close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

ప్రధానాంశాలు

భూ సేకరణకు సామాజిక, ఆర్థిక సర్వే

పీవీకాలనీ(మణుగూరు), న్యూస్‌టుడే

బీటీపీఎస్‌ అవసరాల కోసం ఏర్పాటు చేయనున్న రైలు మార్గానికి కావాల్సిన భూమిని సేకరించేందుకు మరోసారి సర్వే చేయనుంది. రైలు మార్గం ఏర్పాటుతో భూములు, ఇళ్లు కోల్పోయే వారికి ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అమలు చేయనుంది. అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సోమవారం నుంచి సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బీటీపీఎస్‌కు కావాల్సిన బొగ్గును రవాణా చేసేందుకు మణుగూరు నుంచి 17 కిలోమీటర్లు రైలు మార్గం ఏర్పాటు కానుంది. రైలు మార్గం నిర్మించేందుకు జెన్కో.. రైట్స్‌ సంస్థకు అప్పగించింది. రైలు మార్గం ఏర్పాటు కాబోయే ఆయా గ్రామాల్లోని రైతులు, ప్రజల నుంచి భూమిని ప్రభుత్వం సేకరించి జెన్కోకు అప్పగించనుంది. మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో నుంచి ప్రభుత్వం 516 మంది రైతుల నుంచి 121 ఎకరాల భూమిని సేకరించనుంది.

సర్వే తర్వాతే గ్రామసభలు

రైలు మార్గం కోసం ప్రభుత్వం మణుగూరులో 24.02, సమితిసింగారంలో 16.22, రామానుజవరంలో 80.15 ఎకరాల భూమిని సేకరించనుంది. ఈ మూడు రెవెన్యూ గ్రామాల్లో భూములను తీసుకోవటంతోపాటు 151 ఇళ్లను తొలగించనున్నారు. రైతులు, గ్రామస్థుల నుంచి భూ సేకరణ చేపట్టేందుకు కొద్ది నెలల క్రితం ప్రభుత్వం పలు దఫాలుగా గ్రామ సభలు నిర్వహించింది. ఈ సభల్లో పట్టా భూమి ఎకరానికిి రూ.8 లక్షలు, ప్రభుత్వ భూమి అయితే మరో విధమైన పరిహారం, ఇళ్లు కోల్పోయే వారికి ఇంటి విలువను లెక్కించి పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం చెల్లిస్తానన్న పరిహారంపై గ్రామస్థులు, రైతులు వ్యతిరేకించి, న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బీటీపీఎస్‌ నిర్వాసితులకు చెల్లించిన పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గ్రామ సభలు ఆమోదం లభించక వాయిదాలు పడ్డాయి. రైతుల డిమాండ్‌ మేరకు ప్రభుత్వం భూములు, ఇళ్లు కోల్పోయే వారికి 2013 చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేసేందుకు ప్రస్తుతం సామాజిక, ఆర్థిక సర్వేకు శ్రీకారం చుట్టింది. భూములు కోల్పోయే నిర్వాసితులకు నష్ట పరిహారంతోపాటు అర్హులైన వారికి ప్యాకేజీ వర్తింపజేయనుంది. సర్వే పూర్తయిన తర్వాత మళ్లీ గ్రామ సభలు నిర్వహించి, అభ్యంతరాలు ఉంటే ప్రజల నుంచి స్వీకరించనున్నారు.

అయిదు బృందాలు

రైలు మార్గం కోసం సేకరించే భూమి, ఇళ్ల కోసం ప్రభుత్వం చేసే సామాజిక, ఆర్థిక సర్వే కోసం నాయబ్‌ తహసీల్దార్లు, సర్వేయర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, వీఆర్వోలతో కూడిన అయిదు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులున్నారు. గ్రామస్థులు, రైతుల వివరాలు నమోదు చేసుకునేందుకు వీరికి ఒక ప్రత్యేక సర్వే ఫార్మాట్‌ అందజేశారు. సర్వే వివరాలను స్వీకరించేందుకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, మణుగూరు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లను నియమించారు. ప్రత్యేకంగా ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ని ఏర్పాటు చేశారు. సర్వే బృందాలకు జెన్కో సంస్థ రవాణా, ఇతర సదుపాయాలను కల్పించనుంది. జరిగే సర్వేను వీడియో, ఫొటోలతో చిత్రీకరించనున్నారు. సర్వేలో ఇంటి సంఖ్య, ఇంటి పెద్ద పేరు, తండ్రిపేరు, వయస్సు, సామాజికవర్గం, ఆదాయం, వృత్తి, భూమి వివరాలతోపాటు, భూమిపై ఆధారపడి జీవిస్తున్న వారు ఎంత మంది? కౌలుదారులు ఎవరైనా ఉన్నారా? గిరిజనులు అటవీ భూమిని ఎంత సాగు చేస్తున్నారు? ఇళ్లు కోల్పోయే వారి సంఖ్య ఎంత? కుటుంబంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులు ఎంతమంది తదితర వివరాలు సేకరించనున్నారు.


ఆర్థిక స్థితి తెలుసుకునేందుకు

భవేశ్‌మిశ్రా, సబ్‌ కలెక్టర్‌, భద్రాచలం

రైలు మార్గం కోసం భూమిని సేకరించనున్నాం. జాబితాలో ఉన్న రైతులు, గ్రామస్థుల ఆర్థిక స్థితిని తెలుసుకునేందుకు సామాజిక, ఆర్థిక సర్వే చేపడుతున్నాం. సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయనున్నాం. సర్వేలో అన్ని వివరాలు తెలుస్తాయి. నిర్వహించిన సాధారణ గ్రామసభల్లో గ్రామస్థులు, రైతులు డిమాండ్‌ ఏమిటో తెలిసింది. సర్వే అనంతరం అభ్యంతరాలుంటే స్వీకరిస్తాం.


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.