close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

శైవక్షేత్రం శివరాత్రి వైభవం

20 నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ
వేములవాడలో శివరాత్రి తర్వాతే శివ కల్యాణం

కోడె కడితే కోటి వరాలిచ్చే ఎముడాల రాజన్న కొలువైన శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. లెంబాలవాటికగా పేరుగాంచి క్రమేణా వేములవాడ పట్టణంగా మారి ప్రసిద్ధ ఆధ్యాత్మిక పట్టణంగా విరాజిల్లుతుంది. పట్టణం నడిబొడ్డున ఆలయాలతో నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. దక్షిణకాశీగా పేరుగాంచి, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందింది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ మహా శివరాత్రి. ఈ మహా జాతరను ఈనెల 20 నుంచి 3 రోజుల పాటు నిర్వహించేందుకు ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపడుతుంది. ఈ సందర్భంగా రాజన్న ఆలయ స్థలపురాణం, పట్టణంలో ఆలయాలు, పూజల వివరాలపై కథనం.

వేములవాడ, న్యూస్‌టుడే

రాజన్న ఆలయంలోని ధర్మగుండానికి చాలా చరిత్ర ఉంది. మహిషాసురిడిని వధించిన తర్వాత పార్వతిదేవి రక్తపుమరకలతో వేములవాడ ఆలయం వద్దనున్న ధర్మగుండంలో స్నానాలు ఆచరించింది. అమ్మవారు స్నానం చేసిన పవిత్ర పుష్కరణి కావడంతో ముక్కోటి దేవతలు గుండంలో స్నానాలు చేసినట్లుగా ప్రచారంలో ఉంది. దేవతల ప్రభువైన ఇంద్రుడు వృత్తాసురడిని వధించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందేందుకు తన గురువు బృహస్పతిని కోరగా వేములవాడ ధర్మగుండంలో స్నానమాచరించి శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి స్వర్గానికి వెళ్లినట్లుగా ప్రచారముంది. దక్షుడు చేసే యజ్ఞంలో వీరభద్రునిచేత బాహువులను కోల్పోతాడు. బ్రాహ్మణోత్తముల సూచనలతో తన బాహువులను పొందేందుకు ధర్మగుండంలో స్నానం చేసి ఆలయంలో పూజిస్తే స్వర్ణబాహువులు పొందినట్లుగా ఇక్కడ వర్ణిస్తారు. అందుకే రాజన్న ఆలయానికి ఆదిత్యక్షేత్రం, భాస్కరక్షేత్రంగా పేరుంది. అజ్ఞాతవాసం గడిపిన పాండవులు, వనవాసంలో సీతారామచంద్రమూర్తులు దర్శించుకుని తపస్సు చేసినట్లుగా పురాణాల్లో ఉన్నట్లుగా స్థానికల అర్చకులు పేర్కొంటున్నారు. శివుడు విశ్రాంతి కోసం ఎవరికీ చెప్పకుండా కైలాసం నుంచి వేములవాడకు చేరాడని, గమనించిన వృషభుడు శివుడి వెనుకాలే వేములవాడకు వచ్చాడు. వృషభుని భక్తికి మెచ్చిన శివుడు రాజన్న ఆలయంలో తనకు కోడెమొక్కులు చెల్లించి తనతో సమానంగా చూస్తారని వరమిచ్చినట్లుగా స్థానికంగా కథనం ప్రచారంలో ఉంది.

 

వేములవాడలో మాత్రమే కనిపించే ప్రత్యేక పూజలు...
ఇతర హిందూ ఆలయాల్లో కనిపించని పూజలు వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రమే ఉన్నాయి. తాము కోరుకున్న కోర్కెలు తీరాలని ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకుంటారు. రైతులు కోడెలను అప్పగించే ఆచారం ఆలయంలో కొనసాగుతుంది. కోడెలతో ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలాచరించి తడిగుడ్డలతో శివుడి వాహనమైన కోడెను (నందీశ్వరడు) పట్టుకుని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అల్లుబండకు (రాతిస్తంభం) కట్టడం సంప్రదాయంగా వస్తుంది. ఆలయంలో అద్దెకోడెలతోనూ కోడెమొక్కులను చెల్లించుకోవచ్చు. భక్తులు తమ సొంత కోడెలను కూడా ఆలయానికి సమర్పించవచ్చు. ఆలయంలో ప్రధానంగా కోడెమొక్కుల ద్వారానే అధికంగా ఆదాయం అందుతుంది. ఆలయంలో మరో ప్రత్యేక పూజ అన్నపూజ అన్నంతో స్వామివారిని అభిషేకించి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. మొదట్లో రైతులు పండించిన తొలిపంటను స్వామివారికి నివేదించే ఆనవాయితీ అన్నపూజగా కొనసాగుతుంది. రాజన్న ఆలయంలో ప్రసిద్ధి గాంచిన మరో ప్రత్యేక పూజ మహాలింగార్చన. సంవత్సరంలో ఒకసారి మహాలింగార్చన చేస్తే సంవత్సరం మొత్తం శివుడిని పూజించిన ఫలితం ఉంటుందని శివభక్తుల నమ్మకం. పలు పర్వదినాల్లో ఆలయంలో ఘనంగా మహా లింగార్చన పూజలు ఉంటాయి. మట్టితో తయారు చేసిన 366 చిరులింగాలను లింగాకారంలో పేర్చి పూజలు చేస్తారు. రాజన్న ఆలయ ప్రాంగణంలో 366 దేవతలు ఉండటంతో 15 ఆవరణలో పూజిస్తారు. అన్నపూజ, ఆకు పూజలు ఉన్నాయి. వేములవాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన బద్దిపోచమ్మ ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి బోనాలు చెల్లించుకోవడం ఆనవాయితీ ఉంది. ఆలయానికి సమీపంలోనే శ్రీభీమేశ్వరాలయం ఉంది. నవగ్రహాల పూజలకు ప్రసిద్ధి. బద్దిపోచమ్మ ఆలయం ఎదురుగా నగరేశ్వర స్వామి ఆలయం ఉంది. పట్టణంలో పురాతనమైన శ్రీకేదారేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తులు పూజలు చేస్తుంటారు.

 

దేవతలకు నిలయం
శ్రీరాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంతో పాటు పలు ప్రసిద్ధిగాంచిన ఆలయాలున్నాయి. రాజన్నక్షేత్రం ఆవరణలోనే 366 మంది దేవతలు ఉన్నారు. వేములవాడ ఆలయాల్లో మాత్రమే కనిపించే పూజలు మరే ఇతర ఆలయాల్లో ఉండవు. ప్రతిచోట శివరాత్రికి శివకల్యాణం నిర్వహిస్తుంటే వేములవాడలో మాత్రం కామదహనం తర్వాత శివకల్యాణం నిర్వహిస్తారు. వేములవాడ పట్టణంలో ప్రసిద్ధ శ్రీరాజారాజేశ్వరస్వామి ఆలయంతో పాటు, ప్రముఖ దేవాయాలుగా పేరుగాంచిన బద్దిపోచమ్మ, భీమేశ్వరాలయంతో పాటు పురాతనమైన నగరేశ్వర, కేదారేశ్వర ఆలయాలు ఉన్నాయి. వేణుగోపాలస్వామి ఆలయం, 8 హనుమాన్‌ దేవాలయాలు, గాయత్రీమాత ఆలయం, అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి. ఆలయం వివిధ మతాలు, పలు ఆచారాలకు నెలవుగా ఉంది. పేరుకే శివాలయమైన శైవంతో పాటు వైష్ణవ పూజలకు అంతే స్థానం ఉంది. రాజన్న ఆలయంలో క్షేత్రపాలకుడిగా అనంతపద్మనాభస్వామి ఉండటం, శ్రీసీతారామచంద్రమూర్తి స్వామివారి ఆలయం ఉండటంతో వైష్ణవపూజలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. శ్రీరామకల్యాణం ఘనంగా జరుగుతుంది. మహాశివరాత్రి తర్వాత పెద్ద వేడుక శ్రీరామనవమే. శైవులు, వైష్ణవులు, జైనులు, ముస్లిం మతస్థులతో పాటు అన్ని వర్గాల వారు కొలిచేక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఆలయంలో ప్రతినిత్యం అభిషేకాలు, శివ కల్యాణాలు, కుంకుమార్చనలు, మహాపూజ, పెద్దసేవ తదితర పూజలతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. రాజన్న గర్భగుడిలో మూలవిరాట్టు శ్రీరాజరాజేశ్వరస్వామి ఎడుమ వైపున శ్రీలక్ష్మీగణపతి, కుడివైపున పార్వతీదేవి ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా ముస్లిం దర్గా ఉండటంతో పెద్ద ఎత్తున ముస్లిం, హిందువులు దర్గాతో పాటు ఆలయంలో పూజించడం ఇక్కడ ప్రత్యేకత.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.