close

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

ప్రధానాంశాలు

సకాలంలో అందని రైతుబంధు

వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

‘రైతుబంధు’ పెట్టుబడి రాయితీ మంజూరు చేయటంలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు తిరిగి ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు.

జిల్లాలో మొత్తం 2,81,740 మంది సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు. వీరికి గత ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రూ.345 కోట్లు మంజూరు చేసింది. ఈ పంట పెట్టుబడి చాలామంది రైతులకు అందలేదు. జిల్లాలో 2,08,004 మంది రైతులకు రూ.226 కోట్లు మాత్రమే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసింది. మిగతా రైతులకు ఇంత వరకు కూడా మంజూరు కాలేదు. రబీ సీజన్‌ నడుస్తున్నా వీటి గురించి ఇంత వరకు ఎలాంటి ప్రకటన లేకపోవటంతో అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నా ప్రయోజనం లేకుండాపోతోంది.

అరకొర సాయమే.. అర ఎకరం రైతుల ఖాతాలో తొలిసారి జమ చేసి ఆ తర్వాత ఎకరాలను బట్టి విడతల వారీగా మంజూరు చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించటంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అర ఎకరం రైతులు జిల్లాలో సుమారు 30-35 వేల మంది వరకు ఉంటారు. వీరిలో చాలామంది తమ భూముల్లో కూరగాయలను, ఆకుకూరలను సాగు చేసుకుంటారు. అరెకరం రైతుకు ప్రభుత్వం నుంచి రూ.2,500 మాత్రమే వస్తుంది. కనీసం 2-3 ఎకరాల మధ్య రైతులకు మంజూరు చేస్తే 70 శాతం మందికి ప్రయోజనం జరిగి ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐదెకరాల లోపు మంజూరు చేస్తే 90శాతం మంది రైతులకు ప్రయోజనం జరిగి ఉండేదంటున్నారు. ఖమ్మం జిల్లాలో 10 ఎకరాల లోపు రైతులు 2,76,030 మంది ఉండగా, 10 ఎకరాల పైన సుమారు 5,000 మంది రైతులు ఉన్నారు. అర ఎకరం పైన ఉన్న రైతులకు రైతుబంధు ఎప్పుడు మంజూరు చేస్తుందనే విషయంపై ఇంత వరకు స్పష్టత లేదు.

వెసులుబాటు లేక..

రాను రాను రైతులకు పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రైతుబంధు పథకం రైతులకు కొంత వెసులుబాటు కలిగించింది. అయితే ఆ ఇచ్చే సొమ్ము సకాలంలో ఇవ్వకపోవటం వల్ల రైతులు పెట్టుబడుల కోసం బయట వడ్డీలకు తెస్తున్నారు. రైతుబంధు ఆలస్యం కావటం వల్ల వచ్చే సొమ్ము కాస్త వడ్డీలకే సరిపోతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండెకరాల రైతులకు రూ.5వేల చొప్పున ఇస్తే రూ.10వేలతో వారికి కొంత వెసులుబాటు కలిగేది. రబీ సీజన్‌కి సంబంధించి రైతులకు సెప్టెంబరు, అక్టోబరులో పెట్టుబడి అవసరం ఉంటుంది. జనవరి నెలాఖరుకు వచ్చినప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో రైతుబంధు పథకం అందకపోవటంపై రైతులు నిరుత్సాహంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.