close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రమాద ఘంటికలు

 ఉమ్మడి జిల్లాలో ఒక్క రోజే 32 మందికి కరోనా

 నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరింత ముప్పే..!
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

కంటికి కనిపించని వైరస్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపుగా అన్ని ప్రాంతాలకు ఇది విస్తరిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా చాపకిందనీరులా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. శనివారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. కరీంనగర్‌ జిల్లాలో 16 కేసులు , సిరిసిల్ల జిల్లాలో ఏడు, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నాలుగు చొప్పున కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల్లో వెల్లడైంది. గడిచిన నెల రోజుల నుంచి ఊహించని విధంగా పాజిటివ్‌ కేసులు జిల్లాల్లో పెరుగుతుండటంతో అన్నివర్గాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. పైగా ఇప్పటి వరకు కరోనా కారణంగానే మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. ఇక అనుమానిత లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య అనధికారింగా ఎక్కువగానే ఉంది.
లింకులన్నీ.. రాజధానివే..!
ఇటీవల బయటపడుతున్న కేసుల మూలాలన్నీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో ముడిపడినవే అవడం గమనార్హం. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు, ఆర్టీసీˆ బస్సుల పునరుద్ధరణ తరువాత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి రాకపోకల తీరు క్రమంగా పెరిగింది. ఈ తరుణంలోనే తాజాగా రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చిన వారి ద్వారానే సంక్రమిస్తున్నట్లు వైద్యవర్గాల పరిశీలనలో తేలింది. దీంతో భాగ్యనగరమంటేనే నాలుగు జిల్లాల ప్రజలు భయపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పట్టణ ప్రాంతాల్లో కనిపించిన తీవ్రత క్రమంగా పల్లెలకు పాకింది. మొదట్లో జగిత్యాల జిల్లాలో మహారాష్ట్ర నుంచి సొంత జిల్లాకు వచ్చిన వలస కార్మికుల రూపంలో వైరస్‌ ప్రభావం అధికంగా కనిపించింది. ఇలా వారం, పది రోజుల వ్యవధిలోనే 60వరకు కేసులు ఈ జిల్లా ప్రజలను కలవరానికి గురిచేశాయి. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకే సుమారుగా 5వేల మంది వరకు వలస కార్మికులు తిరిగి స్వగ్రామాలకు చేరుకుని స్వీయగృహ నిర్బంధంలో ఉన్నారు.  కొత్తగా హైద్రాబాద్‌కు వివిధ పనుల కోసం వెళ్లిన వారితోపాటు అటునుంచి జిల్లాలకు వస్తున్న వారి రూపంలో కొత్త గుబులు పెరుగుతోంది.
కరీంనగర్‌లో మళ్లీ.. కలకలం
కరీంనగర్‌ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు రాష్ట్రస్థాయిలోనే సంచలనానికి కేంద్ర బిందువైన కరీంనగర్‌లో మళ్లీ మెల్లిమెల్లిగా కేసులు పెరుగుతుండటంతో కలకలం రేగుతోంది. సగటున రోజుకు నాలుగైదు కొత్త కేసులు ఆయా ప్రాంతాల్లో పుట్టుకువస్తుండటంతో అందరిలో ఆందోళన తప్పడం లేదు. ఇటీవల రెండు వారాల్లోనే సుమారుగా 50కిపైగా కేసులు నగరంలోనే నమోదవడం గమనార్హం. కంటైన్‌మెంట్ల పరిస్థితి గతంలో మాదిరిగా లేకపోవడం, పాజిటివ్‌ వచ్చిన వారు ఇళ్లల్లోనే గృహనిర్బంధంలో ఉంటుండటంతో బాధితుడు నివాసముంటున్న కాలనీ వాసులు కలవరానికి గురవుతున్నారు.  మరోవైపు నగరపాలక, పురపాలక సంస్థలు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. రసాయన ద్రావణాల్ని ఆయా ప్రాంతాల్లో చల్లుతున్నారు.


అప్రమత్తతే.. అందరికీ రక్ష

లాక్‌డౌన్‌ తరువాత జనంలో పెరిగిన నిర్లక్ష్యమే కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. చాలామంది బయట సంచరించే సమయంలో మాస్కులు లేకుండా తిరుగుతుండటంతోపాటు భౌతిక దూరాన్ని పాటించక పోవడంతో అనర్థం పెరుగుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల వద్ద, రోడ్లపైన పోటీ పడి మరీ గుంపులుగా కనిపిస్తున్నారు. దీంతో వైరస్‌ బారిన పడిన వ్యక్తిని కలుస్తూ అతని ద్వారా ఒకరికి.. వారి నుంచి ఇంకొకరికి  ఇలా కనిపించకుండా.. ఎవరి ద్వారా ఎవరికి వస్తుందనే విషయం తెలియకుండా వ్యాధి తీవ్రత మాత్రం రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సీˆ్వయ నియంత్రణ పాటించడంతోపాటు వీలైనన్ని జాగ్రత్తల్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.