెక్టర్లు, నగరపాలక, పురపాలక కమిషనర్లు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా సదస్సులో భాగస్వామ్యమయ్యారు. ఈ రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల వారీగా పట్టణ ప్రగతి అమలు విషయమై జిల్లా స్థాయిలో సమీక్షల్ని నిర్వహించుకోనున్నారు.

మొక్కుబడిగా వద్దనేలా..!
సదస్సులో సీఏం స్పష్టంగా కార్యక్రమ అమలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపిస్తుందనే విషయాన్ని పదేపదే చెప్పడంతో జిల్లాలో అమలు చేసే విషయంలో మరింత శ్రద్ధను ఈకార్యక్రమం విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చూపించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా పారదర్శక విధానాలు పరిపాలనలో కనిపించాలని, అవినీతి తీరు మారాలని సీఎం సూచించడంతో ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ప్రజాప్రతినిధులు ఈ విషయంపై మొదటి నుంచే దృష్టి పెట్టేలా చొరవ తీసుకోనున్నారు. ఇదే సమయంలో పట్టణ ప్రగతి విషయంలో మొక్కుబడి తీరు ఉండవద్దని ఫొటోలకు ఫోజులివ్వడం కాకుండా అసలు గతిని మార్చేలా పట్టణాల రూపురేఖల్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పడంతో జిల్లాలో పది రోజుల కార్యక్రమం మంచి ఫలితాల్నిచ్చేలా కనిపిస్తోంది. చెత్త సేకరణ, తొలగింపు, వాహనాల తీరు, పచ్చదనం, నర్సరీలపై సరైన అవగాహనను ఏర్పరచుకోవాలని చెప్పడంతో సమున్నత ఆశయంతో  కార్యాచరణ అమలు దిశగా అడుగులేయనుందనేది స్పష్టంగా అవగతమవుతోంది.

సీఎం దృష్టికి పలు సమస్యలు..
సదస్సు అనంతరం సీఎం మేయర్లతో కలిసి భోజనం చేసే క్రమంలో కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు పలు సమస్యల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. భోజన సమయంలో సీఎంకు సమీపంలోనే మేయర్‌ సునీల్‌రావుతోపాటు మంత్రి ఈటల రాజేందర్‌ కూర్చున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా పట్టణ ప్రగతికి పూనుకోవడం మంచి కార్యక్రమమని మేయర్‌ సీఎంతో అనగా.. ‘పట్టణాల రూపురేఖలు మారాలి కదా సునీల్‌’ అంటూ సీఎం బదులిచ్చారు. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు నరగ, పురపాలక కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు నగరపాలికల్లో పని చేస్తున్న ఉద్యోగులు రిటైర్డ్‌ అవుతున్నారని, వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయకపోవడంతో పరిపాలన పరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పడంతో.. త్వరలోనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యని పరిష్కరిస్తామని సానుకూల స్పందనని సీఎం తెలిపారు. ఓనర్‌షిఫ్‌, వాల్యువేషన్‌ ధ్రువపత్రాల జారీ నిలిపి వేశారని, దీనికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మేయర్‌ వివరించారు. దీనిపై ప్రభుత్వపరంగా ఆలోచన చేయాలని కోరారు. వీటన్నింటిని విన్న సీఎం ప్రాధాన్య క్రమంలో అన్ని ఇక్కట్లను తీర్చి కొత్త హంగుల్ని నగర, పురపాలికలకు అందిస్తామని హామీ ఇచ్చారు. సదస్సు అనంతరం  గజ్వేల్‌ అభివృద్ధిని చూసి మైమరిచారు. ఈ ‘నమూనా’ను మన వద్దా అమలు చేస్తే ఎంత బాగుంటుందోనంటూ ఆలోచనల్లో పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు మంగళవారం గజ్వేల్‌ పట్టణాన్ని మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, పురపాలికల అధ్యక్షులు సందర్శించారు. వర్గల్‌ మండలంలోని సింగాయపల్లి అడవి, గజ్వేల్‌ పట్టణంలోని సమీకృత మార్కెట్‌, వైకుంఠధామం, అర్బన్‌పార్కును వారు పరిశీలించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.