close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్పత్రిలో నిలిచిన ప్రసవాలు

అన్ని విభాగాలకు పాకుతున్న ‘కరోనా’

నిర్ధరణ పరీక్షల కోసం పెరుగుతున్న ఒత్తిళ్లు


గోదావరిఖనిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే: అత్యధిక ప్రసవాలకు నిలయంగా ఉన్న గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో పది రోజులుగా ప్రసవాలు నిలిచిపోయాయి. ఇప్పటికే ఆస్పత్రిలో ప్రసవాల విభాగంతో పాటు రక్తశుద్ధి కేంద్రం, నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఉంది. ఇటీవల ఇదే భవనంలో కరోనా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం వచ్చే వారు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో తిరుగుతుండడంతో ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఐసోలేషన్‌ కేంద్రంలోనూ ఆస్పత్రి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలోని పారిశుద్ధ్య కార్మికుల నుంచి మొదలుకొని వైద్యుల వరకు సుమారు 27 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ జరిగింది. చికిత్స తీసుకుంటూ 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండి తిరిగి విధుల్లో చేరుతున్నారు.

ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డు

ప్రసవానికి పాట్లు

ఆస్పత్రిలోని ఇద్దరు వైద్యులు అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 4 నుంచి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు నిలిచిపోయాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ఇక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నప్పటికీ ప్రసవానికి మాత్రం కరీంనగర్‌కు సిఫారసు చేస్తుండడంతో అయోమయానికి గురవుతున్నారు. అత్యవసరంగా సహజ ప్రసవం జరిగే అవకాశమున్న వారికి మాత్రమే ఇక్కడ ప్రసవాలు చేస్తుండగా మిగతా వారిని కరీంనగర్‌కు పంపిస్తున్నారు. సాధారణ వైద్యులు గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా భయంతోనే స్థానిక ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ ప్రసవాలు చేయడం లేదు. అత్యధిక ప్రసవాలు జరిగే ‘ఖని’ ఆస్పత్రిలో కేవలం ఇద్దరు మాత్రమే స్త్రీ వైద్య నిపుణులుండగా తక్కువ ప్రసవాలు జరిగే పెద్దపల్లి ఆస్పత్రిలో నలుగురు స్త్రీవైద్య నిపుణులున్నారు.

ఆస్పత్రిలోనే ఐసోలేషన్‌ కేంద్రం

నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలోనే కరోనా ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో మిగతా వైద్య సేవలు మృగ్యమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఇటీవల సుల్తానాబాదు టీబీ ఆస్పత్రికి తరలించారు. టీబీ ఆస్పత్రి మొత్తం కరోనా చికిత్సకే కేటాయించడంతో సాధారణ చికిత్స కోసం అక్కడికి ప్రజలు వెళ్లే అవకాశం లేకపోగా పెద్దపల్లి ఆస్పత్రిలో మిగతా వైద్య సేవలు ఊపందుకోనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లుగానే రామగుండం ప్రాంతంలోనూ ఏర్పాటు చేసి ప్రాంతీయ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ కేంద్రాన్ని తరలించి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని పలువురు కోరుతున్నారు.

వైద్యులతో వాదనలు

అత్యవసరమయితేనే కరోనా నిర్ధరణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తుండగా చాలా మంది కనీస లక్షణాలు లేకపోయినా తమకు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలంటూ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. కరోనా లక్షణాలుంటేనే ఇక్కడ వైద్య పరీక్షలు చేస్తామని, లేదంటే సుల్తానాబాదు ఆస్పత్రికి వెళ్లాలని చెప్పినా వినకుండా వైద్యులతో వాదనకు దిగుతున్నారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయిన ఓ వ్యక్తి తనకు కరోనా పాజిటివ్‌ రావడానికి ఆస్పత్రి వైద్యులే కారణమంటూ సూపరింటెండెంట్‌తో వాదనకు దిగడం గమనార్హం. ఆస్పత్రిలో నిత్యం ఇలాంటి అనేక సంఘటనలతో ఆస్పత్రి నిర్వహణలో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.