close

గురువారం, అక్టోబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సౌకర్యాల లోగిళ్లు

అన్ని హంగులతో పట్టణ పేదలకు గృహాలు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో రెండుపడకల గృహసముదాయం

జిల్లాలో పట్టణ నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలో రోజుకూలీపై ఆధారపడి జీవించే బడుగుజీవులే 80శాతం ఉంటారు. వీరు చాలీచాలని వేతనాలతో ఇరుకుగదుల్లో అద్దెకు ఉంటూ..కుటుంబపోషణను భారంగా నెట్టుకొస్తున్నారు. ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వసతులతో కట్టించి ఇచ్చే ఇళ్లు దక్కితే.. వారి ఆనందానికి అవధులు ఉండవు. అచ్చంగా ఇదే లక్ష్యంతో ప్రభుత్వం రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. జిల్లా కేంద్రంలోని పేదలకు చిన్నపాటి నగరాలను తలపించే గృహసముదాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.

సిరిసిల్ల పట్టణంతోపాటు పురపాలికలో విలీన గ్రామాలను కలుపుకొని 2052 గృహాలు మంజూరయ్యాయి. వీటిని తంగళ్లపల్లి మండలం మండేపల్లి, పెద్దూరు, శాంతినగర్‌, రగుడు ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. శాంతినగర్‌, రగుడులోని నిర్మాణాలు చివరిదశలో ఉన్నాయి. ఇటీవల పురపాలకశాఖ ఆధ్వర్యలో దరఖాస్తులు స్వీకరించారు. పట్టణంలోని 33 వార్డులకు గాను 7185 దరఖాస్తులు వచ్చాయి. వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసే పనిలో ఉన్నారు. అనంతరం రెవెన్యూశాఖ దరఖాస్తుదారుల వివరాలతో ఇంటింటికీ వెళ్లి వారి స్థితిగతులను పరిశీలించి తుదిజాబితాను సిద్ధం చేస్తారు. తర్వాత వార్డులవారీగా సమావేశం ఏర్పాటు చేసి.. అర్హులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో రెండువారాల సమయం పట్టే అవకాశముంది.

నిధుల కేటాయింపు

సిరిసిల్ల పట్టణానికి మొదటి విడతగా మంజూరైన 1260 గృహాల నిర్మాణానికి 2017కు ముందు గుత్తేదారు ఒప్పందం చేసుకున్నారు. దీంతో అక్కడ మాత్రమే ఒక్కో గృహానికి రూ.75వేల చొప్పున మౌలిక వసతులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. పెద్దూరు, రగుడు, శాంతినగర్‌లో గుత్తేదారు 2017 తర్వాత ఒప్పందం చేసుకోవడంతో నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. మండేపల్లిలో నిర్మాణం పూర్తయిన నిర్మాణాలను జిల్లాలో రెండుపడకగదుల ఇళ్లకు ఒక నమూనా గృహసముదాయంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.

పైరవీలకు అవకాశంలేకుండా

రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో కొందరు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి కేటీఆర్‌ పలుమార్లు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో అధికారులు, ప్రజాప్రతినిధుల జోక్యం ఉండదని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక నిరుపేదల అదృష్టానికి ఒక పరీక్షగా మారింది.

పారదర్శకంగా ఎంపిక

- అంజయ్య, అదనపు కలెక్టర్‌

జిల్లాలో మొదటి విడతగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు రెండుపడక గదుల ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఆర్జీలు ఎక్కువగా రావడంతో అర్హుల ఎంపికకు సమయం పడుతుంది. నిరుపేదలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుల నుంచి ఎంపికవరకు ప్రతి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తాం. మౌలిక వసతుల నిధుల కేటాయింపునకు ప్రభుత్వానికి నివేదిక పంపాం. భగీరథ పథకంలో తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. అంతర్గత రహదారులు, మురుగుకాల్వల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు ఆలస్యమైతే పురపాలక సంఘం నుంచి కేటాయించేలా చూస్తున్నాం.

పట్టణ గృహనిర్మాణాల వివరాలు

మంజూరైనవి: 2052

కేటాయించిన నిధులు: రూ.108.75కోట్లు

మౌలికవసతులకు: రూ.9.45కోట్లు

మంజూరుకావాల్సిన నిధులు: రూ.5.94కోట్లు

వచ్చిన దరఖాస్తులు : 7185

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.