close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చిన కేసీఆర్‌: చాడ

సీపీఐ జిల్లా నిర్మాణ మహాసభలో ప్రసంగిస్తున్న రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా సీపీఐ నిర్మాణ మహాసభ మంగళవారం నగరంలోని మేకల భిక్షమయ్య ఫంక్షన్‌ హాలులో నిర్వహించారు. తొలుత సీపీఐ జెండాను సీనియర్‌ నాయకులు మహ్మద్‌ మౌలానా ఆవిష్కరించారు. మహాసభ ప్రారంభానికి ముందు పుల్వామా దాడి ఘటనలో అమరులైన జవాన్ల మృతికి సంతాపంగా సభికులు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం బీజీ.క్లెమెంట్‌, యర్రా బాబు, కర్నాటి భానుప్రసాద్‌, మందడపు రాణి, అజ్మీరా రామ్మూర్తి అధ్యక్ష వర్గంగా సభ కొనసాగింది. దేశంలో ఆరెస్సెస్‌, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు భాజపా అండతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నాయని చాడ ఆరోపించారు. విద్యావంతులు, మేధావులను సైతం అరెస్టులు చేసి జైళ్లలో పెట్టడం అమానుషమన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనను వాడుకొని కేంద్రంలో మరోసారి భాజపా అధికారం చేపట్టిందని ఆరోపించారు. తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కశ్మీర్‌ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఆర్టికల్‌ 370, 30, 30(ఏ) రద్దు చేశారన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తుందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ విధానాలపై కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన గుత్తేదారులకు రూ.వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిపోయిందని మండిపడ్డారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలను తమ వైపు తిప్పుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మద్యం, డబ్బు ఏరులై పారిస్తూ విజయం సాధించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అగమ్యగోచరంగా మారిందన్నారు. జిల్లాలో పోడు భూముల సమస్యలను పరిష్కరించకపోగా అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఉద్యమాలకు ఖిల్లాగా నిలుస్తుందని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పార్టీ పూర్వ వైభవం కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు శ్రేణులు చేపట్టాలని పిలుపునిచ్చారు.

మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐక్య పోరాటాలే శరణ్యమని సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బూర్జువా, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు ఆటుపోట్లు సహజమేనని వెనుకబడిన ప్రతిసారి మరింత ముందుకు వచ్చేందు పట్టుదలతో పని చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శ్రేణులకు సూచించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు పార్టీ కార్యాచరణ, భవిష్యత్తు పోరాటాల ప్రణాళికలను మహాసభలో ప్రవేశపెట్టారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్‌, ఎస్‌కె.సాబీర్‌పాషా, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, శింగు నర్సింహారావు, ఎస్‌కె.జానిమియా, మహ్మద్‌సలాం, మందడపు నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ఏపూరి లతాదేవి, సీహెచ్‌.సీతామహాలక్ష్మీ, సిద్దినేని కర్ణకుమార్‌, అజ్మీరా రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.