close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తీరు మారకుంటే ఎలా?

రెండేళ్లలో ఏడుగురు ఎస్సైల మార్పు

తాజాగా మరొకరిపై విచారణ

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

జిల్లాలో రెండేళ్లలో ఏడుగురు ఎస్సైలు పోస్టింగ్‌ వెళ్లిన కొద్దిరోజుల్లోనే పలు ఆరోపణలతో వీఆర్‌కు అటాచ్‌ అయ్యారు. తాజాగా మరో ఎస్సైపై విచారణ జరగడం చర్చనీయాంశమైంది.

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం కల్పించింది. వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు నైపుణ్యాలను మెరుగుపరచడం.. మౌలికవసతుల కల్పనలో భాగంగా పలు రకాల సేవలను చేరువ చేసింది. జిల్లా స్థాయిలో ఫిర్యాదుల స్వీకరణ.. వాటి పరిష్కారంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. కాగా కొందరు పాత వాసన వదిలించుకోలేక పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు నేతల ప్రాపకం కోసం అత్యుత్సాహం ప్రదర్శించడం వంటి వ్యవహారాలు అక్కడక్కడా బహిర్గతమవుతున్నాయి.

పలు సంఘటనలతో బహిర్గతం

జిల్లాలో మానేరు పరివాహక ప్రాంతంలోని మండలాల్లో అనధికారిక ఇసుక తవ్వకాలు.. మామూళ్ల వ్యవహారంలోనే ఎక్కవ సంఘటనలు జరిగాయి. మిగతా చోట్ల పైరవీకారుల వ్యవహారం బెడిసికొట్టడంతో పలువురు ఎస్సైల వ్యవహారం బయటపడింది. రెండేళ్లలో ఏడుగురు ఎస్సైలు వీఆర్‌కు అటాచ్‌ అయ్యారు. రెండునెలల వ్యవధిలో కోనరావుపేట, ఇల్లంతకుంట, రుద్రంగి ఎస్సైలను ఎస్పీ కార్యాలయానికి ఆటాచ్‌ చేశారు. వీరి స్థానంలో కొత్తవారికి పోస్టింగ్‌లు ఇచ్చారు.

* తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన కొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు చాలా మంది ఇసుక వివాదాల్లో చిక్కుకున్నారు. విచారణ తర్వాత క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కార్యాలయానికి అటాచ్‌ చేశారు. కొత్త జిల్లాలు, మండలాల ఆవిర్భావంలో ఏర్పడిన తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో నాలుగేళ్లలో ఏడుగురు ఎస్సైలు మారారు.

* ఇల్లంతకుంటలో పనిచేసిన ఓ ఎస్సై, కానిస్టేబుల్‌ మధ్య ఇసుక మామూళ్ల వ్యవహారం బెడిసికొట్టింది. సివిల్‌ వ్యవహారాల్లో తలదూర్చడంతో ఎదుటివారు ఆడియో రికార్డులను బహిర్గతం చేశారు. వీటితోపాటు స్టేషన్‌ పరిధిలో జరిగే పలు విషయాలు ఎస్పీ దృష్టికి వచ్చాయి. విచారణ తర్వాత ఎస్సై, కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో ఇసుక మామూళ్ల వ్యవహారంలో సంబంధం ఉన్న బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లోని కానిస్టేబుల్‌పైనా వేటు పడింది.

* కోనరావుపేటలోనూ రెండు వర్గాల భూ వివాదంలో ఎస్సై కలగజేసుకొని వివాదాస్పదంగా మారారు. దీనితోపాటు ఫోన్‌లో దుర్భాషలాడిన వ్యవహారంలో ఎస్పీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్‌కు అటాచ్‌ చేశారు. గతంలోనూ ఇక్కడ పనిచేసిన ఓ అధికారి డబ్బులు చేతులు మారిన వ్యవహారంలో కలగజేసుకున్నందుకు వీఆర్‌కు అటాచ్‌ చేశారు.

* రుద్రంగి ఎస్సైని నెలరోజుల క్రితం జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవహారం బెడిసికొట్టడంతో ఆయా లావాదేవీలు బయటకు తీశారు. వివాదాల్లో చిక్కుకున్న ఎస్సై స్థానంలో మరొకరికి పోస్టింగ్‌ ఇచ్చారు.

* సిరిసిల్ల డివిజన్‌లో ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల సర్కిల్‌ పరిధిలోని పలు కేసుల వ్యవహారాల్లో కొందరు జోక్యం చేసుకున్న విషయం బహిరంగంగా చర్చనీయాంశంగా మారింది. తర్వాత క్రమంలో వారిపై బదిలీవేటు వేశారు. గంభీరావుపేటలో ఇసుక వాహనం తప్పించే క్రమంలో సీఐ, ఎస్సైలు ఏసీబీకి పట్టుబడ్డారు.

* బోయినపల్లిలో మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో పోలీసులకు, ప్రజాప్రతినిధులకు మధ్య విభేదాలు తలెత్తాయి. వీటిని కొందరు స్వలాభాం కోసం వాడుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విచారణ జరిగింది. రెండ్రోజుల క్రితం పూర్తి విచారణ నివేదికను ఎస్పీకి అందజేశారు.

పరిధి దాటి వ్యవహరిస్తే వేటు తప్పదు - రాహుల్‌ హెగ్డే, ఎస్పీ

పోలీసులు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే ఉపేక్షించేది లేదు. ప్రతి విషయంలో సహనంతో వ్యవహరించాలి. చట్టానికి లోబడి తమపని తాము చేసుకుంటూ వెళ్లాలి. చట్టం పరిధి దాటి వ్యవహరిస్తే వేటు తప్పదు. ఎస్సైలు, సిబ్బందిపై ఫిర్యాదులు, ఆరోపణలన్నింటిపై ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నాం. వాటి తీవ్రతను బట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.